-రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా
-పారదర్శకతతో కూడిన మర్యాద పూర్వక సేవలే లక్ష్యం
అమరావతి : రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల ద్వారా ప్రజలకు మరింత స్నేహ, మర్యాద పూర్వక వాతావరణం కల్పించడమే తమ ధ్యేయం అని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అన్నారు. విజయవాడ గుణదల సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సోమవారం సబ్ రిజిస్టార్ ప్రత్యేక పోడియం తొలగించే కార్యక్రమానికి సిసోడియా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్వయంగా పోడియం తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో సిసోడియా మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ అధికారులు కూడా ప్రజాసేవకులే అనే భావన ప్రజలలో కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో రిజిస్టార్ పోడియం చూస్తే ప్రజలకు మనం కోర్టులో ఉన్నామనే భావన కలగకుండా ఉండేందుకే ఇటువంటి మార్పులు తీసుకు వస్తున్నామన్నారు.
బ్రిటిష్ ప్రభుత్వ కాలం నాటి రాచరిక పోకడలు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలలో నేటికీ కొనసాగుతున్నాయన్నారు. ఇటువంటి పరిస్థితులు ప్రజల మనోభావాలలో కొంత అభద్రత, భయాందోళన వాతావరణాన్ని కల్పించే అవకాశం ఉందన్నారు. ఉద్యోగులు, అధికారుల సమానత్వంతో క్రయవిక్రయదారులు మర్యాదపూర్వకమైన సేవలను పొందగలుగుతున్నామనే భావన కల్పించగలుగుతామన్నారు.
ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని కల్పిస్తున్న క్రయవిక్రయదారులను ఎంతో మర్యాదపూర్వకంగా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. గత రాచరిక పోకడలకు స్వస్తి పలికేందుకు రిజిస్టార్, సబ్ రిజిస్టార్ల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక ఆసనాలు, పోడియంలను తొలగించి ఇతర ప్రభుత్వ కార్యాలయాలలో మాదిరి అదే తరహా సౌకర్యాలను రిజిస్టార్ కార్యాలయాలలో కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
ఈ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నామన్నామని, ఫలితంగా క్రయవిక్రయదారులు మంచి వాతావరణంలో సేవలను పొందగలుగుతారన్నారు. అత్యంత పారదర్శకతను పాటించేలా అన్ని చర్యలను తీసుకుంటున్నామన్నారు.
స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలలో రాచరిక పోకడలకు స్వస్తి పలికి సాధారణ, స్నేహపూర్వక వాతావరణం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశమన్నారు. ఇటువంటి సంస్కరణలు ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా నిలుస్తాయన్నారు.
ఇది ప్రజా ప్రభుత్వమని అధికారులు ప్రజాసేవకులే అన్న భావన కల్పించగలుగుతామన్నారు. నిస్వార్ధమైన సేవలందించి ప్రజల నుండి మన్ననలను పొందేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని గద్దె రామ్మోహన్ కోరారు.
కార్యక్రమంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కమీషనర్ శేషగిరి బాబు, విజయవాడ డిఐజి రవీంద్రనాథ్, ఎన్టీఆర్ జిల్లా రిజిస్ట్రార్ విఎస్ఆర్ ప్రసాద్, జిల్లా రిజిస్ట్రార్ (ఆడిట్) కె రామారావు, గుణదల సబ్ రిజిస్టార్లు కే.ప్రసాదరావు, ఎం. కృష్ణ ప్రసాద్ తదితరులు ఉన్నారు.