Suryaa.co.in

Andhra Pradesh Features

ఐపీఎస్ అధికారులకు జత్వాని కేసు ఒక గుణపాఠం

– ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పరువును ఈ కేసు దారుణంగా దెబ్బతీసింది
– పోలీస్ అధికారులకు కళ్ళు తెరిపించే ఘటన

చట్టాన్ని రక్షించవలసిన వారే.. చట్టాన్ని ధిక్కరిస్తే ప్రజలను ఎవరూ కాపాడలేరన్న విషయాన్ని కాదంబరి జత్వాన్ని కేసు రుజువు చేసింది. రాజ్యాంగ హక్కులను, చట్ట హక్కులను కాల రాసి విధి నిర్వహణ లోపానికి పాల్పడే అధికారులకు ఇది కనువిప్పు కలిగించే సంఘటన.

పాలకులకు ఊడిగం చేస్తూ.. రాజకీయ నాయకులతో కలిసి రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన, చట్ట హక్కుల ఉల్లంఘనకు పాల్పడే కొంతమంది ఐపీఎస్ అధికారులకు జత్వాని కేసు ఒక గుణపాఠం. అధికారంలో ఉన్న వారికి తొత్తులుగా మారి.. తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అహంకారంతో, రాజకీయ నాయకులతో మిలాఖతై మాఫియాగా మారిన కొందరు పోలీస్ అధికారులకు కళ్ళు తెరిపించే ఘటన.

కాదంబరీ జత్వానీ కేసులో డీజీ స్థాయి అధికారులను సైతం ఉపేక్షించకుండా చట్ట పరిధిలో.. నిబంధనలకు లోబడి ఐపీఎస్ అధికారులపై కూటమి ప్రభుత్వం వేటు వేయడాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు.ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలు హర్షిస్తున్నాయి.

నీతి నిజాయితీలు, అంకితభావం, నిబద్ధత కలిగిన ఐపీఎస్ అధికారులను సైతం అవినీతి పరులుగా, ప్రజా భక్షకులుగా మార్చగల శక్తిమంతుడు జగన్మోహన్ రెడ్డి అని మరోసారి రుజువయింది. ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ తోనే ప్రభుత్వం ఆగకుండా.. వారిని చట్ట పరిధిలో విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలి.

ఇప్పటికే జత్వాన్ని కేసులో ఎఫ్ఐఆర్ నమోదయింది కాబట్టి తక్షణం పోలీస్ అధికారులను అరెస్టు చేసి విచారణ జరిపించాలి. పాలకుల పట్ల స్వామి భక్తి ప్రదర్శిస్తూ.. రాజకీయ నాయకులతో కలిసి రాజ్యాంగబద్ధ విధి నిర్వహణను మరిచిన కొందరు అధికారుల వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పరువును ఈ కేసు దారుణంగా దెబ్బతీసింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పట్ల నమ్మకం కోల్పోయి ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి రావడం సమాజానికి, దేశానికి మంచిది కాదు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాదంబరి జత్వాని కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారుల టెక్నికల్ ఎవిడెన్స్ కాల్ డేటా, టవర్ లోకేషన్ల తో పాటు ఇంకా ఇతర అంశాలపై దర్యాప్తు జరిపించాలి. ఈ కేసులో ఐపీఎస్ అధికారులను కీలుబొమ్మలుగా మార్చిన పొలిటికల్ మాఫియా నిజరూపాన్ని బట్టు బయలు చేయడంతో పాటు, ఆనాటి ప్రభుత్వంలోని సూత్రధారులు, పాత్రధారులను అరెస్టు చేసి. చట్టపరంగా విచారణ చేయాలి. సత్వరం శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి.

ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడుతున్న జర్నలిజం విలువలను పెంచేలా సంచలనమైన జత్వాన్ని కేసును ప్రభుత్వం, ప్రజల దృష్టికి తీసుకువచ్చిన మీడియా పాత్ర అభినందనీయం.

– ముప్పాళ్ళ సుబ్బారావు,
ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం(APCLA)
రాష్ట్ర అధ్యక్షులు,
ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్,
భారత న్యాయవాదుల సంఘం(IAL) గౌరవ అధ్యక్షులు. 9397902903

LEAVE A RESPONSE