ఎన్టీటీపీఎస్ ఐదో దశలో సోమవారం అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. బాయిలర్ స్తంభించడంతో కార్మికులు మరమ్మతులు చేస్తున్న సమయంలో డోర్లు అకస్మాత్తుగా తెరుచుకోవడంతో వేడి యాష్, మంటల సెగలు మరమ్మతులు చేస్తున్న ఇద్దరు కార్మికులపై పడి తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన కార్మికులలో ఒకరు శాశ్వత ఉద్యోగి, మరొకరు కాంట్రాక్టు కార్మికుడు. వారిద్దరినీ వెంటనే గొల్లపూడిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 40 శాతానికి పైగా గాయాలతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఐదో దశలో బాయిలర్ మరమ్మతులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భద్రతా నిబంధనలను అతిక్రమించి మరమ్మతులు చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డోర్లు ఎలా తెరుచుకున్నాయో, ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.