– ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్
వెలగపూడి : సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారాన్నిసీఐడీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో ఎవరి మీద పోస్టులు చేసినా వదలబోమని తాజాగా హెచ్చరించింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల అంశంపై దృష్టి సారించామని, నిబంధనల్ని ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ హెచ్చరించారు.
సీఎంపై, వారి కుటుంబసభ్యులపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. మారుపేర్లతో పెడితే ఎవరికీ తెలీదని అనుకోవడం పొరపాటు. ఫేక్ అకౌంట్స్‌ను పట్టుకోలేమని అనుకోవడం సరికాదు. ఫేక్ అకౌంట్స్‌ను నడిపే వారిని పట్టుకుని చర్యలు తీసుకుంటాం. ఇలాంటి వారిని ప్రోత్సహించే వారిపైనా కఠిన చర్యలుంటాయి. హైకోర్టు జడ్జిలపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. ఇటీవల మహిళా జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంపైనా దృష్టిపెట్టామని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ పేర్కొన్నారు.
బుధవారం ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో మంత్రులపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. మహిళా నేతలపైనా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి అనుచిత పోస్టులు పెట్టినవారిపై కచ్చితంగా చర్యలుంటాయి. అలాగే ప్రతిపక్ష నేతలపైనా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను పరిశీలిస్తున్నాం. ఎవరి మీద అయినా సరే సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తే చూస్తూ ఊరుకోం. కఠిన చర్యలు మాత్రం తప్పవని స్పష్టం చేశారు. సోషల్ మీడియాను చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. సోషల్ మీడియాను పాజిటివ్‌గా ఉపయోగించుకోవాలని, దీనిపై మరింత అవగాహన కల్పించాలని భావిస్తున్నానని సంజయ్ తెలిపారు.