Suryaa.co.in

Andhra Pradesh

తాగునీటి సమస్య రాకుండా తగిన చర్యలు

• 115 కోట్ల రూ.ల అంచనాతో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు
• అన్ని సిపిడబ్ల్యుఎస్ స్కీమ్ లన్నీసక్రమంగా పని చేసేలా చూడండి
• సమ్మర్ స్టోరేజి ట్యాంకులన్నిటినీ పూర్తిగా నీటితో నింపండి
• కుళాయిల ద్వారా రోజుకు ఒకసారైనా నీటి సరఫరా జరిగేలా చూడండి
• వచ్చే3 నెలలు మంచినీటి పధకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టండి
– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి

అమరావతి,21 మార్చి:రాష్ట్రంలో వచ్చే జూన్ నెలాఖరు వరకూ ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలో తాగునీటి పరిస్థితులపై గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన పంచాయితీరాజ్ మరియు గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, మున్సిపల్ నీటి సరఫరా విభాగాల అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో మంచినీటి సరఫరా పరిస్థితులపై సమీక్షిస్తూ వచ్చే జూన్ నెలాఖరు వరకూ ఎక్కడా మంచినీటికి ఇబ్బంది రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ముఖ్యంగా దాదాపు నిర్మాణం పూర్తి కావచ్చిన మంచినీటి పధకాలన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అధికారులకు స్పష్టం చేశారు.అలాగే వివిధ సమ్మర్ స్టోరేజి ట్యాంకులు అన్నిటినీ పూర్తిగా నీటితో నింపాలని ఆదేశించారు.వివిధ తాగునీటి పధకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జల వనరులు,ఆర్డడబ్ల్యుఎస్,మున్సిపల్ నీటి సరఫరా విభాగాల అధికారులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.

వేసవి నీటి ఎద్దడిని అధికమించేందుకు 115 కోట్ల రూ.ల అంచనాతో వేసవి కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయడం జరిగిందని సిఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.వివిధ బోర్ వెల్స్ సహా ఇతర మంచినీటి సోర్సులకు అవసరమైన మరమ్మత్తులు నిర్వహించి అవన్నీ సమక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రానున్నమూడు మాసాలు వివిధ మంచినీటి సరఫరా పధకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మంచినీటి ఎద్దడి గల ఆవాసాలు,శివారు కాలనీలకు ట్యాంకరులు ద్వారా ప్రతి రోజు మంచినీటి సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.మంచినీటి కుళాయిల ద్వారా రోజకు ఒకసారైనా మంచినీటి సరఫరా జరిగేలా చూడాలని చెప్పారు.

రాష్ట్రంలో ఎక్కడైనా మంచినీటికి ఇబ్బంది కలిగితే 1904 కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి తక్షణం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.పశువులకు కూడా తాగునీటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సిఎస్ ఆదేశించారు.

ఈసమావేశంలో రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ 115 కోట్ల రూ.ల అంచనాతో సమ్మర్ కంటిన్జెన్సీ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నట్టు తెలిపారు.వివిధ ప్రవేట్ బోరులను అద్దెకు తీసుకోవడం,వివిధ బోరులను ప్లషింగ్ చేయడం,ఉన్నబోరులను మరింత లోతు చేయడం, సమ్మర్ స్టోరేజి ట్యాంకలను పూర్తిగా నీటితో నింపడం వంటి పనులు ఈసమ్మర్ కంటిన్జెన్సీ ప్రణాళికలో భాగంగా చేయడం జరుగుతుందని చెప్పారు.

నీటి ఎద్దడి అధికంగా గల 1354 ఆవాసాలకు జూన్ వరకూ ట్యాంకరులు ద్వారా నీటిని సరఫరా చేయాలని ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయగా ఈనెలలో 109 ఆవాసాలకు ట్యాంకరులు ద్వారా నీటి సరఫరాకు అనుమతి మంజూరు చేశామని వివరించారు.కరువు మండలాల్లో తాగునీటికి ఇబ్బంది రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

వర్చువల్ గా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖ కమీషనర్ శ్రీకేశ్ బాలాజీ రావు మాట్లాడుతూ ప్రస్తుతం 47 పట్టణ స్థానిక సంస్థల్లో రోజుకు ఒకసారి,29 యుఎల్బిల్లో రోజుకు రెండు సార్లు.43 యుఎల్బిల్లో రెండు రోజులకు ఒకసారి మంచినీటిని సరఫరా చేయడం జరుగుతోందని వివరించారు.కడప,పెనుగొండ,ఒంగోలు,హిందూపురంల్లో ప్రస్తుతం మూడు రోజులకు ఒకసారి మంచినీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు.

ఈ నాలుగు యుఎల్బిల్లో మంచినీటి సరఫరాను మెరుగుపర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్.రావత్,ఆశాఖ కార్యదర్శి కెవివి.సత్యనారాయణ,ఆర్ డబ్ల్యుఎస్ ఇఎన్సి ఆర్ వి.కృష్ణారెడ్డి,ప్రజారోగ్యశాఖ ఇఎన్సి ఆనంద రావు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE