అద్వానీ… ఎప్పటికీ ‘భారతరత్న’మే

అద్వానీని కమలదళ రథసారథిని చేసింది రథయాత్రే
గాంధీనగర్ నుంచి ఏడుసార్లు లోక్సభకు
రథయాత్రతో కీలక మలుపు
75 ఏళ్ల నిబంధనతో క్రియాశీల రాజకీయాలకు దూరం

ఎల్‌.కె. అద్వానీ భారతీయ జనతా పార్టీ భీష్ముడు, రాజకీయ కురువృద్ధుడు, పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ ఉప ప్రధాని, ఇలా చెప్పుకుంటే పోతే అడ్వాణీపై ఒక పెద్ద జాబితానే తయారవుతుంది. సుదీర్ఘ ప్రస్థానంలో అడ్వాణీ దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు.

కరడు గట్టిన దేశ భక్తుడిగా, హిందుత్వవాదిగా ప్రజా జీవితాన్ని ప్రారంభించిన అడ్వాణీ, తన సహచరుడైన మహానేత వాజ్‌పేయీ అడుగుజాడల్లో సిసలైన ప్రజాసేవకుడిగా ఎదిగారు. కాంగ్రెస్ ప్రభంజనంలోనూ కమలదళానికి ఊపిరులు ఊది, సిసలైన సారథిగా కార్యకర్తలు, ప్రజల హృదయాల్లో స్థిరపడిపోయారు. అందుకే ఆయన ఎప్పటికీ భారతరత్నమే.

ఎల్‌కే అడ్వాణీగా సుపరిచితులైన అడ్వాణీ అసలు పేరు లాల్ కృష్ణ అడ్వాణీ. సింధీ హిందూ కుటుంబానికి చెందిన KDఅడ్వాణీ, గ్యానీదేవి దంపతులకు 1927 నవంబరు 8న నాటి అఖండ భారత్‌, నేటి పాకిస్థాన్‌లోని కరాచీలో జన్మించారు. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్‌ హైస్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించిన అడ్వాణీ, నేటి పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌లో డీజీ నేషనల్ కాలేజీలో న్యాయవిద‌్యను అభ్యసించారు.

ముంబయిలోని గవర్నర్‌ లా కాలేజీలోనూ చదువుకున్నారు. చిన్నప్పుడే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌(RSS)లో చేరిన అడ్వాణీ, 1947లో కరాచీ విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు. సంఘ్‌ కార్యకర్తగా భారతదేశంపై మమకారంతో ఆయన కుటుంబంతో సహా 1947 సెప్టెంబరు 12న భారత్‌కు వచ్చి స్థిరపడ్డారు.

1965 ఫిబ్రవరి 25న అడ్వాణీ, కమలను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సంఘ్‌ సభ్యుడిగా దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌ నుంచి వలస వచ్చినవారికి సేవ చేయడం కోసం ఎక్కువకాలం రాజస్థాన్‌లో అడ్వాణీ గడిపేశారు. అనంతరం శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జన్ సంఘ్‌లో చేరారు.

1957లో వాజ్‌పేయీ సహా జన్‌సంఘ్ ఎంపీలకు సహాయ కారిగా ఉండేందుకు RSS, ఢిల్లీకి రమ్మని పిలవడం వల్ల అద్వానీ హస్తినలో అడుగు పెట్టారు. 1960లో RSS సిద్ధాంతాలతో నడిచిన ఆర్గనైజర్ పత్రికలో జర్నలిస్టుగా చేరిన అద్వానీ, నేత్ర అనే కలం పేరుతో సినిమా వ్యాసాలను కూడా రాసేవారు.

భారతీయ జన సంఘ్‌లో చేరినప్పటికీ, క్రియాశీల రాజకీయాల్లో చేరేందుకు అడ్వాణీకి కొంత సమయం పట్టింది. వాజ్‌పేయీ సహకారంతో 1966లో దిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికలలో జన సంఘ్ తరపున ఎన్నికైన అడ్వాణీ, మరుసటి సంవత్సరమే ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ అధ్యక్షుడయ్యారు.

1970-72 మధ్య భారతీయ జనసంఘ్‌ దిల్లీ విభాగం అధ్యక్షుడిగా ఎన్నికైన అద్వానీ, 1970లో రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి దేశ ప్రజాస్వామ్య సౌధం పార్లమెంటులో అడుగు పెట్టారు. 1973 నుంచి 76 వరకు జన్‌సంఘ్‌ అధ్యక్షుడిగా పనిచేసిన అడ్వాణీ, 1974 నుంచి 76 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 4 సార్లు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించిన అడ్వాణీ, గుజరాత్‌లోని గాంధీనగర్‌ స్థానం వరసగా ఏడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

1975 జనవరి 25న నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి RSS పై నిషేధం విధించారు. అదే సమయంలో వాజ్‌పేయీతో కలిసి బెంగళూరులో ఉన్న అడ్వాణీ అరెస్టయ్యారు. 1976 జనవరి18న ఎన్నికల ప్రకటన వెలువడడం వల్ల జైలు నుంచి విడుదలైన అడ్వాణీ, జయప్రకాశ్ నారాయణ స్థాపించిన జనతా పార్టీలో 1977 నుంచి 80 వరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయగా, అద్వానీ సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

1977 నుంచి 79 వరకు ఆ పదవిలో పనిచేశారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో జనతా పార్టీ ప్రభుత్వం కుప్పకూలింది.1980లో దిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో సమావేశమైన 3 వేల 500 మంది నేతలు 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ పేరుతో నూతన పార్టీని ఏర్పాటు చేశారు. అలా వాజ్‌పేయీ, అడ్వాణీ, భైరాన్‌ సింగ్ షెకావత్‌, మురళీ మనోహర్ జోషి వంటి నేతల చొరవతో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో పురుడు పోసుకుంది.

అయోధ్యలో రామమందిర నిర్మాణం పేరుతో అద్వానీ చేపట్టిన రథయాత్ర భారతదేశ రాజకీయాలనే మలుపు తిప్పాయి. అడ్వాణీని కమలదళ రథసారథిని చేసింది రథయాత్రే. పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన 1990 సెప్టెంబర్ 25న సోమనాథ్ ఆలయం నుంచి అయోధ్య వరకు తలపెట్టిన అడ్వాణీ రథయాత్రకు అనూహ్య మద్దతు లభించింది. అయితే నాటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, అద్వానీ రథయాత్రకు పగ్గాలు వేయడం వల్ల ఆగిపోయింది. అప్పటికే అద్వానీకి విశేష ప్రజాదరణ లభించింది.

1992 డిసెంబర్ 6న అయోధ్యలో జరిగిన కరసేవ ఘటన తర్వాత అద్వానీని అరెస్ట్ చేశారు.1996లో అడ్వాణీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే బీజేపీ అతిపెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ 13రోజులకే కుప్పకూలింది. 1998లో జరిగిన ఎన్నికల తర్వాత బీజేపీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

అద్వానీ కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. ఏడాదికే ఎన్డీఏ సర్కార్‌ కుప్పకూలింది. 1999లో మళ్లీ ఎన్నికలు జరగ్గా బీజేపీ వాజ్‌పేయీ నేతృత్వంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2004 వరకూ బీజేపీ పాలన సాగగా అడ్వాణీ కేంద్ర హోంమంత్రిగా, దేశ ఉపప్రధానిగా పనిచేశారు. ఇదే సమయంలో కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రిగా, కేంద్ర సిబ్బంది శిక్షణా మంత్రిత్వ శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలను కూడా అద్వానీ నిర్వహించారు.

2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలుకాగా అద్వానీ ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ఇదే క్రమంలో వాజ్‌పేయీ రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోగా బీజేపీ అధినేతగా అద్వానీ ముందుండి పార్టీని నడిపించారు. 2009 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా అద్వానీ నిలబడినా పార్టీ పరాజయం చవిచూసింది. తర్వాత జరిగిన పరిణామాల్లో నాటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.

2014 ఎన్నికల్లో గాంధీనగర్‌ నుంచి గెలిచిన అడ్వాణీ బీజేపీ పార్లమెంటరీ బోర్డులో నిర్ణయాత్మక పాత్రను పోషించారు. ఆ తర్వాత 75 ఏళ్లుపైబడిన వారిని ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచాలని నిర్ణయించడం వల్ల అడ్వాణీకి బీజేపీ విశ్రాంతినిచ్చింది. 2019 పార్లమెంటు ఎన్నికలకు గాంధీనగర్‌ నుంచి అడ్వాణీకి బదులుగా అమిత్ షా పోటీ చేయడం వల్ల అగ్రనేత క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు.

 

Leave a Reply