– టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా… విద్యావంతులు గెలిపించారు
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరూ గెలవాలి
– ప్రజా మద్ధతుతో భావి తరాల భవిష్యత్తును పునర్నిమిస్తున్న సీఎం చంద్రబాబు
– క్లీన్ ఎనర్జీతో ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ విప్లవం
– జగన్ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్నిదేవుడు కూడా కాపాడలేడు
– విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి\బాపట్ల\రేపల్లె: ఉమ్మడి గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను విద్యావంతులందరూ అత్యధిక మెజారిటీ గెలిపించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా వేమూరు, బాపట్ల, రేపల్లె ప్రాంతాల్లో సహచర మంత్రి కొలుసు పార్థసారధి, స్థానిక ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లయిన పలువురు పట్టభద్రులతో గొట్టిపాటి సమావేశం నిర్వహించారు. ఏడు నెలల కూటమి పాలనలో ఎన్నో చేశామని.. డీఎస్సీ, తల్లికి వందనం వంటి వాటిని ప్రాధాన్యతా క్రమంలో వచ్చే విద్యా సంవత్సరంలో ఇస్తామని ప్రకటించారు. అదే విధంగా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ల ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ విప్లవానికి వేదిక అవుతుందని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.
రాయలసీమతో పాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వ్యవసాయానికి పనికిరాని భూముల్లో ఏర్పాటు చేసే పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్ట్ వల్ల రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు అన్నదాతలకు ఆదాయం లభిస్తుందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు దేశం ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే పట్టభద్రులందరూ కలిసి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీలను గెలిపించారని గుర్తు చేశారు. అదే విధంగా ఆలపాటికి కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి అత్యధిక మెజారిటీ రావాలని ఆకాంక్షించారు. విద్యావంతులు కూటమి అభ్యర్థులకు మద్ధతుగా ఓటేసి బలపరచాలన్నారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలూ ధ్వంసం అయ్యాయని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను జగన్మోహన్ రెడ్డి అవమానించడమే కాకుండా.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత దుర్మార్గపు పాలనతో జగన్మోహన్ రెడ్డి భావి తరాలకు ఎంతో నష్టం చేశాడన్నారు. టీడీపీ హయాంలో 80 శాతంపైగా పూర్తైన పోలవరం ప్రాజెక్ట్ ను మిగిలిన 20 శాతం కూడా పూర్తి చేయలేక పోయాడని ఆరోపించారు. ధాన్యం సేకరణ, చెల్లింపుల్లోనూ వైసీపీ ప్రభుత్వం రైతులను ఎంతో ఇబ్బంది పెట్టిందని మంత్రి గొట్టిపాటి తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం… భావి తరాల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ ను మరలా పునర్నిమిస్తుందని మంత్రి గొట్టిపాటి వివరించారు. రూ.50 వేల కోట్లతో రాజధాని అమరావతిలో మౌలిక వసతుల ఏర్పాట్లను మరలా ప్రారంభించామన్నారు. వెయ్యి కోట్లతో పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని చేపట్టామని చెప్పారు. అదే విధంగా వైసీపీ ప్రభుత్వం రైతులకు బకాయి పడిన రూ.1,674 కోట్లను అన్నదాతలకు కూటమి సర్కారే చెల్లించిందని మంత్రి వెల్లడించారు. సంక్షేమ పెన్షన్లను వెయ్యి పెంచడానికి జగన్ కు ఐదేళ్లు పట్టిందని గొట్టిపాటి ఎద్దేవా చేశారు.
64 లక్షల మందికి సంక్షేమ పెన్షన్ల ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అన్నారు. అదే విధంగా ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు సీఎం చంద్రబాబు చొరవతోనే రాష్ట్రానికి దక్కిందన్నారు. ఒక్క అవకాశానికే రాష్ట్రాన్నిసర్వ నాశనం చేసిన జగన్… మరోసారి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ను దేవుడు కూడా కాపాడలేదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరినీ గెలిపించి., తద్వారా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని మంత్రి గొట్టిపాటి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కూటమి నేతలు, పలువురు కార్యకర్తలు, అధిక సంఖ్యలో పట్టభద్రుల ఓటర్లు పాల్గొన్నారు.