Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌ గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం

– మిర్చియార్డు లోపల కనిపించని పోలీస్‌ యంత్రాంగం
– కనీసం రోప్‌ పార్టీ కూడా ఏర్పాటు చేయని పోలీసులు
– ఎన్నికల కోడ్‌ ఉందంటూ కుంటిసాకులు చెబుతున్నారు
– విజయవాడలో ఒక నిబంధన, గుంటూరులో మరో నిబంధన ఉంటుందా?
– కోడ్‌ ఉంటే ముందుగా ఎందుకు నోటీసులు ఇవ్వలేదు?
– గుంటూరులోని పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, మాజీ ఎంపీలు నందిగం సురేష్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్‌ నూరి ఫాతిమా

గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించిందని, మాజీ సీఎం సీఎం పర్యటనలో భద్రత కల్పనపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వైయస్‌ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు.

గుంటూరులోని వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో పలువురు నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌గారి పర్యటనపై ముందుగానే సమాచారం ఇచ్చినా, ఆయనకు భద్రత కల్పనను అస్సలు పట్టించుకోలేదని, ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించిందని వారు ఆక్షేపించారు. మంత్రి నారా లోకేష్‌ ఆదేశాలతోనే గుంటూరు పోలీసులు బందోబస్త్‌ను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్‌ ఉందంటూ కుంటిసాకులు చెబుతున్నారని వారు ధ్వజమెత్తారు.

అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు వైయస్‌ జగన్‌ రోడ్డు మీదకు వస్తే ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంటుందో తెలిసి కూడా.. ఆయన మిర్చి రైతులను పరామర్శించే కార్యక్రమాన్ని విఫలం చేసేందుకే కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని వైయస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు.

వ్యవసాయ మంత్రి పచ్చి అబద్ధాలు: అంబటి రాంబాబు
మిర్చి రైతుల కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు, వారికి భరోసా కల్పిచేందుకు మాజీ సీఎం వైయస్‌ జగన్‌ గుంటూరు మిర్చి యార్డ్‌కు వచ్చి రైతులతో మాట్లాడారు. ధర లేక కునారిల్లుతున్న మార్కెట్‌ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వైయస్‌ జగన్‌ రైతులతో మాట్లాడి వెళ్లగానే, వ్యవసాయ మంత్రితో పాటు పలువురు టీడీపీ నేతలు స్పందించారు. ఒకటి, రెండుసార్లు తప్ప ఎప్పుడూ క్వింటా మిర్చి రూ.13 వేలకే విక్రయిస్తున్నారంటూ వ్యవసాయ మంత్రి పచ్చి అబద్దాలు మాట్లాడారు.

మరోవైపు హడావిడిగా సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌కు లేఖ రాశారు. మిర్చిపంటకు రేటు పడిపోయింది, కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఇంత సీనియారిటీ ఉన్న సీఎం ఇలాగేనా సమస్యపై స్పందించేది? వైయస్‌ జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు అయిదేళ్లలో పంటలకు ఎప్పుడు మద్దతు ధర రాకపోయినా, రైతు నష్టపోతున్నారని గ్రహించినా వారిని ఆదుకునేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. పత్తి, ధాన్యం, పొగాకు ఇలా అనేక పంటలను వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు.

నాడు మాది రైతు పక్షపాత ప్రభుత్వం. ఆనాడు రూ.65 వేల కోట్లు వెచ్చించి ధాన్యం కొనుగోలు చేశాం. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి పత్తి, కంది, ధాన్యం, మిర్చికి మద్దతు ధర లేదు. ధాన్యాన్ని అతి తక్కవ రేటుకు దళారీలకు, మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. రైతు నట్టేట మునుగుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

జగన్‌ మిర్చి మార్కెట్‌కు రాకుండా చూసేందుకు కుట్ర చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించాలని అనుకోవడం తప్పా? కనీస పోలీస్‌ బందోబస్త్‌ కల్పించకుండా ఎన్నికల కోడ్‌ ఉందంటూ కుంటిసాకులు చెప్పించారు. అది కూడా పోలీసులు వాట్సాప్‌లో మెసేజ్‌ పెట్టి చేతులు దులుపుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉంది. వైయస్‌ఆర్‌సీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఎన్నికల కోడ్‌ ఉన్నప్పడు ఓట్ల కోసం ప్రచారం చేసుకునే వారు. ఊరేగింపులు, బహిరంగ సభలు పెట్టే వారు అనుమతులు తీసుకోవాలి.

వైయస్‌ జగన్‌ మిర్చి యార్డ్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కోసం ప్రచారం కోసం వెళ్ళారా? రైతులను పరామర్శించడం ఎన్నికల ప్రచారం కిందకు వస్తుందా? కోడ్‌ ఉంటే దానిపైన పోలీసులు ఎందుకు నోటీస్‌ ఇవ్వలేదు? అయినా కోడ్‌ ఉల్లంఘించే ఉద్దేశం మాకు లేదు. ఎన్నికలు జరుగుతున్నా పరామర్శించేందుకు అవకాశం ఉంటుంది.

నిన్ననే జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు ఈ ఎన్నికల కోడ్‌ ఉన్నట్లు పోలీసులకు గుర్తు రాలేదా? అక్కడ పెద్ద ఎత్తున పోలీసులను మోహరింప చేశారు. అంటే విజయవాడలో ఒక నిబంధన, గుంటూరులో మరో నిబంధన ఉంటుందా? గుంటూరు మిర్చి మార్కెట్‌లో రైతులతో జగన్‌ మాట్లాడితే, వారి కష్టాలు ప్రజలకు తెలుస్తాయని, అందుకే ఆ పర్యటన అడ్డుకోవాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం వ్యవహరించింది.

మిర్చియార్డ్‌ వద్ద పోలీసులు లేక తోపులాటలు జరిగాయి. దీంతో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులే జనాన్ని నియంత్రించారు. చివరికి జగన్‌ మీడియాతో మాట్లాడేందుకు కూడా వీలు లేకుండా చేయాలని కుట్రపన్నారు. జగన్‌ ని చూసేందుకు, కలిసేందుకు తరలి వస్తున్న జనాన్ని నియంత్రించేందుకు ఒక్క పోలీస్‌ను కూడా నియమించకుండా చేయడం నారా లోకేష్‌కు సమంజసమా? అధికారం శాశ్వతమని వారు భావిస్తున్నారు.

LEAVE A RESPONSE