Suryaa.co.in

Andhra Pradesh

రాజ‌కీయ క‌క్ష‌తో అక్ర‌మ కేసులు

– కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై ఇలాగే తప్పులు కేసుల బనాయింపు
– అన్ని కేసుల్లోనూ అసత్య వాంగ్మూలాలే ఆధారం
– తెనాలిలో న‌డిరోడ్డుపై ద‌ళిత యువ‌కులను చావ‌కొట్టిన పోలీసులు
– ఈ ఘ‌ట‌న‌పై మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్‌లో ఫిర్యాదు చేస్తాం
– వైయ‌స్సార్సీపీ లీగ‌ల్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షులు ఎం మ‌నోహ‌ర్‌రెడ్డి ఆగ్ర‌హం
– తాడేప‌ల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం. మ‌నోహ‌ర్‌రెడ్డి

తాడేపల్లి: ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాజకీయ కక్షసాధింపులకే పోలీస్ వ్యవస్థ పరిమితమైందని వైయస్ఆర్‌సీపీ లీగల్‌సెల్అధ్యక్షుడు ఎం మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కక్షసాధింపు కేసుల్లో భాగంగానే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేవలం కాకాణి గోవర్థన్‌రెడ్డిని అరెస్ట్ చేయాలనే లక్ష్యంతోనే మైనింగ్ అధికారి బాలాజీనాయక్‌తో తప్పుడు ఫిర్యాదు చేయించి, కేసు పెట్టించారని అన్నారు. రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగంతో తమ రాజకీయ ప్రయోజనాల కోసం చట్టవిరుద్దమైన అన్ని పనులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటయ్యాక రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లులో భాగంగా వైయ‌స్సార్సీపీ నాయ‌కుల మీద అక్ర‌మ కేసులు న‌మోదు చేయ‌డం మొద‌లైంది.

అందులో భాగంగానే ఫిబ్ర‌వ‌రి 14, 2025లో మైనింగ్ అధికారి బాలాజీ నాయ‌క్ అనే వ్య‌క్తితో అక్ర‌మ మైనింగ్ చేశారంటూ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయించారు. ఈ కేసులో ముద్దాయిలుగా ముగ్గుర్ని చేరిస్తే వారంద‌రికీ హైకోర్టు యాంటిసిపేట‌రీ బెయిల్ మంజూరు అయ్యింది. ఇందులో కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి పేరు ఎక్క‌డా లేదు. ఎఫ్ఐఆర్‌లో అద‌ర్స్ ప్లేస్‌లో మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి పేరును చేర్చారు.

మూడు రోజుల క్రితం ప‌ల్నాడు జిల్లాలో ఇద్ద‌రు టీడీపీ నాయ‌కులు బైకుపై వెళ్తుండ‌గా కారుతో ఢీకొట్టి చంపారు. టీడీపీలోని రెండు వ‌ర్గాల మ‌ధ్య ఆధిప‌త్య పోరు కార‌ణంగానే ఈ దాడి జ‌రిగింద‌ని, దాడి చేసిన వారు కూడా టీడీపీ వారేన‌ని ఎస్పీ ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ చెప్పారు. ఇదే విష‌యాన్ని ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి స‌హా అన్ని ప‌త్రిక‌ల్లోనూ వ‌చ్చింది. కానీ ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేక‌పోయినా పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, ఆయ‌న సోద‌రుడు పిన్నెల్లి వెంక‌ట్రామిరెడ్డి మీద అక్ర‌మ కేసులు న‌మోదు చేశారు.

పిన్నెల్లి సోద‌రుల హ‌స్తం ఉంద‌ని టీడీపీ ఎమ్మెల్యే జూల‌కంటి బ్ర‌హ్మారెడ్డి ఆరోపిస్తే దాన్ని ఆధారంగా చేసుకుని వారిపై తప్పుడు కేసు న‌మోదు చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కారుపై కూడా జేబీఆర్ (జూల‌కంటి బ్ర‌హ్మారెడ్డి) పేరు కూడా ఉంది. హ‌త్య‌ను క‌ళ్ళారా చూసిన మృతుడి బంధువు తోట ఆంజ‌నేయులు సైతం టీడీపీ వారే చంపార‌ని పోలీసుల‌తో చెప్పారు. దీనికి సంబంధించి వారు మాట్లాడిన వీడియోలను కూడా ఈ మీడియా సమావేశంలో ప్రదర్శిస్తున్నాం. ఇది అక్ర‌మ కేసేన‌ని రాష్ట్రంలో ఎవ‌ర్ని అడిగినా చెబుతారు.

రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు అదుపుత‌ప్పాయి. చ‌ట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే య‌థేచ్చ‌గా ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఈరోజు తెనాలి ప‌ట్ట‌ణంలో టూటౌన్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో న‌డి రోడ్డు మీద‌నే ద‌ళిత యువ‌కుల‌ను పోలీసులు దారుణంగా కొట్టి భ‌య‌భ్రాంతుల‌కు గురిచేశారు. దీనిపై మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్‌కి ఫిర్యాదు చేస్తాం. కూట‌మి నాయ‌కులు ఏది చెబితే అది చేయ‌డానికి పోలీసులు వెనుకాడ‌టం లేదు. రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం వ‌ర్ధిల్లాలి అంటే ప్ర‌జాస్వామ్య వాదులు మేథావులు ఏక‌మై ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించాలి.

LEAVE A RESPONSE