Suryaa.co.in

Editorial

అందరి చూపూ సీబీఐ వైపే!

– అవినాష్‌రెడ్డి అరెస్ట్‌ విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పిన హైకోర్టు
– సీబీఐ నిర్ణయానికే వదిలేసిన తెలంగా హైకోర్టు
– గతంలోనే అవినాష్‌ను అరెస్టు చేస్తామని కోర్టుకు చెప్పిన సీబీఐ
– తాజాగా ప్రధాని మోదీతో సీఎం జగన్‌ భేటీ
– కేసుల కోసమేనంటూ విపక్షాల విమర్శలు
– మోదీతో భేటీ ప్రభావం సీబీఐపై ఉంటుందా? లేదా?
– అరెస్టు చేస్తే సీబీఐపై ఒత్తిళ్ల విమర్శలకు తెర
– చేయకపోతే మోదీతో భేటీ ప్రభావం ఉందనకునే ప్రమాదం
– అది బీజేపీకి అప్రతిష్ఠనే
– సీబీఐ కోర్టులో అవినాష్‌ అరెస్టు బంతి
– సీబీఐ విశ్వసనీయతకు అగ్నిపరీక్ష
– అవినాష్‌రెడ్డి అరెస్టు అ‘టెన్షన్‌’
( మార్తి సుబ్రహ్మణ్యం)

అంతా అయిపోయింది. ఉన్న ఏకైక మార్గం కూడా మూసుకుపోయింది. హైకోర్టు కూడా తానేమీ చేయలేనని చెప్పింది. అంతా సీబీఐ ఇష్టమేనని గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇక మిగిలింది అరెస్టే. కానీ అదేరోజు సరిగ్గా సీఎం ఢిల్లీ వెళ్లి, పీఎంను కలిశారు. మరి నిన్నటి వరకూ ఎంపీ అరెస్టుపై పట్టుదలగా ఉన్న సీబీఐ, తన ప్రయత్నం కొనసాగిస్తుందా? లేక మోదీని సీఎం కలిశారు కాబట్టి, ఆ ప్రభావంతో సీబీఐ మనసు మార్చుకుంటుందా? ఇప్పుడు ఒకరకంగా సీబీఐ విశ్వసనీయకు అగ్నిపరీక్షే. కడప ఎంపీ- సీఎం జగన్‌ తమ్ముడు అవినాష్‌రెడ్డి అరెస్టు బంతి.. సీబీఐ కోర్టులో ఉన్న నేపథ్యంలో, తెరపైకి వచ్చిన చర్చ ఇది.

కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయాలన్న, సీబీఐ ప్రయత్నాలకు కొద్దిరోజులు బ్రేక్‌ వేసిన తెలంగాణ హైకోర్టు, తాజాగా అదే సీబీఐకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అవినాష్‌రెడ్డి అరెస్టులో జోక్యం చేసుకోలేం. ఈ విషయంలో సీబీఐదే తుది నిర్ణయమంటూ స్పష్టం చేసింది. దానితో అవినాష్‌ అరెస్టు ఖాయమన్న చర్చకు తెరలేచింది.

కానీ హటాత్తుగా.. తీర్పు వచ్చిన రోజునే ఏపీ సీఎం జగన్‌, ప్రధాని మోదీని కలవడంతో కథ కొత్త మలుపు తిరిగినట్టయింది. ఓవైపు బడ్జెట్‌ సమావేశాలు జరుగుతుంటే, దానిని విడిచిపెట్టి అత్యవసరంగా సీఎం ఢిల్లీకి వెళ్లటంపై, రకరకాల ఊహాగానాలకు కారణమయింది. అవినాష్‌రెడ్డి, అరెస్టు కాకుండా అడ్డుకునేందుకే జగన్‌ ఢిల్లీ వెళ్లారని విపక్షాలు ఆరోపించాయి. భాస్కర్‌రెడ్డి ప్రమాదంలో ఉన్న ప్రతిసారీ, జగన్‌ ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారని నిలదీస్తున్నాయి. సీబీఐపై ఒత్తిడి తీసుకువచ్చేందుకే జగన్‌, ఢిల్లీకి వెళ్లారన్నది విపక్షాల ఆరోపణ.

దీనితో సహజంగా మళ్లీ అందరి చూపు, సీబీఐ వైపు మళ్లింది. నిన్నటి వరకూ అవినాష్‌ అరెస్టుపై పట్టువదలని విక్రమార్కుడిలా వ్యవహరించిన సీబీఐ.. ఇప్పుడు మోదీ-జగన్‌ భేటీ తర్వాత అదే వైఖరి కొనసాగిస్తుందా? లేక పట్టువిడుపులతో వెళుతుందా అన్న కొత్త సందేహాలు తెరపైకొచ్చాయి. సరిగ్గా హైకోర్టు తీర్పు వచ్చిన రోజునే జగన్‌, ప్రధానిని కలవడం యాధృచ్చిమైనప్పటికీ, ఇప్పుడదే సీబీఐ విశ్వసనీయకు పరీక్షగా నిలిచింది.

ఒకవేళ సీబీఐ తన ప్రస్తుత వైఖరినే కొనసాగించి, అవినాష్‌ను అరెస్టు చేస్తే… ఇప్పటివరకూ సీబీఐ పంజరంలో చిలక, బీజేపీ చెప్పినట్లు చేసే విశ్వాసపాత్రురాలన్న నిందలకు తెరపడుతుంది. అదే సీబీఐ తన మనసు మార్చుకుని, అరెస్టు విషయంలో వెనక్కి తగ్గి, అవినాష్‌రెడ్డి సుప్రీంకోర్టు వరకూ వెళ్లే వరకూ అవకాశమిస్తే.. సీఎం జగన్‌ ప్రధాని మోదీతో కలసినందుకు, తగిన ఫలితం లభించిందన్న నిందను కూడా సీబీఐనే మోయవలసి వస్తుంది. మరోవైపు అది బీజేపీకి అప్రతిష్ఠనే. అందుకే అవినాష్‌రెడ్డి అరెస్టు వ్యవహారం, సీబీఐ విశ్వసనీయతకు అగ్నిపరీక్ష లాంటిదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి మాజీ ఎంపి వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేసి నాలుగేళ్లయితే, సీబీఐ విచారణ నింపాదిగా సాగింది. సీబీఐ తాను కోరుకున్నప్పుడు కేసును స్పీడు చేయడం, మళ్లీ హటాత్తుగా కొన్ని నెలలు నెమ్మదించడం చేసింది. కానీ ఎప్పుడయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిందో, అప్పటినుంచే వేగవంతం చేసింది. అయితే మోదీ-జగన్‌ తాజా భేటీ నేపథ్యంలో.. సీబీఐ అదే దూకుడు కొనసాగిస్తుందా లేదా అన్నది త్వరలోనే తేలిపోతుంది.

LEAVE A RESPONSE