– నిధులు మంజూరు చేసిన సీఎం, డిప్యూటీ సీఎం కు స్పీకర్ అయ్యన్న ధన్యవాదాలు
అమరావతి: ఏపీ క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం తీపికబురు అందించిందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రూ.4.90 కోట్ల క్రీడా ప్రోత్సాహకాలను బకాయిలుగా పెట్టిందని, ఆ నిధులను కూటమి ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసి క్రీడాకారులకు అండగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం “ఆడుదాం ఆంధ్ర” అంటూ, చివరికి నిధులను కాజేసిందని విమర్శించారు.
క్రీడల పట్ల, క్రీడాకారుల పట్ల కూటమి ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధి ప్రశంసనీయమని స్పీకర్ అన్నారు. 43మంది అంతర్జాతీయ క్రీడాకారులు లబ్ధి పొందేలా రూ.4.9 కోట్లు విడుదల చేయడం ద్వారా క్రీడాకారులను మరింత ప్రోత్సహించే ప్రభుత్వముగా కూటమి నిలిచిందని తెలిపారు. ఈ సందర్భంలో క్రీడా ప్రోత్సాహకాలు విడుదల చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి, క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.