Suryaa.co.in

Andhra Pradesh

అసెంబ్లీలో అమరావతి జండా ఉండాలి

– చంద్రబాబుకు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య సూచన

రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా రాజధాని అమరావతి ఉద్యమానికి గుర్తింపు ఇవ్వాలని, ఏపీ కొత్త అసెంబ్లీలో అమరావతి జెండా ఉండాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబుకు సూచించారు. బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1600 రోజుల రాజధాని ఉద్యమం తెలుగు నేల పై చారిత్రక సందర్భం అని, ఏనుగు లాంటి వైసీపీ పార్టీని పీనుగులా మార్చిందని చెప్పారు.

ఒకపక్క రాజధాని ఉద్యమంతో పాటు మరోపక్క డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చన్న, డ్రైవర్ సుబ్రహ్మణ్యం వంటి దళితులపై జరిగిన దాష్టికాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించిన శక్తులకు ఎన్నికల ప్రక్రియలో గుర్తింపు ఇచ్చి, ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలన్నారు. రాజకీయాలు కేవలం బరోడా మహారాజులకే పరిమితం కాదని, ప్రజా ఉద్యమాలలో నుంచి పుట్టిన విశ్వసనీయత కలిగిన నాయకులకు కూడా చోటు ఉంటుందని రాష్ట్ర ప్రజలకు నమ్మకం కలిగించాలన్నారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన కులాల కార్చిచ్చు రగులుతూనే ఉందని, సామాజిక కులాల సమ ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా కార్చిచ్చును ఆపొచ్చని తెలిపారు. ఎంతటి గుమగుమలాడే వంటకాలు తయారుచేసినా, ఉప్పు లేకపోతే, వండిన కూర ఎందుకు కొరగాదని అభివర్ణించారు. తాను రాష్ట్రంలో రెండు దఫాలుగా 13 ఉమ్మడి జిల్లాలు పర్యటించానని, 3966 మంది బాదితుల దరఖాస్తు లను స్వీకరించానని తెలిపారు.‌ వైకాపా పాలనలో పూర్తిగా దగాపడ్డది, దిగాలు పడ్డది దళితులే అన్నారు.

దళితుల ఆత్మగౌరవానికి గుర్తింపు ఇవ్వటం ద్వారా వైసీపీ ప్రభుత్వం పై పోరాటం సులభం అవుతుందన్నారు. విలేకరుల సమావేశంలో నేషనల్ నవ క్రాంతి పార్టీ పార్టీ అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు, రాష్ట్ర రెల్లి సంక్షేమ సంఘం అధ్యక్షులు శిరంశెట్టి నాగేంద్రరావు, దళిత మహిళా నాయకురాలు సరిత, పెరుమాళ్ళ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE