Suryaa.co.in

Padayatra News

అమరావతి మహా పాదయాత్ర-డైరీ-14వ రోజు

ఈ రోజు ఉదయం 9 గంటలకు ఎరజర్ల గ్రామంలో చైతన్య ఆయుర్వేద కాలేజ్ నుండి ప్రారంభమైంది. మహా పాదయాత్ర ప్రారంభానికి ముందు ప్రతిరోజూ శాస్త్రోక్తంగా జరిగే పూజలు ఈ రోజు చైతన్య ఆయుర్వేద కళాశాల యజమాని కుమారులైన శివ చైతన్య, కృష్ణ చైతన్య నిర్వహించారు.ఆ తర్వాత మహాపాదయాత్ర ఎరజర్ల, కందులూరు,మర్లపాడు….. మర్లపాడు లో భోజన విరామం అనంతరం ఎం నిడమానూరు వరకు దాదాపు పన్నెండు కిలోమీటర్లు సాగింది. ఎం నిడమానూరు లో ఈరోజు రాత్రి బస ఏర్పాటు చేయబడింది.
పాదయాత్ర ప్రారంభమైన రోజు నుండి చాలాసార్లు జరిగినట్టు… ఈ రోజు కూడా పాదయాత్ర ప్రారంభ సమయంలో లో చిరు జల్లులు కురిశాయి. ఆ తర్వాత పాద యాత్ర దారిపొడవునా… పూలవర్షం తప్ప మామూలు వర్షం ఎక్కడ కనిపించలేదు. పాదయాత్ర ప్రారంభమైన రోజు నుండి… యాత్ర మార్గంలో ప్రతిరోజు, ఎండ కనిపించకుండా… వర్షం కురువ కుండా… అహ్లాద కరమైన వాతావరణంలో పాదయాత్ర సాగుతుంది.
పాదయాత్ర ప్రారంభమైన కాసేపటికే…బిజెపి నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఈ రోజు పాదయాత్రలో పాల్గొనడానికి వస్తున్నారని, కొంతమంది మీడియా మిత్రులు నాకు చెప్పటం జరిగింది.నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ… ఆయనతో కొంత సేపు నడుస్తానని చెప్పాను. కానీ అమిత్ షా పర్యటన కారణంగా విష్ణువర్ధన్ రెడ్డి రాలేకపోయాడు అని… సాయంత్రానికి మీడియా మిత్రులు తెలియజేశారు.
ఈ రోజు పాదయాత్ర జరిగింది ఎరజర్ల నుండి ఎం నిడమానూరు వరకు అయినప్పటికీ… పాదయాత్ర మార్గానికి దూరంగా ఉన్న సమీప గ్రామాల నుండి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు.
స్త్రీలు, పురుషులు, పిల్లలు కూడా మహా పాదయాత్ర లో అత్యంత పవిత్ర కార్యంగా, భక్తిభావంతో పాల్గొనడం నేను గమనించాను.
ఈరోజు భోజన విరామ సమయంలో ఒక వైసిపి రెడ్డి గారు నన్ను కలిశారు. మూడు రోజుల క్రితం నాగులుప్పలపాడు మండలంలో, తమ గ్రామం మీదుగా పాదయాత్ర జరిగినప్పుడు, స్థానిక రాజకీయ పరిస్థితుల వల్ల రాలేకపోయానని… తమ ప్రాంతం దాటిన తర్వాత పాల్గొంటున్నానని… చెప్పటం చాలా సంతోషాన్నిచ్చింది.
గత నాలుగు రోజులుగా మహా పాదయాత్రకు సంబంధించిన వీడియోలను నాగులుప్పలపాడు మండలంలోని గ్రామాలలో, స్థానిక వైసీపీ నాయకులకు చూపించి… తమ గ్రామాలలో పాదయాత్రలో పాల్గొన్న వారిని గుర్తించమని అడిగినప్పుడు… వారిలో చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఉండటం వల్ల పోలీసులు కూడా మౌనం దాల్చారంట.గ్రామాల్లో రైతులు సేకరిస్తున్న విరాళాల విషయంలో కూడా, స్థానిక వైసీపీ నాయకులు విరాళాలు ఇవ్వటం చాలా మంచి పరిణామం.ప్రకాశం జిల్లాలో ఈరోజు జరిగిన పంచాయతీ ఉప ఎన్నికలలో… తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందడం లో పాదయాత్ర ప్రభావం చాలా ఉందని స్థానికులు చెప్పారు.
చివరిగా….
నిన్న పాదయాత్రకు విరామం అయినప్పటికీ… నేను కొంతమంది మిత్రులతో ఒక వివాహ రిసెప్షన్ కు వెళ్లడం, అక్కడ కూడా వేదికపై జై అమరావతి నినాదాలు ఇవ్వడం జరిగింది. ఆ వీడియోను ఈ రోజు పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు నాకు పంపించారు.జై అమరావతి,జై జై ఆంధ్ర ప్రదేశ్.

-కొలికపూడి శ్రీనివాస రావు

LEAVE A RESPONSE