Suryaa.co.in

Editorial Padayatra News

జనం..జనం..తిరుమలకు అడుగులేసిన అమరావతి రైతు ప్రభం‘జనం’

– చాలా ఏళ్ల తర్వాత ఏపీకి రేణుకాచౌదరి
( మార్తి సుబ్రహ్మణ్యం )
వాళ్లకి దానం చేయడమే తప్ప యాచించడం తెలియదు. వాళ్లకి గౌరవంగా బతకడమే తెలుసు తప్ప, బజారునపడటం తెలియదు. వాళ్లకి పండించడమే తప్ప రాజకీయాలు తెలియవు. వాళ్లకు పొలం-ఇల్లు తప్ప బయట ప్రపంచం తెలియదు. వాళ్లకు మోసపోవడమే తప్ప, మోసం చేయడం తెలియదు. అందుకే.. ప్రభుత్వమనే అతిపెద్ద వ్యవస్థను నమ్ముకుని, ఉన్న 34 వేల ఎకరాలు ధారాదత్తం చేశారు.
పాలకులు మారితే పాలిసీలూ మారతాయని తెలియని వెర్రివాళ్లు వారు. మా ఢిల్లీ కంటే కళ్లు తిరిగే రాజధాని నిర్మిస్తామంటే నిజమేకామోసని, చంకలు గుదుకుని మురిసిపోయిన అమాయకులు వారు. హామీలిచ్చి గద్దెనెక్కిన వారు ఢిల్లీకెళ్లగనే మాటమార్చేస్తారని గ్రహించలేని పిచ్చి వాళ్లు. అందుకే వాళ్లంతా తమకు దన్నుగా నిలుస్తారని కొండంత ఆశతో అందరివైపూ ఆశగా ఎదురుచూశారు. పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగారు. పాలకులను వేడుకున్నారు. భూములిచ్చిన తమకు న్యాయం చేయమని అర్ధించారు. తాము భూములిచ్చింది చంద్రబాబుకు కాదు, ఏపీ ప్రభుత్వానికని అర్ధమయ్యే భాషలోనే చెప్పారు. కానీ పాలకులు వారిలో కులం చేశారే తప్ప, వారి వేదన చూడలేదు.
చివరాఖరకు కొండమీదున్న కనకదర్గమ్మను వేడుకునే ప్రయత్నం చేస్తే, అక్కడ ఖాకీలు అడ్డుకున్నారు. అందుకే… వెంకన్నపై భారం వేసి, న్యాయదేవతను నమ్ముకున్నారు. మాకు నువ్వే దిక్కని తిరుమలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ పాలకులు పోలీసుల రూపంలో సైంధవులయ్యారు. పాదయాత్రకు మోకాలడ్డారు. అంతే.. న్యాయదేవత క రుణించింది. వారి ఆకాంక్షయిన ‘న్యాయస్థానం-దేవస్థానం’ పాదయాత్రకు అనుమతి లభించింది. ప్రజాస్వామ్యదేశంలో పాదయాత్రకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, అది కూడా 157 మందికే అనుమతి ఇస్తారన్న కొత్త విషయాన్ని రైతులే కాదు. ప్రపంచమే గుర్తించి ఆశ్చర్యపోయింది. ఇదీ అమరావతి రైతులు 685 రోజుల పాటు, అవిశ్రాంతంగా నిర్వహించిన ఉద్యమంలో చివరి ఉద్యమ మజిలీ.


తిరుమలకు వెళ్లేందుకు తరలివచ్చిన రైతన్నలు, వారి నినాదాలతో రాజధాని ప్రాంతం ప్రతిధ్వనించింది. రైతులను కన్నీరు పట్టించిన ఏ ప్రభుత్వం బతికి కట్టలేదంటూ వారు వేసిన పొలికేక పక్కజిల్లాలకు వినిపించింది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఇలా వయసుతో సంబంధం లేకుండా రైతుప్రభంజనం తిరుమల వైపు అడుగులు వేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాతో సంబంధాలున్న కేంద్రమాజీ మంత్రి రేణుకాచౌదరి, చాలా ఏళ్ల తర్వాత తన పుట్టింటికి రావడమే కాదు. రైతుల అడుగులో అడుగేశారు. ఇదీ అట్టహాసంగా ఆరంభమయిన అమరావతి రైతు ప్రభం‘జనం’.

ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ అమరావతి రైతులు న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు చేపట్టిన పాదయాత్ర సోమవారం ఉదయం తుళ్లూరు గ్రామంలో అట్టహాసంగా ప్రారంభమైంది. పెద్ద ఎత్తున రైతులు,మహిళలు పాదయాత్రకు బయలుదేరారు. గ్రామంలోని శివాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి రైతు పరిరక్షణ జెండాలను చేతబూని పాద యాత్ర కొనసాగిస్తున్నారు.
ఈ పాదయాత్రలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం కక్షపూరిత చర్యలు తప్ప ప్రజాసంక్షేమం లేదని ఎద్దేవా చేశారు. రైతుల పాదయాత్రకు ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు మాఫియా లకు లేని ఆంక్షలు రైతులకు విధిస్తారా అని అన్నారు. ఎవరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజా ఆక్రోశానికి పతనం తప్పదని అన్నారు. శాంతియుతంగా రైతులు చేస్తున్న నిరసనకు అడ్డంకులు విధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి తెలుగుదేశం నేత నక్కా ఆనందబాబు మాట్లాడుతూ రైతులు 685 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే చీమకుట్టినట్లు కూడా ఈ ప్రభుత్వానికి లేకపోవడంతో, దేవుడే దిక్కని ఈ పాదయాత్ర చేపట్టారని అన్నారు.
ఉద్యమం చేసే వారిని జగన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో విధాలుగా వేధించారని ఆరోపించారు. ఒక రాజధాని కోసం ఇన్ని రోజులు ఉద్యమం చేయడం చరిత్రలో ఎక్కడా లేదని విమర్శించారు. ప్రభుత్వ ఉగ్రవాదం పేరుతో ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేస్తున్నారని అన్నారు. దళితుల పై నే అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత జగన్ రెడ్డిది అన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో పోరాటం చేసి అమరావతి రాజధాని కాపాడుకొని జగన్ రెడ్డిని ఇంటికి పంపుతామని హితవు పలికారు.

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రైతులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి అడ్డంకులు విధించడం ప్రభుత్వ ఉగ్రవాదం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిచి అమరావతి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఈ పాదయాత్రలో సంఘీభావంగా పాల్గొన్న బిజెపి నేత మాజీ మంత్రివర్యులు రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. ఇప్పటికైనా తుగ్లక్ పాలన మాని ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రేణుకా చౌదరి, మస్తాన్ వలీ, సుంకర పద్మశ్రీ, టిడిపి నేతలు మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అమరావతి పరిరక్షణ సమితి,రాజధాని ఐక్య కార్యాచరణ సమితి, దళిత జేఏసీ నేతలు పొలకల పూడి శ్రీనివాసరావు, శివారెడ్డి, సుధాకర్, మల్లికార్జున రావు, టీఎన్ఎస్ఎఫ్ అధినేత రాయపాటి సాయి కృష్ణ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఉదయం ప్రారంభమైన పాదయాత్ర మధ్యాహ్నానికి పెదపరిమి గ్రామానికి చేరుకుంది అక్కడ భోజనం చేసి తిరిగి పాదయాత్ర ప్రారంభించారు. వేలాది మంది రైతాంగం తో రోడ్లన్నీ నిండిపోయాయి. ఈ పాదయాత్ర 45 రోజుల పాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుండి తిరుపతి వరకు సాగుతుందని రైతు నేతలు తెలిపారు. అమరావతి నే రాజధానిగా కొనసాగించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లో మార్పు రావాలని తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకొని పూజలు నిర్వహించిన తర్వాత, ఈ పాదయాత్ర ముగుస్తుందని వివరించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

LEAVE A RESPONSE