బాబుతో యుద్ధమైతే 5 నిమిషాల్లో ముగించేస్తాం

– రాజకీయ సింహం జగన్ మోహన్ రెడ్డి
– ఏ గడప తట్టినా.. జగన్ నినాదమే
– బావురమని ఏడ్చిన బాబు ఈ రాష్ట్రానికి పనికొస్తాడా..?
-మంత్రి అంబటి రాంబాబు

అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
రాజకీయ సింహం జగన్ …
వేటాడమే తప్ప, కుళ్లు, కుతంత్రాలు తెలియని రాజకీయ సింహం, అతి చిన్న వయసులోనే అత్యంత ప్రజాదరణ పొంది 151 సీట్లును గెలుచుకుని ఆంధ్రరాష్ట్రంలో అధికార పీఠాన్ని అధిరోహించిన ధీరుడు, 3,648 కిలోమీటర్లు ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించి, ఒంటిచేత్తో ప్రతిపక్షాలను మట్టి కరిపించిన వీరుడు యెడుగూరి సందింటి జగన్‌ మోహన్‌ రెడ్డికి వందనం… అభివందనం. వర్షం ఉన్నా, మబ్బులు పట్టినా, పిడుగులు పడినా, మెరుపులు మెరుస్తున్నా.. రాష్ట్రం నలుచెరుగుల నుంచి విచ్చేసిన, పార్టీకి జవసత్వాలు అయిన పార్టీ కార్యకర్తలకు నా హృదయ పూర్వక నమస్కారాలు అందచేస్తున్నాను.

– రాష్ట్రంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలో ప్రజలు మూడేళ్ల క్రితం ఎన్నుకున్నారు. మూడేళ్ల పరిపాలన పూర్తిచేసుకుని నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టాం. మిగిలిన రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నాక, మళ్లీ ప్రజల దగ్గరకు వెళ్లి వాళ్ల ఆశీసులు పొంది మరోసారి వన్స్‌మోర్‌ అనిపించుకుని మళ్లీ అధికార పీఠాన్ని అధిరోహించబోతున్నాము.

ఏ గడప తట్టినా… జగన్ నినాదమే..
అందుకే మన అధినాయకుడు మమ్మల్ని, మిమ్మల్ని ఇంటింటికి, గడప గడపకు వెళ్లాలని ఆదేశించారు. గడప గడపకు వెళ్ళి, మూడేళ్ల పాటు మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గడప గడపకు వివరించి, వాళ్ల ఆశీస్సులు పొందాలని సూచించారు. కులాలు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి గడప గడపకు, ఇంటింటికి వెళుతున్నాం. ఏ గడప ఎక్కినా, ఏ గుండె తట్టినా జగన్‌ జగన్‌ జగన్‌ అనే నినాదమే మారుమోగుతోంది. మళ్లీ రెండేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికవుతారు. ఇది సత్యం.

– ఈ నేపధ్యంలో మన అధికారం లాక్కోవాలని, తనది కాని అధికారాన్ని అనుభవించాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తాపత్రాయపడుతున్నారు. ఆయన ఒక్కడైతే ఫరవాలేదు. మన ముఖ్యమంత్రి ఎప్పుడో చెప్పారు. చంద్రబాబుతో యుద్ధం అయితే అయిదు నిమిషాల్లో పూర్తి చేస్తాం. కానీ చంద్రబాబుతో కాదు ఎన్నికల యుద్ధం. ఆయన వెనక ఉన్న దుష్టచతుష్టయంతో.

వారిలో..
1. చెరుకూరి రామోజీరావు. ఆయన గురించి తెలియనివారు లేరు. పచ్చళ్లు అమ్ముకునే స్థాయి నుంచి పచ్చ మీడియా స్థాయికి వెళ్లి ప్రపంచంలోనే అత్యాధునికమైన ఫిల్మ్‌ సిటీ నిర్మించి, లక్షలాది కోట్లు దొంగ మార్గంలో అన్వేషించిన ఒక ప్రబుద్ధుడు.

2. చంద్రబాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రెండెకరాల పొలంతో ప్రారంభించి, పార్టీలు మారి కాంగ్రెస్‌లో ఉండి.. మంత్రిగా పనిచేసి, ఆ తర్వాత తెలుగుదేశంలోకి వెళ్లి వారి సొంత మామనే వెన్నుపోటు పొడిచి అక్రమంగా అధికారంలోకి వచ్చి వేలాది, లక్షలాది కోట్లు సంపాదించిన ధనవంతుడు.

3. వీరికి తోడు ఏబీఎన్‌ రాధాకృష్ణ. ముందుగా ఆయన ఒక సైకిల్‌ మీద స్టింగర్‌గా తన ప్రస్థానం మొదలుపెట్టి ఆ తర్వాత అన్యాయంగా, అక్రమంగా వేల కోట్లు సంపాదించి ఆ పేపర్‌కే అధిపతి అయిన పెద్ద మోసగాడు.

4. ఇంకో ఆయన వచ్చాడు. టీవీ5 నాయుడు. ఆయనకు అడ్రస్సే లేదు టీవీ5 లేకపోతే. ఈ నలుగురు దుష్టచతుష్టయం తనది కాని అధికారాన్ని జగన్‌ మోహన్‌ రెడ్డి వద్ద నుంచి లాక్కోవాలని అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. మహాభారతంలో దుష్ట చతుష్టయాన్ని చూశాం. పాండవుల దగ్గర నుంచి అధికారాన్ని లాక్కోవాలని, తనకు లేని అధికారాన్ని సాధించాలని దుష్టచతుష్టయం దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునిలు. ఆరోజు మహా భారతంలో వాళ్లు ఎలా పతనం అయ్యారో… ఈరోజున ఆంధ్ర భారతంలో కూడా ఈ దుష్ట చతుష్టయం పతనం కాబోతున్నారు.

ఆ దుష్ట చతుష్టయానికి ప్రభుత్వం చేసే మంచి కనిపించదు..
పేదలు చదువుకునే బడులు, ప్రభుత్వ ఆస్పత్రులను నాడు-నేడు కార్యక్రమం ద్వారా బాగుచేసిన మహానుభావుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఇది మాత్రం వారికి కనిపించదు. ఈ విషయాన్ని గురించి, ఫ్రంట్‌ పేజీలో ఒక్క ముక్క కూడా రాయరు. నిత్యం, కుళ్లు, కుతంత్రాలతో అబద్ధాలు, అసత్యాలతో, ఏవేవో కట్టుకథలు రాసి మసిపూసి మారేడుకాయ చేసి జగన్‌ మోహన్‌ రెడ్డి మీద బురద చల్లే ప్రయత్నం మాత్రం చేస్తారు. అలాంటి దుష్ట శక్తులను ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంకావాలని అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను.

సీఎం సీఎం అంటుంటే.. ప్యాకేజీ ప్యాకేజీ అంటున్నాడు..
వీరికి తోడు మరొకరు ఉన్నారు. ఎవరైనా రాజకీయ పార్టీ పెడితే అధికారంలోకి రావాలనుకుంటారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. కానీ ఒకాయన పార్టీ పెట్టాడు. అయితే ఆయన అధికారంలోకి రావాలని కనీసం కోరిక కూడా కోరుకోడు. చంద్రబాబు అధికారంలోకి రావాలి. ఆయనకు కావాల్సింది ప్యాకేజీ మాత్రమే. ఆయనే చంద్రబాబు దత్తపుత్రుడు. ఆయన పేరు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా నటుడు కదా.. మీటింగుల్లో ఆయనను సీఎం సీఎం అంటుంటే… ఈయనేమో ప్యాకేజీ తీసుకుని, ప్యాకేజి, ప్యాకేజి అని, చంద్రబాబు సీఎం సీఎం అంటున్నాడు. ఇలా అనడానికి సిగ్గుండాలి. ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలను దుష్ట చతుష్టయం నడుపుతోంది.

– అనేక కుట్రలు, కుతంత్రాలు చేసి 16 నెలలు జైల్లో పెట్టించారు. ఆస్తులను సీజ్‌ చేయించారు. ఆస్తులు పోయినా ప్రజలే తన ఆస్థి అని భావించి చిరునవ్వుతో బాధలు ఎదుర్కొన్న వ్యక్తి జగన్‌ మోహన్‌ రెడ్డి. ఎవరూ ఏమీ అనకపోయినా, ఏదో అన్నారని మైక్‌ల ముందు బావురుమని ఏడ్చిన వ్యక్తి ఈ రాష్ట్రానికి పనికి వస్తాడా అనే ఆలోచన చేయాలి.

జగన్ కష్టార్జతంతో ఎదిగిన పార్టీ..
ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, ఈ దుష్ట చతుష్టయంతో పోరాడి, అధికారంలోకి వచ్చిన వ్యక్తి జగన్ . ప్లీనరీ ప్లీనరీకి అడుగులు ముందుకు వేస్తు కదిలిన పార్టీ ఇది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణంతో ఏర్పడ్డ రాజకీయ పక్షం ఇది. జగన్‌ కష్టార్జితంతో ఎదిగిన పార్టీ. మీరంతా అండగా ఉన్నంతవరకూ ఈ రాజకీయ పక్షాన్ని ఎవరూ ఏమీ చేయలేరు.

– కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే… ఆ సందులో నుంచి అధికారాన్ని దుష్ట చతుష్టయం లాగేసుకోవాలని చూస్తుంది. కాలికి బుద్ధి చెప్పి గడప గడపకు వెళ్లి జగనన్న సందేశాన్ని వినిపించండి. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే. ప్రతి అయిదేళ్లకు వన్స్‌ మోర్‌, వన్స్‌మోర్‌ అని జగన్‌ మోహన్‌ రెడ్డికి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందుకు మీ అందరి ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి, జగన్ మోహన్ రెడ్డికి కావాలని కోరుకుంటున్నాను.

Leave a Reply