తప్పుడు వార్తల రామోజీ.. నీకిది తగునా..?

– నేను అనని మాటలను అన్నట్టుగా రామోజీ అడ్డగోలు రాతలు
– పేపరు, సర్క్యులేషన్ ఉంది కదా అని అన్యాయైన వార్తలు రాయడం తప్పు రామోజీ..
– బాబును అర్థాంతరంగా సీఎంను చేయాలనే ఆరాటంలో ఈనాడు అడ్డగోలు రాతలు
– పోలవరంపై వివాదాలే లేవు, దయచేసి వివాదాలకు తావివ్వొద్దు..
-రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…

కనీవినీ ఎరుగని రీతిలో వరద సహాయక చర్యలు

గోదావరి నదికి అనూహ్యంగా వరదలు రావడం వల్ల గోదావరి నదీ పరివాహక ప్రాంతంమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని గ్రామాలు ముంపునకు గురి అయ్యాయి. అయితే, వరదలను అడ్డు పెట్టుకుని కొన్ని ఎల్లో పత్రికలు పనిగట్టుకుని మరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద బురదచల్లాలనే కార్యక్రమాన్ని చేస్తున్నాయి. నిన్న ఈనాడు రామోజీరావు పత్రికలో రాసిన రాతలకు, వాళ్ళ టీవీల్లో కూసిన కూతలకు సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం విజయవాడలో చేయడం జరిగింది.

రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏ విధంగా నడుస్తున్నాయి, అనూహ్యంగా వచ్చిన వరదల నుంచి ప్రజలను ఏ విధంగా కాపాడటం జరిగిందో అన్నీ సవివరంగా వివరించాం. పూర్వం ఉభయ గోదావరి జిల్లాల్లో ఇద్దరే ఇద్దరు కలెక్టర్లు ఉంటే.. ఇప్పుడు ఆ ప్రాంతమంతా ఆరు జిల్లాలుగా మారడం, ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు ఎస్పీలు, ఆరుగురు జాయింట్ కలెక్టర్లు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు.. ప్రజా ప్రతినిధులు.. వీరంతా కలిసికట్టుగా సమర్థవంతంగా పనిచేసి, ప్రాణ నష్టం లేకుండా, వరదను ఎదుర్కోవడమే కాకుండా, కనీవినీ ఎరుగని రీతిలో సహాయ చర్యలు చేపట్టాం.

బాబును అర్థాంతరంగా సీఎంను చేయాలనే ఆరాటంతో రామోజీ అడ్డగోలు రాతలు అయితే, ప్రతిపక్ష నేత చంద్రబాబును అర్థాంతరంగా ముఖ్యమంత్రి చేయాలని ఆరాటపడే రామోజీరావు, ఆయన పత్రిక అయిన ఈనాడు, తాను అనని మాటలను, వారి వార్తలకు అనుకూలంగా నా మాటలను మరల్చుకుని వక్రీకరించి ఈరోజు రాశారు.

నిన్న ఈనాడులో “పిల్లలకు పాలు చుక్క లేదు.. పెద్దలకు తిండి లేదు” అని బ్యానర్ స్టోరీ రాశారు. ఇది తప్పు అని మేం ఖండించాం. వరద బాధితులకు పూర్తి సహాయక చర్యలతో పాటు, ఎప్పుడూ, ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా బాధితులకు రూ. 2 వేలు ఇచ్చిన ప్రభుత్వం ఇదొక్కటే అని కూడా చెప్పాం. నేను ఒకటి చెబితే.. ఈనాడు వాళ్ళు వక్రీకరించి మరొకటి చెప్పే ప్రయత్నం చేశారు. “అది ప్రకృతి విపత్తు.. మనమేం చేయలేం.. ” అని నేను అనని మాటలను అన్నట్టు, ఆయన వార్తకు సపోర్టుగా నన్ను వాడుకున్నాడు. ఇది చాలా దురదృష్టకరం, అభ్యంతరకరం, ఈనాడు రామోజీకి ఇది తగదు. నిన్న మీరు రాసిన వార్తకు అనుకూలంగా నా మాటలు సరిచేసుకోవడం అభ్యంతరకరం. మీరు రాసిన వార్తలకు, నా మాటలను వాడుకుంటారా..?.

ఊహించని విధంగా వరద వచ్చిందని చెప్పాను. అది ట్రూ. దానికి నేను స్టాండ్ అవుతున్నాను. జులై మాసంలో ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చిన సందర్భాలు లేవు. ఊహకు అతీతంగా వరద వచ్చినా, విరుచుకుపడినా, సహాయ కార్యక్రమాలు చేయడంలో ఏ విధమైన అలసత్వం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది. దానికి నేను అనని మాటలను “ప్రకృతి వైపరీత్యం.. మనమేం చేయలేం” అని ప్రభుత్వం చేతులెత్తేసింది అన్నట్టుగా వక్రీకరించి రాతలు రాస్తారా రామోజీ..?. మీకు వయసు పెరిగింది కానీ, దానికి తగ్గట్టుగా బుద్ధి పెరగక పోగా, రోజురోజుకీ దిగజారిపోతున్నారు.
మీరెన్ని రాతలు రాసినా, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటం మీ తరం కాదు అని మేం పదే పదే చెబుతున్నాం. అయినా మీ వక్రీకరణలు, అడ్డగోలు రాతలు మాత్రం ఆపడం లేదు. మేం అనని మాటలు వాడుకోవడానికి దుర్మార్గమైన ప్రయత్నం రామోజీ చేస్తున్నాడు. మీ వర్గం వాడని, మీ వాడని చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలనుకుంటే.. ప్రజల్లోకి వెళ్ళండి. అంతేగానీ తప్పుడు వార్తలతో, వక్రీకరణలతో అధికారంలోకి తేలేరు. ఇదంతా ఒక సైకలాజికల్ గేమ్.

తప్పుడు వార్తల రామోజీ.. నీకిది తగునా..?

ఈరోజే కాదు. గతంలో కూడా ఈనాడులో ఇటువంటి అబద్ధాలు, అసత్యాలతో కూడిన అనేక వార్తలు రాశారు. ఉదాహరణకు మే 18,2022న “ఎత్తిపోతున్నాయ్..” అంటూ ఎత్తిపోతల పథకాల గురించి.. ఇదే ఈనాడు రామోజీ వక్ర బుద్ధితో, దుర్మార్గపు బుద్ధితో.. మా ప్రభుత్వంపై బురదచల్లాలని వార్తలను వండివార్చారు. వైఎస్ఆర్ జిల్లాలో నిరుపయోగంగా ఒంటిమిట్ట ఎత్తిపోతల పథకం.. అది ఎత్తిపోయింది అంటూ రాతలు రాస్తే… అది ఎక్కడికీ ఎత్తిపోలేదు.. సక్రమంగా ఉందని మేం ప్రెస్ మీట్ పెట్టి ఖండించాం. ఆ ప్రాజెక్టు నడుస్తుందని చెప్పాం. కానీ, మేం చెప్పిన వాస్తవాలు మాత్రం ఈనాడు రామోజీవారు రాయలేదు. మాపై బురదచల్లటానికి మాత్రమే రాతలు రాస్తారు. నేను సవాల్ చేసినా, ఆ వార్త రాయలేదు.

ఎక్కడ సందు దొరికితే.. అక్కడ బురదచల్లడం, అనని మాటలు అన్నట్టు రాయడం .. ఒక మంత్రిగా ఉన్న నన్ను కూడా ఆఖరికి, ఆయన రాసిన వార్తలకు అనుకూలంగా వాడుకుంటున్నాడంటే.. ఇదేనా ఈనాడు స్టాండెట్స్ అని ప్రశ్నిస్తున్నాం. ఇదంతా రామోజీ కుట్ర అని ప్రజలకు అర్థం కావడం లేదా…? నేను విజయవాడలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన విషయాలు.. 33 నిమిషాలు నిడివి కలిగిన వీడియోలో యూ ట్యూబ్ లో కూడా ఉంది. దానిని ఎవరైనా చూసుకోవచ్చు. రామోజీ కూడా చూడొచ్చు.

ఇటువంటి ప్రకృతి వైపరీత్యంలో ఎంత వరకు చేయాలో.. అంతకన్నా మించి రాష్ట్ర ప్రభుత్వం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేసింది అని నేను చెప్పాను. చంద్రబాబులా వరదల్లో కామెడీలు చేయలేదు. చంద్రబాబు నాయుడు కామెడీలు ఎలా ఉంటాయంటే.. అమరావతిలో ఉష్ణోగ్రతలు కంట్రోలు చేయమని అధికారులను ఆదేశించాడు. తిత్లీ తుఫాను బాధితుల దగ్గరకు వెళ్ళి సముద్రాన్ని కంట్రోల్ చేస్తున్నానని చెప్పాడు.. అటువంటి వార్తలు మాత్రం ఈనాడు రామోజీకి కనపడవు, ఆయన పత్రికలో రాయడు.

మరోసారి ఇలాంటి వార్తలు రాస్తే.. ప్రజలే మిమ్మల్ని క్షమించరు అని హెచ్చరిస్తున్నాం.
అప్పుడెప్పుడో సీబీఐ పిలిచినప్పుడు నా ఫోటోను, వార్తను ఈనాడు ఫ్రంట్ పేజీలో వేశాడు. మళ్ళీ ఈరోజు నేను అనని మాటలను, ఆయనకు అనుకూలంగా మార్చుకునేందుకు నా ఫోటోను, వార్తను ఫ్రంట్ పేజీలో వేశారు. అంటే నాకు కీడు జరుగుతుందంటేనో.. లేక ఆయనకు ఏదైనా ఉపయోగపడుతుందంటేనో ఆయన నా వార్తలు ఫ్రంట్ పేజీలో వేస్తాడు. రామోజీ నా వార్తలు వేసినా, వేయకపోయినా ఐ డోంట్ కేర్..
ఇప్పటికైనా, వక్రమార్గం నుండి సరైన మార్గంలో పయనించండి రామోజీ అని హితవు చెబుతున్నాను. ఈరోజు ఈనాడు చదివినవారు, నా వార్తను చూసినవారంతా ఆలోచించి, తప్పుడు వార్తలు రాస్తున్న ఈనాడు నిజ స్వరూపం ఏమిటో తెలుసుకోండి. పేపర్ ఉందికదా, సర్క్యులేషన్ ఉంది కదా అని అన్యాయమైన వార్తలు రాయడం తప్పు.

ఇది వివాదమే కాదు.. దయచేసి వివాదం చేయొద్దు

గోదావరి వరదల సందర్భంగా.. తెలంగాణలోనూ, ఆంధ్రాలోనూ కొన్ని ప్రాంతాలు మునిగిపోతాయి. ఇది కొత్త విషయమేమీ కాదు. అయితే, తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ.. పోలవరం ఎత్తు పెంచడం వల్లే తెలంగాణకు నష్టం జరుగుతుంది అని, భద్రాచలం నీట మునిగిందని మాట్లాడటం సరైనది కాదు.

ఇరువురం రెండు రాష్ట్రాల్లో బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నాం. రెండు రాష్ట్రాల్లో పరిపాలన చేస్తున్నాం. మనమంతా తెలుగు ప్రజలం. సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నవాళ్ళం. ఇది అసలు వివాదమే కాదు. కొత్త వివాదానికి మీరు అంకురార్పణ చేయొద్దు అని మనవి చేస్తున్నాను.

ప్రస్తుతానికి పోలవరం నిర్మాణానికి సంబంధించి ఎటువంటి హర్డిల్స్ లేవు. అది జాతీయ ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టుకు 45.72 మీటర్ల ఎఫ్ ఆర్ లెవల్ కు కేంద్రం నుంచి క్లియరెన్స్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంటింగ్ అథారిటీ మాత్రమే. సెంట్రల్ గవర్నమెంటు ఆదేశాల మేరకే మేం నడుస్తున్నాం. గోదావరి వరదల వల్ల, ప్రజలు ఆపదనలో ఉన్నప్పుడు మొన్న కాఫర్ డ్యామ్ లెవల్ పెంచినప్పుడు కూడా సీడబ్ల్యూసీ, కేంద్రానికి సమాచారం ఇచ్చి పెంచాం.

ఆ లెవల్ వరకు పోలవరం డ్యామ్ లో నీళ్ళు నింపితే ఎవరికీ నష్టం లేదు. అయితే, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 7 మండలాలకు నష్టం ఉంటుంది కాబట్టే, వాటిని ఆంధ్రాలో కలిపారు.
భద్రాద్రి మునిగిపోతే, ప్రజలు వరదల్లో మునిగితే వివాదం చేయడం భావ్యం కాదు. గతంలో భద్రాచలం మునగలేదా..? అంతరాష్ట్రాల మధ్య వివాదాలు ఏమైనా ఉంటే.. వాటన్నింటినీ సీడబ్ల్యూసీ, కేంద్రం ఆలోచించి, అధ్యయనం చేసి క్లియరెన్స్ ఇచ్చారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలన్నింటినీ సర్వే చేసిన తర్వాతే కేంద్రం క్లియరెన్స్ ఇచ్చింది.

ఒకవేళ వివాదాలు ఏమైనా ఉంటే దానికి వేదికలు ఉన్నాయి. సీడబ్లూసీ, కేంద్రం, పీపీఏ, జలశక్తి మంత్రిత్వ శాఖ, గోదావరి, కృష్ణా నదీ బోర్డులు ఉన్నాయి. అయినా పోలవరం ప్రాజెక్టు లెవల్ 45.72 మీటర్లు అని సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్, పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే ఆ లెవల్ పెట్టింది.
ఇదేదో రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమం కాదు.. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఎప్పుడో పర్మిషన్లు ఇచ్చింది. ఇందులో ఎటువంటి వివాదాలు లేవు, వివాదాలకు తావివ్వొద్దు. రీజినల్ ఫీలింగ్స్ తేవద్దు. విడిపోయినా మనమంతా కలిసి ఉండాలి కదా.. అందుకే, అనవసర వివాదాలు వద్దు.

తెలుగు ప్రజలమైన మనమంతా బ్రదర్స్… 5 గ్రామాలు మాకు ఇచ్చేయమని ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు. అలాంటివి ఏమైనా ఉంటే, వెళ్ళి కేంద్రాన్ని అడగండి. భద్రాచలం మాది అంటే మీరు ఇస్తారా..? సెటిల్ అయిపోయినవాటిని ఎందుకు మళ్ళీ లేపుతున్నారు. దీనివల్ల రాజకీయంగా ప్రయోజనం ఏమీ ఉండదు. లాజిక్, రీజన్, ధర్మం ఉంటే.. వివాదం చేయవచ్చు కానీ, లేని వివాదాలను రాజేయవద్దు.
ఏపీలో విలీనం చేసిన 7 మండలాల ముంపు గ్రామాలకు పునరావాసం కల్పిస్తాం.

పోలవరం ప్రాజెక్టును తొందరలోనే పూర్తి చేస్తాం. డేట్ చెప్పలేం. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. దశల వారీగానే ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఒకేసారి 50 లక్షల క్యూసెక్కులను స్పిల్ వే నుంచి రిలీజ్ చేయగలిగే, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది ఒక్క పోలవరం ప్రాజెక్టు.
దయచేసి, వివాదాన్ని పెంచే కార్యక్రమాలు చేయకండి.

Leave a Reply