పోలవరం ఎత్తు పెంచుతుంటే ఏం చేస్తున్నారు?

-ముంపు నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలి
-ఏడు మండలాలు తీసుకురావడం కోసం ఏం చేస్తారో చెప్పాలి.
-వరద సహాయక చర్యలకు 1000 కోట్లు సరిపోవు
-క్షేత్రస్థాయిలోకి అధికారులను పంపించి నష్టం అంచనా వేసి నిధులు విడుదల చేయాలి
-క్లౌడ్ బరస్ట్ అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహిత్యం
-మీడియా సమావేశంలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క

పోలవరం ఎత్తు పెంచుతుంటే మీరేం చేస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతున్నదా? పోలవరం కాపర్ డ్యామ్ ఎత్తు మూడు మీటర్లు పెంచి కట్టడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఎందుకు బాధ్యత రాహిత్యంగా ఉన్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క టిఆర్ఎస్ సర్కారు పై ఫైర్ అయ్యారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పోలవరం ఎత్తు పెంచి కడితే అమాయక గిరిజనులు ఇబ్బందులు పడతారని సోయి ఈ ప్రభుత్వానికి ఎందుకు లేదని నిలదీశారు. ” కృష్ణా, గోదావరి పై ఆనకట్టల నిర్మాణాలను ప్రతి రోజు ముఖ్యమంత్రి గూగుల్ ద్వారా వీక్షిస్తారనే ప్రచారం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ఎత్తు పెంచుతూ నిర్మాణం చేపడుతుంటే గూగుల్ లో చూశారా? చూసిన కనపడలేదా?” అంటూ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి పోలవరం ముంపు సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మోడీ ప్రధాని గా ఈ బిల్లులో లేని ఈ 7 మండలాలను ఆర్డినెన్స్ రూపంలో ఆంధ్ర కు ధారాదత్తం చేసిన దానిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి శాసనసభ లో తీర్మానం కూడా చేపించామన్నారు.

శాసనసభలో చేసిన ఈ తీర్మానం గురించి రాష్ట్ర ప్రభుత్వం 8 సంవత్సరాలు కావస్తున్న పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్ర శాసనసభలో చేసిన తీర్మానాన్ని ఈ ప్రభుత్వం ఏమి చేసింది? కేంద్ర ప్రభుత్వానికి పంపించిందా? పంపిస్తే వారు ఇచ్చిన సమాధానం ఏమిటి? ఈ అంశంపై ముఖ్యమంత్రి ప్రధానిని ఎన్నిసార్లు కలిశారు? ఆర్డినెన్స్ రద్దు కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేయలేదు?

అఖిలపక్షాన్ని కల్పించడం కోసం కనీసం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు జరిగాయా? వీటిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. అసెంబ్లీ వేదిక సాక్షిగా ఈ అంశాన్ని తాను మూడుసార్లు లేవనెత్తాన్ని గుర్తు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి తన రాష్ట్రంలో 3 వేల ఎకరాలు ముంపుకు గురవుతుంటే ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు చెప్పారని, పోలవరం ద్వారా తెలంగాణకు సంబంధించిన 2 లక్షల ఎకరాల ముంపుకు గురవుతుంటే కెసిఆర్ ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో చేసిన ఏకగ్రీవ తీర్మానంపై ఒక కంక్లూజన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. ఆంధ్రాలో విలీనం చేసిన 7 గిరిజన మండలాలు తెలంగాణలో ఉంటే ఆ భూములు, ఆ అడవులు మనకే ఉండేవి కావా? అని ప్రశ్నించారు. కరకట్ట నిర్మాణాల కోసం ఇప్పుడు ఐదు గ్రామాలను ఇవ్వాలని కోరేటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదన్న విషయాన్ని టిఆర్ఎస్ పాలకులు గ్రహించాలన్నారు. ఇప్పటికైనా తిరిగి ఏడు మండలాలను తీసుకురావడం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం ప్రయత్నం చేస్తుందో వెల్లడించాలని కోరారు.

వరద పై నుండి వచ్చిందా…? పోలవరం నుండే వచ్చిందా? అనే విషయం ప్రభుత్వం ప్రజలకు చెప్పాలన్నారు. తాత్కాలిక ఉపశమన చర్యలు కాకుండా పోలవరం ముంపు నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని, అవసరమైతే నిపుణుల కమిటీ వేసి సమగ్ర విచారణ చేయించి నివేదిక తీసుకొని అందుకు తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్ రూపొందించి పనులు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

తెలంగాణ ప్రాంతంలో అత్యంత ఎత్తైన ప్రాంతమైన తమ్మిడిహట్టి దగ్గర అంబేద్కర్ పేరు మీద ప్రాణహిత ప్రాజెక్టును డిజైన్ చేసి కాంగ్రెస్ మొదలుపెట్టిందన్నారు. అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి 152 నిర్మించాల్సిన ప్రాజెక్టును 100 మీటర్ల దిగువకు కుదించి మేడిగడ్డ వద్ద కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడం వల్లే బ్యాక్ వాటర్ తో అనేక జిల్లాల్లో వరదలు వచ్చి తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు.

ఇంజనీర్లు చేయాల్సిన ప్రాజెక్టు నిర్మాణం పనులను కేసీఆర్ చేయడం వల్లే ఇలా ప్రమాదకరంగా మారిందని ధ్వజమెత్తారు. కాలేశ్వరం డిజైన్ లోపం వల్ల ఇలాంటి ముప్పు వస్తుందని కాంగ్రెస్ పార్టీ ముందే హెచ్చరించిన టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టు లపై టెక్నీకల్ కమిటీని వేయాలన్నారు. సాంకేతిక నిపుణులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ముంపుకు గురి కాకుండా ఎం చేస్తే బాగుంటుందని ఒక సమగ్ర నివేదిక రూపొందించాలని ప్రభుత్వానికి సూచించారు.

వరద సహాయక చర్యల కోసం ప్రభుత్వం ఇస్తాన్న 1000 కోట్లు సరిపోవని, అధికారులను క్షేత్రస్థాయిలోకి పంపించి నష్టం అంచనా వేయించి అందుకు తగ్గట్టుగా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వరదల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి అందాల్సిన సహాయ సహకారాలు అందాలి. యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపించాలి.

నష్టపోయిన పంటలకు నష్టపరిహారం.. కాలేశ్వరం డిజైన్ లోపం ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రజలను పక్కదారి పట్టించడానికి ముఖ్యమంత్రి క్లౌడ్ బరస్ట్ అని వ్యాఖ్యలు చేయడం బాధ్యతరాహిత్యమని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఇలా మాట్లాడరని విమర్శించారు.

Leave a Reply