-పొలం అమ్మి రాజధానికి విరాళం ఇచ్చిన వైష్టవి స్ఫూర్తిని అభినందించిన సీఎం చంద్రబాబు
-రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా వైష్ణవిని నియమించిన సిఎం చంద్రబాబు
-పోలవరం కోసం మరో రూ.1 లక్ష విరాళం ఇచ్చిన వైష్ణవిని ప్రశంసించిన ముఖ్యమంత్రి
-తండ్రితో కలిసి రెండు చెక్కులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేత
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి, రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైష్ణవి అనే వైద్య విద్యార్థిని విరాళం అందించారు. ఏలూరు జిల్లా, ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి శనివారం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడుని శనివారం కలిసి విరాళం అందించారు. అమరావతి నిర్మాణానికి రూ.25 లక్షలు, పోలవరం ప్రాజెక్టుకు రూ.1 లక్ష చొప్పున విరాళం ఇస్తూ సీఎం చంద్రబాబుకు చెక్కు అందించారు.
తమకున్న మూడు ఎకరాల భూమిలో ఎకరా అమ్మగా వచ్చిన రూ.25 లక్షలను రాజధానికి, తన బంగారు గాజులు అమ్మగా వచ్చిన రూ.1 లక్షను పోలవరానికి విరాళంగా అందించినట్లు వైష్ణవి తెలిపారు. రాజధానిని నిర్మిద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ది చేద్దాం అనే ఆలోచనతో పనిచేస్తున్న ప్రభుత్వానికి తనవంతుగా ఈ విరాళం ఇచ్చినట్లు ఆమె తెలిపారు.
రాజధాని నిర్మాణం కోసం వైష్ణవి పొలం అమ్మి మరీ విరాళం ఇవ్వడం గొప్ప విషయం అని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం విద్యార్థిగానే ఉన్న వైష్ణవి….తండ్రి సహకారంతో రాజధాని కోసం, పోలవరం కోసం విరాళం ఇవ్వడం ఎంతో గొప్ప విషయం అన్నారు. నేటి యువతకు వైష్ణవి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. ఇలాంటి యువత కలలు తమ ప్రభుత్వం నిజం చేస్తుందని చంద్రబాబు అన్నారు.
ఎటువంటి లాభాపేక్షలేకుండా ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప మనుసు చాటిని వైష్ణవిని సీఎం శాలువా కప్పి సత్కరించారు. స్ఫూర్తి దాయకంగా నిలిచిన వైష్ణవిని సీఎం అమరావతి కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. వైష్ణవి విజయవాడలోని ఓ మెడికల్ కాలేజ్ లో ప్రస్తుతం ఎంబిబిఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఈ సందర్భంగా వైష్ణవితో పాటు, ఆమె తండ్రి అంబుల మనోజ్ ను సిఎం చంద్రబాబు అభినందించారు.