మన దేశం శ్రేయో రాజ్యం. ఈ శ్రేయో రాజ్యంలో ప్రజల శ్రేయస్సును కాపాడే బాధ్యత ప్రభుత్వాలది. ఆ ప్రభుత్వాలు పెన్షన్ భారం నుంచి బయటపడటానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే రెండు దశాబ్దాల కిందట వాజపేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని రద్దుచేసి కొత్తగా జాతీయ పెన్షన్ విధానాన్ని తెచ్చింది.
‘కొత్త పెన్షన్ వద్దు- పాత పెన్షన్ ముద్దు’ అని ఉద్యోగులు, పెన్షనర్లు రెండు దశాబ్దాలుగా ఆందోళన చేస్తుంటే పాలకులు పట్టించుకోవడం లేదు. మళ్లీ అదే బీజేపీ ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి బదులుగా కొత్త పెన్షన్ విధానంలో కొన్ని మార్పులు తెస్తూ 2025, ఏప్రిల్ 1 నుంచి అమలయ్యే యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని తెచ్చింది. అంతేకాకుండా పాత పెన్షన్ దారులకు హానిచేసే మరో బిల్లును 2025-2026 ఆర్థిక బిల్లులో భాగంగా గుట్టుచప్పుడు కాకుండా లోక్‌సభ ఆమోదించింది.
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఒక వైపు ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే మరోవైపు పెన్షన్‌దారులకు నష్టదాయకంగా ఉండేవిధంగా లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లును త్వరలోనే రాజ్యసభలో ఆమోదింపజేసుకుంటారు. ఆ తర్వాత రాష్ట్రపతి సంతకంతో ఇది చట్టమవుతుంది. పెన్షనర్లను పాత, కొత్త పెన్షనర్లుగా విడదీయడం ఈ బిల్లులోని ముఖ్య విషయం.
ఈ బిల్లులోని సవరణల ద్వారా కేంద్ర ప్రభుత్వ పౌర సేవల (సివిల్ సర్వీసెస్) పెన్షన్ నిబంధనలు 1972, 2021 అసాధారణ (ఎక్స్‌ట్రార్డినరీ) పెన్షన్ నిబంధనలు 2023లో మార్పులు వస్తాయి. కొత్త సవరణల ద్వారా వేతన సవరణల ఫలితంగా వచ్చే లాభాలను వేతన సవరణ కమిషన్ సిఫారసులు అమలైన తేదీ తర్వాత పదవీ విరమణ పొందిన ఉద్యోగులకే వర్తిస్తాయి. ఆ తేదీకి ముందు రిటైరైన పింఛనర్లకు పే కమిషన్ సిఫారసు చేసిన లాభాలు వర్తించవు. పే కమిషన్ సిఫారసులను ఎప్పుడు ఎలా అమలుచేయాలో నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
దీని ద్వారా పెన్షన్ హక్కులు ఎవరికి వర్తించాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సవరణ సంఘం సిఫారసులు 2026 జనవరి 1 నుంచి అమలు చేయవలసి ఉన్నది. ఇప్పుడు ఈ చట్టం ద్వారా పెన్షనర్లు రెండు గ్రూపులు అవుతారు. అంటే 01-01-2026 ముందు పదవి విరమణ చేసినవారు, తర్వాత పదవీ విరమణ చేసినవారు. అట్లే ఈ చట్టం ద్వారా వేతన కమిషన్ అమలుచేసిన తేదీ లేదా కేంద్రం నిర్ణయించిన తేదీ ప్రకారం… పదవీ విరమణ చేసినవారికి మాత్ర మే ఆర్థిక లాభం చేకూరుతుంది. మిగిలినవారికి ఆర్థిక లబ్ధి ఉండదు.
వారికి ప్రస్తుతం పొందుతున్న పెన్షన్ మాత్రమే వస్తుంది. అట్లే ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ 01.03.2025న పదవీ విరమణ చేశారు, కానీ కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘ సిఫారసులు 01.01.2026 నుంచి అమలు చేస్తే, ముందు పదవీ విరమణ చేసినవారు ఎవరికి ఈ చట్టం ప్రకారం ఆర్థిక లబ్ధి జరుగదు. అంటే 1.1.26 తదుపరి పదవీ విరమణ చేసినవారికి మాత్రమే వేతన సంఘం సిఫారసుల లబ్ధి వర్తిస్తుంది.
పెన్షనర్లను పదవీ విరమణ తేదీ ఆధారంగా వేరు చేయడం అసమంజసమని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ సవరణ బిల్లు ద్వారా ప్రభుత్వం ఆ తీర్పును నిర్వీర్యం చేస్తూ పెన్షనర్లను పదవీ విరమణ తేదీ ఆధారంగా నిర్ణయించడానికి ప్రభుత్వానికి అధికారం కల్పిస్తున్నది. ఈ బిల్లు చట్టరూపంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తే, రాష్ర్టాలు కూడా అమలుచేస్తాయి. ఫలితంగా మన రాష్ట్రంలోని పెన్షనర్లు కూడా తీవ్రంగా నష్టపోతారు. కేంద్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పెన్షన్ పొందుతున్న పెన్షనర్లకు ఈ మార్పు వర్తిస్తుందని బిల్లులో పేర్కొన్నారు.
కొంతమంది ఈ చట్టం న్యాయపరంగా చెల్లదని సీనియర్ పెన్షనర్లకు తక్కువ పెన్షన్, జూనియర్లకు ఎక్కువ పెన్షన్ వచ్చే అవకాశం ఉండటం వల్ల పెన్షన్ అనామలీలు ఏర్పడుతాయనుకుంటున్నారు. కానీ, కేంద్రం బిల్లులో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులను ఉటంకిస్తూ పెన్షన్ చెల్లింపు అనేది డిఫర్డ్ వేజ్‌గా గుర్తిస్తున్నామని, అందుకే పెన్షన్ చెల్లింపు ఉన్నదని పేర్కొంటూనే, 1950, 1960,1970లలో పనిచేసిన ఉద్యోగికి 1986లో పెన్షన్ చెల్లించాల్సిన అవసరం ఏమిటని, ఉద్యోగి పనిచేసిన కాలపు డిఫర్డ్ వేజ్‌ను పెన్షన్‌గా ఇప్పటికే ఆ పెన్షనర్‌కు చెల్లిస్తున్నారు. కనుక పెన్షన్ పెంపుదల అవసరం లేదని బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు.
ప్రభుత్వం పెన్షన్ పెరుగుదల అంశాన్ని మరింత విశదీకరిస్తూ మూడో వేతన సంఘం నుంచి ఇప్పటి 7వ వేతన సంఘం దాకా పెన్షన్ పెరుగుదలపై విస్తృత చర్చ జరగాలని అన్ని వేతన సంఘాలు చెప్పాయని, కనుక ఇకపై వేతన సంఘం ఏర్పాటు తర్వాత ఆయా సిఫారసులను అమలుచేయాల్సిన తేదీ తర్వాత ఉద్యోగ విరమణ చేసిన వారికి మాత్రమే వేతన సంఘం సిఫారసులు వర్తిస్తాయని, అంతకుముందు రిటైర్ అయినవారికి కాదని పేర్కొన్నారు. ఫైనాన్స్ బిల్లుపై సంపూర్ణ అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉండటం, న్యాయ పరిధిలో చాలెంజ్‌కు నిలబడే అవకాశాలు తక్కువ ఉండటం ఈ సందర్భంగా గమనించాలి.
లోక్‌సభలో ప్రశ్న సంఖ్య 235కు సమాధానం ఇస్తూ 61 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ సివిల్ పెన్షనర్లకు, డిఫెన్స్ పెన్షనర్లకు 8వ వేతన సవరణ కమిషన్ సిఫారసులను వర్తింపజేస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం తాను ఇచ్చిన హామీకి భిన్నంగా ఈ సవరణ బిల్లును తేవడం దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు పన్నులను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి పన్నును 15 శాతానికి తగ్గించింది. దీంతో ఏడాదికి రూ.1.5 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది.
కార్పొరేట్లకు బ్యాంకుల్లో పేరుకుపోయిన బకాయిలను రూ.17 లక్షల కోట్ల వరకు మాఫీ చేసింది. కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఇన్సెంటివ్ రూపేణా రూ.2 లక్షల కోట్లు ఇచ్చింది. పెట్టుబడిదారులను సంతృప్తిపరిచేందుకు ఇంత డబ్బు వినియోగించే ప్రభుత్వాలు పెన్షనర్ల కడుపు కొట్టడానికి సిద్ధం కావడం శోచనీయం. ‘ఉన్ని బట్టలు ఇమ్మంటే ఉన్న బట్టలే పీకేసినట్లు’ నేడు మోదీ ప్రభుత్వం ఉద్యోగుల సమంజస డిమాండ్లన్నింటినీ బేఖాతరు చేస్తూ, ఓపీఎస్ పెన్షన్ దారుల హక్కులను కూడా హరించివేస్తూ ఈ చట్ట సవరణకు శ్రీకారం చుట్టింది. పెన్షన్లకు కోతలు పెట్టే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెన్షనర్లతోపాటు, అఖిల భారత స్థా యిలో ఉద్యోగులు, ఉపాధ్యాయు లు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు సంఘటితమై దేశవ్యాప్తంగా సుదీర్ఘ సమరాన్ని సాగించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
– కె.వేణుగోపాల్
9866514577
(వ్యాసకర్త: పూర్వ అధ్యక్షులు, ఏపీటీఎఫ్)