-అదానీపై అమెరికా దర్యాప్తు
-గ్రూప్‌లో భారీ వాటా ఉన్న యూఎస్ ఫండ్స్‌కు రెగ్యులేటర్ల సమన్లు
-హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత ఇన్వెస్టర్లకు అదానీ చెప్పిన అంశాలపై ఆరా
-హిండెన్‌బర్గ్ దుమారం
-7 శాతం వరకు నష్టపోయిన షేర్లు
-53 వేల కోట్ల సంపద ఆవిరి
-ఆ విషయం తమకు తెలియదంటున్న అదానీ కంపెనీ
భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్న వేళ.. ఆయనకు అత్యంత సన్నిహితుడైన పారిశ్రామిక దిగ్గజం అదానీకి అమెరికా ప్రభుత్వం షాకిచ్చింది. అవకతవకలకు సంబంధించి సమన్లు జారీ చేసిందన్న వార్త కలవరం సృష్టిస్తోంది. అయితే ఈ విషయం తమకు తెలియదని అదానీ కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశంపై విపక్షాలు పార్లమెంటును స్తంభించపచేసిన విషయం తెలిసిందే. అదానీ అవకవతలపై ప్రధాని జవాబివ్వాలని విపక్షాలు పట్టుపట్టినా, మోదీ దానిపై స్పందించలేదు. వివరాల్లోకి వెళితే..
గౌతమ్ అదానీ గ్రూప్‌నకు మరోదఫా అమెరికా సెగ తగిలింది. ఈ ఏడాది జనవరిలో యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో అతలాకుతలమైన అదానీ గ్రూప్‌పై తాజాగా అమెరికా నియంత్రణా సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. దీంతో విదేశీ ఫండ్స్ బాసటతో రెండు నెలలుగా ఊపిరి పీల్చుకుంటున్న అదానీ గ్రూప్ షేర్లు శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలాయి.
అదానీ గ్రూప్‌లో పెద్ద వాటాల్ని కొన్న అమెరికా ఫండ్స్‌కు బ్రూక్లిన్‌లోని యూఎస్ అటార్నీ ఆఫీస్ నుంచి సమన్లు వెళ్లాయని బ్లూంబర్గ్ వార్తా సంస్థ వెల్లడించింది. హిండన్‌బర్గ్ రిపోర్ట్ వెలువడిన తర్వాత కొద్ది రోజులకు విదేశీ ఫండ్స్ నుంచి అదానీ గ్రూప్ భారీ నిధుల్ని సమీకరించి, రుణ ఊబి నుంచి తాత్కాలికంగా గట్టెక్కింది.
ఈ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి అమెరికా ఇన్వెస్టర్లకు అదానీ గ్రూప్ ఏమి చెప్పిందన్న అంశాలపై ఆరా తీస్తూ అటార్నీ ఆఫీసు సమన్లు పంపిందనేది సమాచారం. ఇదే తరహా దర్యాప్తును మార్కెట్ రెగ్యులేటర్ యూఎస్ సెక్యూరిటీస్ ఎక్సేంజ్ కమిషన్ (సెక్) కూడా చేస్తున్నదని సంబంధిత వర్గాల్ని ఉటంకిస్తూ బ్లూంబర్గ్ తెలిపింది.
ఈ కథనంపై వ్యాఖ్యానించేందుకు సెక్‌తో పాటు న్యూయార్క్ యూఎస్ అటార్నీ ఆఫీస్‌లు నిరాకరించాయి. ప్రధాని నరేంద్ర మోది అమెరికాలో అధికారిక పర్యటన జరుపుతున్న సమయంలోనే అదానీపై అక్కడి రెగ్యులేటర్లు దర్యాప్తు జరుపుతున్నట్టు వార్తలు వెలువడటం గమనార్హం. మోదీకి గౌతమ్ అదానీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన సంగతి తెలిసిందే.
ఐదు నెలల క్రితం విడుదలైన హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో ఒక్కసారిగా అదానీ గ్రూప్ కుదేలైపోయింది. ప్రపంచ శ్రీమంతుల జాబితాలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న గౌతమ్ అదానీ ఏకంగా 23వ స్థానానికి దిగజారిపోయారు. అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ.5 లక్షల కోట్ల మేర కరిగిపోయింది. రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని సృష్టించింది. ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపచేశాయి.
పన్ను రహిత దేశాల్లో నెలకొల్పిన డొల్ల కంపెనీల ద్వారా అదానీ గ్రూప్‌లోకి నిధులు ప్రవహిస్తున్నాయని, పెద్ద ఎత్తున అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని, కేవలం రెండు, మూడు విదేశీ ఫండ్స్ చేతిలోనే గ్రూప్ షేర్లు కేంద్రీకృతమై ఉన్నాయని, తద్వారా కృత్రిమంగా షేరు విలువల్ని పెంచేస్తున్నారంటూ హిండెన్‌బర్గ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
తీవ్ర రుణభారంతో ఉన్న అదానీ లిస్టెడ్ కంపెనీల షేర్ల విలువ ఫండమెంటల్స్ ప్రకారం జనవరి ధరతో పోలిస్తే 85 శాతం తక్కువగా ఉండాలని విశ్లేషించింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై ఒకవైపు భారత రెగ్యులేటర్ సెబీ దర్యాప్తు ఏమీ దర్యాప్తు ఏమీ తేల్చకపోగా, మరోవైపు సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ సైతం ‘ ఈ కేసు విచారణ గమ్యం లేని ప్రయాణం’లాంటిదని వ్యాఖ్యానించింది.
ఈ నేపథ్యంలో అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ జీక్యూజీ పార్టనర్స్ అదానీ గ్రూప్ షేర్లలో భారీగా 1.87 బిలియన్ డాలర్ల (రూ.15,300 కోట్లు) నిధుల్ని కుమ్మరించింది. ఇతర విదేశీ ఇన్వెస్టర్ల నుంచి సైతం గ్రూప్ వివిధ దశల్లో పెట్టుబడుల్ని సమీకరించింది. ఈ నిధుల్ని ఎలా నమ్మించి అదానీ గ్రూప్ తీసుకొచ్చిందన్నదే యూఎస్ రెగ్యులేటర్ల అనుమానమని మార్కెట్ నిపుణులు తాజా యూఎస్ దర్యాప్తుపై వ్యాఖ్యానించారు.
యూఎస్ రెగ్యులేటర్ల దర్యాప్తు వార్త కారణంగా మొత్తం 10 అదానీ గ్రూప్ లిస్టెడ్ షేర్లలో ఒక్క అంబుజా సిమెంట్ మినహా మిగిలిన 9 కంపెనీలూ నిలువునా పతనమయ్యాయి. ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఇంట్రాడేలో 10 శాతం పడిపోయింది. ఒక్కరోజులోనే అదానీ గ్రూప్ ఇన్వెస్టర్లు రూ.55 వేల కోట్లకుపైగా సంపదను కోల్పోయారు.
మార్కెట్ పతనంలో భాగంగా కొద్ది రోజుల నుంచి అదానీ గ్రూప్ షేర్లు తగ్గుతూ వస్తున్నాయి. ఈ వారంలో గ్రూప్ రూ.73,500 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది. దీంతో ఈ కంపెనీల మొత్తం విలువ రూ.10 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది.
తమ ఇన్వెస్టర్లకు అమెరికా రెగ్యులేటర్లు సమన్లు జారీచేసిన విషయం తమకు తెలియదని అదానీ గ్రూప్ ప్రతినిధి ఒకరు శుక్రవారం తెలిపారు. పెట్టుబడులు చేసిన వివిధ ఇన్వెస్టర్లకు తాము అందించిన పూర్తి సమాచారాన్ని వారు విశ్వసించారని చెప్పారు.