Suryaa.co.in

Editorial

ఒక ఎన్నిక.. సంకేతాలెన్నో!

– మునుగోడులో నిజమైన గెలుపెవరిది?
– ఉప ఎన్నిక అసలు విజేత ఎవరు?
– టీఆర్‌ఎస్ సర్కారు పనితీరుకు సరైన ఫలితం వచ్చిందా?
– కారు పెద్దల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందా?
-సంక్షేమ పథకాలు, మంత్రుల ప్రచారం కారును గట్టెక్కించాయా?
– కామ్రేడ్స్ మద్దతు లేకపోతే ‘కారు’ పరిస్థితి ఏమిటి?
– ఈ గెలుపు టీఆర్‌ఎస్ విధానాలకు మలుపు అవుతుందా?
– కేసీఆర్ ఇన్చార్జిగా ఉన్న గ్రామంలో టీఆర్‌ఎస్ మెజారిటీ 254 ఓట్లే
– మునుగోడులో కిషన్‌రెడ్డి, సంజయ్ పలుకుబడి పనిచేయలేదా?
– రేవంత్‌రెడ్డి సారథ్యానికి ఇదో సవాలవుతుందా?
– పోటీలో నిలిచింది కోమటిరెడ్డా? బీజేపీనా?
– టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొంది బీజేపీనా? కోమటిరెడ్డా?
– భావోద్వేగం నుంచి బీజేపీ ఇకనయినా బయటకు వస్తుందా?
– మునుగోడు ఓటమితో కమలం కళ్లు తెరుస్తుందా?
– కాంగ్రెస్‌కు మునుగోడు నేర్పిన గుణపాఠమేమిటి?
– జనం పల్సు కాంగ్రెస్ ఇకనయినా పట్టుకుంటుందా?
– టీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయమవుతుందా?
– బీజేపీ-కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం ఎవరు?
( మార్తి సుబ్రహ్మణ్యం)

మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాలకు అనేక సంకేతాలు పంపింది. సాంకేతికంగా టీఆర్‌ఎస్‌దే విజయం అయినప్పటికీ, రాజకీయంగా గెలిచిందెవరు? ఓడిందెవరు? ఈ ఫలితం ఎవరి అహంకారానికి, ఎవరి ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించాయి? మునుగోడు మొనగాడవుతాననుకున్న బీజేపీ, తాను అనుకున్న లక్ష్యం సాధించిందా? అసలు ఈ ఉప ఎన్నికలో పోటీ ఇచ్చింది పార్టీపరంగా బీజేపీనా? వ్యక్తిగతంగా కోమటిరెడ్డి రాజగోపాలా? బంగారు తెలంగాణ చేశామన్న టీఆర్‌ఎస్ పడిన కష్టానికి, ఉప ఎన్నికmunugodu ఫలితం తగిన ప్రతిఫలం దక్కిందా? ఒకప్పుడు సూది-దబ్బనం పార్టీలని కేసీఆర్ విమర్శించిన, అదే కమ్యూనిస్టుల కష్టం లేకపోతే కారు పరిగెత్తగలిగేదా? మంత్రులు మొత్తం మోహరించినా, అన్ని శక్తులూ రంగరించినా కారు స్పీడు పదివేల కిలోమీటర్లు దాటకపోవడానికి కారణమేమిటి? అసలు ఈ ఎన్నిక ఫలితం టీఆర్‌ఎస్ విధానాలకు మలుపు అవుతుందా? డబ్బు పంపిణీలో టీఆర్‌ఎస్-బీజేపీతో ఢీకొనకపోయినా, 20 వేలకు పైగా ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈ ఫలితంతో తెలుసుకున్న గుణపాఠమేమిటి? ప్రజల పల్సు పట్టడం ఎలాగో ఇకనయినా నేర్చుకుంటుందా? తాజా ఫలితం నేపధ్యంలో టీఆర్‌ఎస్‌కు అసలైన ప్రత్యామ్నాయం ఎవరు? సార్వత్రిక ఎన్నికలు ఈ సమరబాటలో సాగుతాయా? లేక మునుగోడుకే పరిమితమా? అసలు ఎన్నికల్లో నైతిక విజయం ఎవరిది? పార్టీలకు ప్రజలు నేర్పిన గుణపాఠమేమిటి? ఓసారి చూద్దాం రండి.

హోరా హోరీగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి 97,006 ఓట్లు, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి 86,697, కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతికి 23,906 ఓట్లు, బీఎస్పీ అభ్యర్ధికి 2886 ఓట్లు, ఇతరులకు 10,039 ఓట్లు పోలయ్యాయి. టీఆర్‌ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డిపై 10,297 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇదీ మునుగోడు ఉప ఎన్నిక ఫలితం.

అయితే ఈ ఉప ఎన్నికలో సాంకేతికంగా టీఆర్‌ఎస్ విజయం సాధించినా, నైతికంగా గెలిచిందెవరు? రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం ఎవరు? టీఆర్‌ఎస్ పడిన కష్టానికి తగిన ఫలితం వచ్చిందా? బీజేపీ ఇచ్చిన పోటీ ఆ పార్టీ సంస్థాగతమా? కోమటిరెడ్డి వ్యక్తిగతమా? బీజేపీ భవిష్యత్తులో కూడా ఇదే పోరాటపటిమ ప్రదర్శిస్తుందా? కాంగ్రెస్ 23 వేలు సాధించకపోతే, టీఆర్‌ఎస్ పరిస్థితి ఎలా ఉండేది? భవిష్యత్తులో టీఆర్‌ఎస్‌కు సవాల్ విసిరేదెవరన్న ప్రశ్నలు ఆసక్తికలిగించేవే.

టీఆర్‌ఎస్‌కు.. మునుగోడులో దక్కిన ఫలితం, చావుతప్పి కన్నులొట్టపోయిన చందమేనని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి రాష్ట్రం మొత్తం మీద రైతుబంధు లబ్ధిదారులున్న ఏకైక నియోజకవర్గం, మునుగోడు మాత్రమేనని ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు. ఇక నియోజకవర్గంలో పెన్షన్లు అందుకుంటున్న నిజానికి అన్ని వర్గాలకు, కులాలకు సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న వాళ్లంతా ఓటేసినా, అవలీలగా గెలుస్తామన్నది ఆ పార్టీ నేతల ధీమా.

TRS-CAR-displayకారు గుర్తు తమకు ఓటుకు 5 వేలు చొప్పున ఇచ్చినట్లు, ఓటర్లు యూట్యూబ్ చానెళ్లకు ‘సిగ్గుపడకుండా’ చెప్పారు. మంత్రులను గ్రామాలకు ఇన్చార్జులుగా నియమించారు. ఎమ్మెల్యేలంతా మునుగోడులోనే మోహరించారు. నెలరోజుల ముందే ఓటర్లను సంతృప్తి పరచడంలో, టీఆర్‌ఎస్ బిజీ అయింది. హైదరాబాద్‌లో ఉండే మునుగోడు ఓటర్లను వాహనాల్లో తరలించింది.

ఇక మందు, విందులకయితే లెక్కే లేదు. వీటికి మించి.. నియోజకవర్గంలో 25 వేల ఓటు బ్యాంక్ ఉన్న, కమ్యూనిస్టుల మద్దతు కూడా టీఆర్‌ఎస్‌కే దక్కింది. డబ్బు పంచలేదన్న అసంతృప్తితో ఉన్న, కాంగ్రెస్ కిందిస్థాయి కార్యకర్తలను కూడా టీఆర్‌ఎస్ మేనేజ్ చేసింది. ఎన్నిక ముందు బీజేపీ-కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను గంపగుత్తగా పార్టీలో చేర్చుకుంది.

అయినా వచ్చిన మెజారిటీ కేవలం 10 వేలు మాత్రమే కావడం చూస్తే, టీఆర్‌ఎస్ ఆ స్ధాయిలో సరైన ఫలితం రాబట్టలేదని స్పష్టమవుతోంది. ఒకరకంగా కాంగ్రెస్ అభ్యర్ధికి 23 వేల ఓట్లు రావడం కూడా, తమను గట్టెక్కించిందన్నది స్థానిక టీఆర్‌ఎస్ నేతల విశ్లేషణ. ఒకవేళ కాంగ్రెస్‌కు 10 వేల లోపు ఓట్లు వచ్చి ఉంటే, ఫలితం విషాదంగా ఉండేదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రధానంగా మంత్రులు- ఎమ్మెల్యేలను మోహరించినా, ఆ స్థాయిలో ఓట్లు సాధించలేకపోవడం టీఆర్‌ఎస్‌ను నిరాశకు గురిచేసేదే. స్వయంగా సీఎం కేసీఆర్ ఇన్చార్జిగా ఉన్న లెంకలపల్లిలో, టీఆర్‌ఎస్ వచ్చిన మెజారిటీ కేవలం 254 ఓట్లు మాత్రమే. మంత్రి కేటీఆర్ ఇన్చార్జిగా ఉన్న గట్టుప్పల్ మండలంలో, కేవలం 65 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. హరీష్ ఇన్చార్జిగా ఉన్న మర్రిగూడ మండలంలో టీఆర్‌ఎస్, కేవలం 613 ఓట్లు మాత్రమే బీజేపీ కంటే ఎక్కువ వచ్చాయి.

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇన్చార్జిగా ఉన్న పలివెలలో బీజేపీకి 400 ఓట్లు ఆధిక్యం వచ్చింది. మంత్రి మల్లారెడ్డి, శ్రీనివాసగౌడ్ ఇన్చార్జులుగా ఉన్న గ్రామాల్లోనూ బీజేపీకే ఎక్కువ మెజారిటీ వచ్చింది. అంటే వీరంతా మునుగోడు ఓటర్లను పెద్దగా సంతృప్తి పరచలేకపోయినట్లు స్పష్టమవుతూనే ఉంది.

తాజా ఫలితం.. భవిష్యత్తులో తనకు ఎవరు ప్రత్యామ్నాయమన్న అంశాన్ని, టీఆర్‌ఎస్ తేల్చుకోవలసి ఉంది. కాంగ్రెస్‌ను పూర్తి స్థాయిలో హత్య చేసి, బీజేపీని ప్రమోట్ చేసే వ్యూహం ఇప్పటికే బెడిసికొట్టిన ఫలితంగా, ఆ పార్టీ ఏకు మేకయి కూర్చుంది. బీజేపీని పరోక్షంగా ప్రోత్సహించిన వైనమే ఈ పరిస్థితి, పరిణామాలకు కారణమన్నది టీఆర్‌ఎస్ వర్గాల విశ్లేషణ. ఎన్ని పథకాలు అమలుచేసినా, డబ్బు పారించినా, మంత్రులను మోహరించినా కేవలం 10 వేల మెజారిటీనే దక్కిన నేపథ్యంలో.. తమ పార్టీ విధానం మార్చుకోవడం అనివార్యమని ఆ పార్టీ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. ఇక ప్రచార సమయంలో తెరపైకి తెచ్చిన ఫాంహౌస్ ఎమ్మెల్యేల ఎపిసోడ్ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదన్నది పార్టీ వర్గాల విశ్లేషణ.

ఇక టీఆర్‌ఎస్‌ను ప్రతి రౌండ్‌లోనూ ప్రతిఘటించిన , బీజేపీ పోరాటాన్ని తక్కువచేసి చూడలేం. ఆ పార్టీ పరాజయం పాలయినప్పటికీ, తెరాసకు చెమటలు పట్టించింది. నాలుగయిదు రౌండ్ల తర్వాత మాత్రమే తెరాసకు విజయంపై విశ్వాసం ఏర్పడింది. కాకపోతే ఈ పోరాటం బీజేపీ సంస్ధాగతంగా సాధించిందా? లేక అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రెక్కల కష్టమా? అన్నదే ఇప్పుడు బీజేపీ నాయకత్వం ముందున్న ప్రశ్న. నిజానికి కోమటిరెడ్డి అభ్యర్ధి కాకపోయి ఉంటే, అక్కడ ఆ పార్టీకి ధరావతు కూడా దక్కేదికాదన్నది మనం మనుషులం అన్నంత నిజం.

ఎందుకంటే జాతీయ పార్టీ అయిన బీజేపీ అభ్యర్థిగా, కోమటిరెడ్డికి ఇప్పటికంటే ఎక్కువ ఓట్లు వచ్చి తీరాలి. ఆయన సొంత ఇమేజ్-పార్టీ ఇమేజ్ కలిస్తే టీఆర్‌ఎస్ ఓడిపోయి ఉండాలి. కానీ ఇక్కడ రెండూ జరగలేదు.komatireddy-rajgopal-reddy కేవలం కోమటిరెడ్డి ఇమేజ్ మాత్రమే పనిచేసింది. గత ఎన్నికల్లో బీజేపీకి 20వేల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ ఓట్లు కలిస్తే, రాజగోపాల్ 10వేల ఓట్లతో గెలిచేవారు. అంటే దీన్నిబట్టి, మునుగోడులో బీజేపీకి సొంత సీన్ లేదన్నది అర్ధమవుతూనే ఉంది.

ఫాంహౌస్ ఎపిసోడ్‌పై రాద్ధాంతం చేసినప్పటికీ, కమలం కష్టం ఫలించలేదు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర-జాతీయ నేతల పలుకుబడి ఏమీ, మునుగోడులో పనిచేయలేదని ఫలితం స్పష్టం చేసింది. వీరితో పోలిస్తే.. ఈటల రాజేందర్ తన అత్త గారి గ్రామం పలివెలలో, టీఆర్‌ఎస్ కంటే 400 ఓట్ల మెజారిటీ సాధించారు. రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ఎన్నిక ముందు యాదాద్రికి వెళ్లి తడిబట్టలతో చేసిన ప్రమాణం.. కేసీఆర్ సర్కారుపై ఆరోపణలేవీ, మునుగోడు ప్రజలు నమ్మలేదని ఫలితం స్పష్టం చేసింది.

కిందిస్థాయిలో పార్టీ బలం పెంచుకోకుండా.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయి పోరాటాలు చేయకుండా… కేవలం మీడియాను ఆకర్షించేందుకు చేసే ఎత్తుగడలేవీ, దీర్ఘకాలంలో పనిచేయవన్న వాస్తవాన్ని ఉప ఎన్నిక ఫలితం, బీజేపీ నాయకత్వానికి స్పష్టం చేసినట్లయింది.

టీఆర్‌ఎస్ ఒక్కో ఓటుకు 5 వేలు ఇచ్చినట్లే.. తమకు బీజేపీ కూడా 3 వేలు ఇచ్చినట్లు, ఓటర్లు యూట్యూబ్ చానెళ్లకు వెల్లడించారు. బీజేపీకి సంబంధించిన నేతల నుంచి, దాదాపు 27 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయన్న వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో, నీతి-నిజాయితీ-నైతిక విలువల వంటి పదాలు-గుళ్లలో తడిబట్టతో ప్రమాణాలు.. ప్రత్యర్ధులపై అవినీతి ఆరోపణలు చేసినా, అవి మీడియా ప్రచారానికి తప్ప, ప్రజలు నమ్మర న్న నిజాన్ని ఉప ఎన్నిక ఫలితం చాటింది. పోరు-పోల్ మేనేజ్‌మెంట్ తప్ప..మిగిలిన అంశాలు గెలిపించలేవన్న నిజాన్ని, ఉప ఎన్నిక ఫలితం బీజేపీకి స్పష్టం చేసింది.

అయితే, భవిష్యత్తులో.. బీజేపీనే టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అని చెప్పలేని పరిస్థితి. గతంలో ఈటల మాదిరిగానే, ఇప్పుడు కోమటిరెడ్డి వ్యక్తిగత పోరాటమని స్పష్టమయింది. వివాదాలు- భావోద్వేగాలపై ఆధారపడితే, ఫలితం ఇలాగే ఉంటుందన్న నిజాన్ని తమ పార్టీ ఇప్పటికయినా గ్రహించాలని, ఓ బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ ఓ దశలో.. రెండో స్థానంలో చేరిందన్న ప్రచారమే తప్ప, దానికి సంబంధించిన కసరత్తు జరిగినట్లు లేదు. స్రవంతిని అభ్యర్ధిగా నిలబెట్టాలని.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో కొట్లాడిన నల్లగొండpalvai కాంగ్రెస్ పెద్దతలలు, తీరా ఆమెకు టికెట్ ఇచ్చిన తర్వాత పత్తాలేకుండా పోయారు. టీఆర్‌ఎస్-బీజేపీ అభ్యర్ధుల ఆర్ధికబలం తెలిసి కూడా, ఆ స్థాయిలో వారిని ఎదుర్కోలేని స్రవంతిని, తెరపైకి తీసుకురావడమే తప్పన్నది కాంగ్రెస్ నేతల వ్యాఖ్య. జిల్లాలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితోపాటు సీనియర్లకు జనంలో పలుకుబడి లేదని ఈ ఫలితం తేల్చింది. తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి కోసం అన్నయ్య వెంకటరెడ్డి చేసిన ‘తెరచాటు సేవ’ కూడా కాంగ్రెస్ ఓట్లకు కొంత గండి కొట్టింది. ఉప ఎన్నిక ప్రచార సమయంలో, జోడోయాత్రలో ఉన్న రాహుల్‌కు.. ‘ఇది తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన బహుమతి’ అంటూ, మరికొందరు సీనియర్లు ఎద్దేవా చేస్తున్నారు.

రేవంత్ నాయకత్వానికి ఈ ఫలితం మరో సవాల్. కాంగ్రెస్ సిట్టింగు సీటును, మళ్లీ గెలిపించలేకపోయారన్న విమర్శలు ఆయనపై మొదలవడం ఖాయం. రేవంత్ రాజీనామాను, ఫలితంతో ముడిపెట్టినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.

తాజా ఫలితం భవిష్యత్తులో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని స్పష్టం చేసింది. కేంద్రం-రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న.. బీజేపీ-టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలంటే, ఎలాంటి వనరులు అవసరమన్న అంశాన్ని మునుగోడు ఫలితం కాంగ్రెస్‌కు నేర్పింది.

LEAVE A RESPONSE