Suryaa.co.in

Telangana

వ్యవసాయ యాంత్రీకరణ పథక పునరుద్ధరణకు కసరత్తు

– జిల్లా స్థాయిలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శనలకు ఆదేశాలు
– ఆయా ప్రాంతాలలో ఉన్న డిమాండ్ బట్టి ఎంపిక చేసిన పనిముట్లు/యంత్రాల సరఫరా

హైదరాబాద్: త్వరలో వ్యవసాయ యాంత్రికరణ పథకాన్ని పునరుద్దరించడానికి కావాల్సిన నిధులు, పథక అమలు తీరుతెన్నులపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.. వ్యవసాయ కార్యదర్శి రఘునందన రావు తో, వ్యవసాయ డైరెక్టర్ గోపి తో మరియు సహకార సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

వ్యవసాయ మంత్రి ఆదేశాలతో ఈ యాసంగి నుండి రైతులకు అవసరమైన పనిముట్లను, యంత్రాలను, సబ్సిడీపై సరఫరా చేయడానికి, ప్రణాళిక సిద్దంచేసామని అందులో భాగంగా జిల్లాల వారీ ఎక్కువ డిమాండ్ ఉన్న పనిముట్లను, యంత్ర పరికరాల జాబితా సిద్దం చేసినట్లు డైరెక్టర్, వ్యవసాయశాఖ గోపి తెలిపారు.

మంత్రి ఆదేశాల మేరకు త్వరలోనే జిల్లాల వారీగా యంత్ర పరికరాలు మరియు పనిముట్లు తయారీ దారుల సంస్థల సహకారంతో మార్కెట్లలో కొత్తగా వచ్చిన పరికరాలపై రైతులలో అవగాహన పెంపొందించే విధంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా యంత్రాంగం ప్రదర్శనకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నామని చెప్పారు.

ప్రస్తుతం వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రోటవేటర్స్, ఎమ్.బి నాగళ్ళు, కల్టివేటర్స్, తైవాన్ స్ట్రేయర్లు, బేలర్స్, పవర్ వీడర్స్, మొక్కజొన్న వొలుచు యంత్రాలు, ట్రాక్టర్లు, కిసాన్ డ్రోన్లు మున్నగువాటిని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.

దానికి మంత్రి తుమ్మల స్పందిస్తూ.. గత 5 సంవత్సరాల నుండి, వ్యవసాయ యాంత్రికరణ పథకానికి, కేంద్ర ప్రభుత్వము తమ వాటా నిధులు విడుదల చేస్తున్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా నిధులు విడుదల చేయకపోవడంతో, కేంద్రం తమ వాటా నిధులను విడుదల చేయడం ఆపి, గతంలో ఇచ్చిన నిధులను కూడా తిరిగి తీసుకోవడం ద్వారా రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందనీ తెలిపారు.

గత 5 సంవత్సరాల నుంచి రైతులకు దీనికి సంబంధించి ఎటువంటి అవగాహన లేనందున, ఎగ్జిబిషన్లను ప్రభావవంతంగా నిర్వహించాలని, ఎగ్జిబిషన్ ఏర్పాటుకు కావాల్సిన నిధులు కూడా సమకూర్చుకోవాలని, అలాగే సంబంధిత మంత్రి, స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి రైతులందరికీ సౌకర్యంగా ఉండేలా జిల్లా స్థాయిలో స్థలాన్ని ఎంపిక చేసుకోవాల్సిందిగా సూచించారు.

వ్యవసాయ శాఖ తయారు చేసిన ప్రతిపాదనలను పరిశీలించి, ఇది ఆరంభం మాత్రమేనని, వ్యవసాయయాంత్రీకరణ నిరంతర కార్యక్రమము అని, అందుకని ఎక్కడా, ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా పటిష్టంగా నిబంధనలు రూపొందించి, రైతులకు ఈ సీజన్ లోనే యంత్రాలను, పనిముట్లను అందచేయాలని, జిల్లా స్థాయి ఎగ్జిబిషన్ లను కూడా వెంటనే ఏర్పాటుచేయాలని, వ్యవసాయ మరియు అనుబంధ రంగాల వారందరినీ ఈ ఎగ్జిబిషన్ లో భాగస్వామ్యం చేయాలని కోరారు.

ఎగ్జిబిషన్ సమాచారం అన్ని ప్రసారమాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి, రైతులను పెద్దఎత్తున పాల్గొనేటట్లు చేయాల్సిందిగా సూచించారు.

సోయాబిన్ సేకరణలో దేశంలో మొట్టమొదటి స్థానంలో తెలంగాణ:
డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్పేర్ జాయింట్ సెక్రటరీ సోయాబీన్ ఉత్పత్తి చేసే రాష్ట్రాలయిన కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల వ్యవసాయ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో, ఇప్పటిదాకా జరిగిన సోయాబిన్ సేకరణ గురించి సమీక్షించారు.

ఈ సందర్భంగా శ్యామ్యూల్ మాట్లాడుతూ, ఇప్పటిదాకా రైతుల వద్ద నుంచి మద్ధతు ధరకు సోయాను సేకరించిన రాష్ట్రాలలో తెలంగాణ అగ్రగామిగా ఉన్నదని, సేకరణలో సాంప్రదాయ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలను కూడా అధిగమించిందని తెలియజేస్తూ, తెలంగాణ ప్రభుత్వ కృషిని అభినందించారు.

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 47 సెంటర్ల ద్వారా సోయా సేకరణ జరుగుతుందని, రూ. 4892 మద్ధతు ధర చెల్లిస్తూ, ఇప్పటికి 118.64 కోట్ల విలువగల 24,252 మెట్రిక్ టన్నుల సోయా చిక్కుడును, 1464 మంది రైతుల నుండి సేకరించినట్లు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు గౌరవ మంత్రిగారి ఆదేశాలతో గతంలో ఉన్న ఎకరా పరిమితి 6.5 క్వింటాళ్ళ నుండి 10 క్వింటాళ్ళకు పెంచడం జరిగిందని, మన రాష్ట్రం నుండి సమీక్షలో పాల్గొన్న మార్క్ ఫెడ్ అధికారులు తెలిపారు.

LEAVE A RESPONSE