తాళిబొట్లు తెంచే కల్తీ మద్యాన్ని ప్రోత్సహిస్తూ.. గీత కార్మికులను అణచివేస్తారా?

– తాటిచెట్టుకి, ఈతచెట్టుకి తేడా తెలియనివాళ్లు పాలసీని రూపొందించినట్లున్నారు
– కల్లుగీత పాలసీని వెంటనే రద్దు చేయాలి
– వీధికో మద్యం దుకాణం పెడుతూ కల్లు దుకాణాన్ని వంద కిలోమీటర్లకు పరిమితం చేస్తారా?
– శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్

నూతన కల్లుగీత పాలసీతో గీత కార్మికులకు ఒరిగేది శూన్యం. మద్యం అమ్మకాలను పెంపొందించుకునేందుకు కల్లుగీత కార్మికుల ప్రయోజనాలను మంటగలిపారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ ప్రజల ఆరోగ్యానికి తోడ్పడే కల్లు అమ్మకాలను నియంత్రించేలా పాలసీ 22-27 ఉంది. 2 లక్షల మందికి పైగా కల్లుగీత కార్మికులు వృత్తిపై ఉంటే 95వేల మంది మాత్రమే ఉన్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

నిబంధనలకు విరుద్దంగా కల్లు గీశారంటూ కోవిడ్ సమయంలో పెట్టిన కేసులు కూడా ఎత్తివేయలేదు. 4 వేలకు పైగా ఉన్న కల్లు దుకాణాలను తగ్గించేందుకు కుట్ర చేయడం దుర్మార్గం. కల్లు కుండపై చేయేస్తే గీత కార్మికుల ఆగ్రహానికి గురవడం ఖాయం. కల్తీ మద్యం అమ్మే ప్రభుత్వంపై కల్లుపై ఆంక్షలు విధిస్తుందా? నీరా పరిశ్రమ ఏర్పాటు డిమాండ్ పై కూడా పాలసీలో పెట్టలేదు. గీత కార్మికులకన్నా మద్యం అమ్మకాలే ఈ ప్రభుత్వానికి ముఖ్యమన్న విషయం పాలసీతో స్పష్టమైంది.

గీత కార్మికులను వృత్తి నుండి దూరంచేసేలా పాలసీ ఉంది. కల్లుగీత సంఘాలు కార్మికులతో చర్చించకుండా పాలసీని ఏకపక్షంగా ఏవిధంగా ప్రకటిస్తారు? పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలే దుకాణాలు ఏర్పాటు చేసి గీత కార్మికులను ప్రోత్సహిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా గీత కార్మికులపై కక్ష సాధిస్తోంది. వంద కిలోమీటర్ల పరిధిలో ఒక షాపు ఉండాలనే నిబంధన ఏవిధంగా పెడతారు? వీధికో మద్యం దుకాణానికి అనుమతిస్తూ కల్లు దుకాణాలకు మాత్రం నిబంధనలు విధిస్తారా?తెలంగాణలో 15 శాతం మద్యం దుకాణాలను కల్లుగీత కార్మికులకు అప్పగించారు.

రాష్ట్రంలో మాత్రం అందుకు విరుద్ధంగా గీత కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు. ‘గీసేవానికే చెట్టు’ అనే పథకం టీడీపీ ప్రవేశపెడితే ‘దోచుకోవడానికే పాలసీ’ అనే విధంగా జగన్ ప్రభుత్వం మారింది. ప్రమాదవశాత్తు చనిపోయిన గీత కార్మికులకు రూ.10 లక్షలు పరిహారం ఇస్తామనడం హాస్యాస్పదం. బీమా పథకాన్ని గీత కార్మికులకు టీడీపీ ఎప్పటినుంచో అమలు చేస్తూ వచ్చింది. మూడున్నరేళ్లలో 47 మంది గీత కార్మికులు మరణిస్తే ప్రభుత్వం 10శాతం మందికి కూడా సాయం చేయని విషయం నిజంకాదా? ఈత, తాటి చెట్లను సమృద్ధిగా పెంచడానికి చర్యలు తీసుకుంటామని గొప్పగా పాలసీలో చెప్పారు, మూడున్నరేళ్లలో వేలాది చెట్లను మీరు నరికేశారు. బలహానవర్గాలపై కక్షసాధించేలా పాలసీ ఉంది. ఈ పాలసీని వెంటనే రద్దు చేసి గీత కార్మికులకు ప్రయోజనం కలిగేలా నూతన పాలసీని ప్రకటించాలి.

Leave a Reply