Suryaa.co.in

Andhra Pradesh

రెవెన్యూ మంత్రి ఆధ్వర్యంలో అరాచకాలు

– తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో కూటమి అరాచకం
– వైయస్సార్‌సీపీ కార్పొరేటర్లకు బెదిరింపులు. వారిపై దాడి
– మెజారిటీ లేకున్నా డిప్యూటీ మేయర్‌ పీఠంపై టీడీపీ కన్ను
– అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్న అధికారి
– పోలీసుల సమక్షంలోనే కార్పొరేటర్లపై దాడులు
– బస్సును ధ్వంసం చేసి తీసుకెళ్తుంటే చోద్యం చూశారు
– హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌
– వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతి: డిప్యూటీ మేయర్‌ ఉప ఎన్నికల్లో కూటమికి మెజారిటీ లేని కారణంగా, వారు గైర్హాజర్‌ వ్యూహంతో ఎన్నిక వాయిదా పడేలా చేశారని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. కార్పొరేషన్‌లో ఒక పదవి కోసం సీఎం చంద్రబాబు, ఇంత నీచంగా వ్యవహరించాలా? అని ఆయన నిలదీశారు. అధికార పార్టీ ఎన్ని అరాచకాలకు, ప్రలోభాలకు గురి చేసినా తమ కార్పొరేటర్లు 23 మంది ధైర్యంగా నిలబడ్డారని చెప్పారు. తిరుపతి మేయర్‌ శిరీష, ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లతో కలిసి భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల అధికారిగా ఉన్న జాయింట్‌ కలెక్టర్‌ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ప్రెస్‌మీట్‌లో ఆధారాలతో సహా భూమన చూపారు. అనైతిక ఎన్నికల ప్రక్రియపై హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నిక తేదీ ప్రకటించిన తర్వాత జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ నేతృత్వంలో గత ఐదు రోజులుగా తిరుపతిలో టీడీపీ రాజకీయ వికృత క్రీడ మొదలైంది.మా పార్టీ డిప్యూటీ మేయర్‌ అభ్యర్థి శేఖర్‌రెడ్డి ఆస్తుల ధ్వంసంతో మొదలుపెట్టి.. మా పార్టీ కార్పొరేటర్లు అమర్నాథ్‌రెడ్డి, ఉమ, అజయ్‌కుమార్‌కు చెందిన ఆస్తులు ధ్వంసానికి పాల్పడ్డారు. ఇంకా డిప్యూటీ మేయర్‌ అభ్యర్థిని బెదిరించి లొంగ దీసుకున్నారు.

రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ రాజకీయ అరాచక శక్తి అని టీడీపీ అనుకూల మీడియాలోనే పెద్ద ఎత్తున కథనాలు ప్రచురితం అయ్యాయి. అలాంటి అనగాని సత్యప్రసాద్‌ను వెనకేసుకొచ్చేలా తిరుపతి ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. ఎన్నికలకో పార్టీ మారే నిబద్ధత లేని వ్యక్తి కాబట్టే ఈయనకు ఎన్నికల గొప్పతనం తెలియదు.

టీడీపీకి అనుకూలంగా ఓటేసినా, లేదా ఎన్నికలకు గైర్హాజర్‌ అయినా ఒక్కో కార్పొరేటర్‌కు రూ.50 లక్షలు ఇస్తామని ప్రలోభపెడుతున్నారు. వారి ప్రలోభాలకు లొంగని కార్పొరేటర్ల ఆస్తులు ధ్వంసం చేస్తామని బెదిరిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు చిత్తూరులోని ఒక రిసార్టులో ఉంటే ఆదివారం అర్ధరాత్రి తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కుమారుడు మదన్‌ ఆధ్వర్యంలో, కొంతమంది రౌడీల గుంపు ప్రతి రూమ్‌కి వెళ్లి మహిళలు అని కూడా చూడకుండా అమానవీయంగా, అవమానకరంగా ప్రవర్తించారు.

ఇక ఈరోజు (సోమవారం) మా పార్టీ ఎంపీ గురుమూర్తి, మేయర్‌ శిరీష ఆధ్వర్యంలో మా పార్టీ కార్పొరేటర్లు ఎన్నికల్లో పాల్గొనేందుకు బస్సులో వెళ్తుండగా మార్గమధ్యంలోనే టీడీపీ గూండాలు బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. అన్నా రామచంద్రుడు అనే రౌడీ నాయకత్వంలో అతని అనుచరుడు శంకర్‌ మరి కొందరు రౌడీలతో వచ్చి దాడి చేశారు. వెంకటేష్‌ తోపాటు మరో నలుగురు కార్పొరేటర్లను కొట్టి బలవంతంగా లాక్కుని వెళ్లారు.

.. (అంటూ బస్సు అద్దాలు ధ్వంసం చేస్తున్న టీడీపీ నాయకుడు శంకర్‌ యాదవ్‌ ఫొటోలు చూపారు). రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా ఉన్న జాయింట్‌ కలెక్టర్‌ ఎన్నికల హాల్లోకి టీడీపీ నాయకుడు నరసింహయాదవ్‌ను పంపారు.. (అంటూ ఆ ఫోటోలు కూడా భూమన చూపారు).

దీనిపై తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్‌రాజుకు ఫోన్‌ చేసి చెబితే ఆయనకు ఎన్నికల కమిషనే అనుమతిచ్చింది చెప్పడం చూస్తుంటే.. ఎన్నికల నిర్వహణ ఎంత లోపభూయిష్టంగా జరిగిందో తెలుస్తోంది. ఎన్నికల అధికారిగా ఉన్న శుభం బన్సల్‌కి నిబంధనలు తెలియవా? కావాలనే టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఎస్పీ వివరణను బట్టే తెలుస్తోంది.

మా పార్టీకి చెందిన 45వ వార్డు కార్పొరేటర్‌ అనీశ్, 50వ వార్డు కార్పొరేటర్‌ బోకం అనిల్, 16వ వార్డు కార్పొరేటర్‌ మోహన్‌కృష్ణ యాదవ్, 5వ వార్డు కార్పొరేటర్‌ అమర్నాథ్‌రెడ్డిని టీడీపీ గుండాలు అపహరించారు. వారు ఎక్కడున్నారో కుటుంబ సభ్యులకు కూడా తెలియని పరిస్థితి. ఎన్నికల కమిషన్‌ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలి.

దాదాపు 200 మంది పోలీసుల సమక్షంలో పోలీసులందరూ చూస్తుండగానే మా కార్పొరేటర్లను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. మా కార్పొరేటర్లను దారుణంగా కొట్టి లాక్కెళుతున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేస్తే, సామాన్య విషయం అయినట్టు ఆయన చాలా సావధానంగా చూస్తానని బదులిచ్చారు. కిడ్నాప్‌నకు గురైన నలుగురు కార్పొరేటర్లను వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత జిల్లా ఎస్పీపైనే ఉంది.

ఆఖరుకి టీడీపీకి మెజారిటీ లేక ఈరోజు ఎన్నిక వాయిదా పడింది. తిరుపతి పవిత్రత గురించి మాట్లాడే పవన్‌ కళ్యాణ్‌.. జనసేన ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కుమారుడు మదన్‌ దౌర్జన్యాలు, గుండాగిరీ గురించి పట్టించుకోరా?. అన్నా రామచంద్రయ్య అనే టీడీపీ నాయకుడు మా పార్టీ కార్పొరేటర్‌ రాజమ్మ ఇంటికి వెళ్లి అక్కడే ఉన్న మేయర్‌ శిరీషను అసభ్యంగా మాట్లాడటమే కాకుండా సీసీ నచికేతన్‌ అనే వ్యక్తిపై తీవ్రంగా దాడి చేశాడు. అయినా పవన్‌కళ్యాణ్‌ ఏ మాత్రం స్పందించడం లేదు. ఇది అత్యంత హేయం.

హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌
కార్పొరేటర్ల ఆచూకీపై హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ మూవ్‌ చేయడం జరిగింది. అలాగే ఈ ఎన్నికలను పూర్తిగా వాయిదా వేయాలని డిమాండ్‌ చేçస్తున్నామని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు.

LEAVE A RESPONSE