ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా అప్పుచేసైనా ప్రజాకర్షక పధకాలు అమలుచేసి అభివృద్ధిని, ప్రజాస్వామ్య పాలనను పూర్తిగా విస్మరిస్తే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ఆర్ధిక పరిస్థితి తెలియచేస్తోంది.
కాగ్, ఆర్బీఐతో పాటు వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా రాష్ట్రాల ఆర్ధిక స్థితి గతులను విశ్లేషించి ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక ఆరోగ్యం 2022-23 ఆర్ధిక సంవత్సరంలో దేశంలోని 18 పెద్ద రాష్ట్రాలలో 17వ స్థానంలో నిలచింది.
అప్పులతో పాటు వడ్డీ చెల్లింపులు పెరగడం రాష్ట్రానికి ప్రధాన ఆర్ధిక సమస్యగా మారిందని, 2022-23 లో చేసిన అప్పుల్లో 4.4 శాతం మాత్రమే మూలధన వ్యయానికి ఖర్చు చేశారని, మొత్తం వ్యయంలో రాష్ట్ర మూలధన వ్యయం 3.5 శాతానికే పరిమితం అయ్యిందని, ప్రభుత్వ అప్పులు 2018-19 నుంచి 2022-23 మధ్యన సగటున 16.5 శాతం మేర వృద్ధి చెందాయని, అదే సమయంలో వడ్డీ చెల్లింపులు ఏటా సగటున (సిఎజిఆర్) 10 శాతం మేర పెరిగాయని ఈ నివేదిక స్పష్టం చేసింది.
ఏపీలో 55.28 శాతం ఓట్లు సాధించి 164 అసెంబ్లీ స్థానాలు గెలుపొందిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్ పధకాలను అమలు చేయాల్సి ఉంది. కానీ వాస్తవానికి గత ప్రభుత్వ ఆర్ధిక అస్తవ్యస్త విధానాల వలన అప్పులు పెరిగిపోయి వాటిని చెల్లించలేని స్థితికి రాష్ట్ర ఆర్ధిక స్థాయి దిగజారిందని విశ్లేషిస్తూ “రుణ సామర్థ్యం” అంశంలో నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ కు సున్నా మార్కులు ఇచ్చింది.
ఆర్ధికంగా గడ్డు పరిస్థితిని గ్రహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరికొత్త ప్రణాళికలను రూపొందించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నిలపడం ద్వారా పెంచుకున్న ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలను సజావుగా అమలు చేయగలమని భావించి అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాల అమలుకోసం చేస్తున్న భగీరథ ప్రయత్నం ప్రధాని మోడీ సానుకూలత వలన సాకారం అవుతోంది.
రాష్ట్రానికి జీవనాడి పోలవరం రెండవ డిపిఆర్ (రూ.30,436 కోట్ల)ను కేంద్రం ఆమోదించింది. అదనంగా ఆమోదం పొందిన రూ.12,157 కోట్లను రెండేళ్లలో ఇవ్వనున్నట్లు కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభంతో పోలవరం నిర్మాణ పనులలో తిరిగి వేగం పుంజుకుంది.
ఇక ప్రతిష్ఠాత్మకమైన ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణం లక్ష్యంగా సిద్ధం చేసిన ప్రణాళికలు ఆచరణలోకి వస్తున్నాయి. రాజధాని అమరావతి సమస్యలన్నింటినీ పరిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వం, చకచకా నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సహకారం వలన ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB), ప్రపంచ బ్యాంకు కలిపి అమరావతికి 15 వేల కోట్ల దీర్ఘకాలిక ఋణం మంజూరు చేశాయి. అమరావతి నిర్మాణానికి రూ.11,000 కోట్ల రుణం మంజూరు చేస్తూ హడ్కో నిర్ణయంతో రాజధాని నిర్మాణ పనులు మరింత వేగం సంతరించుకుంటాయి.
ఇప్పటికే సుమారు రూ.30 వేల కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సీఆర్డీఏ టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఐదేళ్ల ఆర్ధిక అధోగతి, విధ్వంసం నుండి విముక్తి కలిగి పోలవరం, అమరావతి ప్రాజెక్టుల పరిధిలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభ కావడంతో రాష్ట్రంలో అభివృద్ధి పనుల సందడి మొదలయ్యింది.
ఆర్థికపరమైన ఇబ్బందులను అధిగమించి, ఆదాయ వనరులను పెంచుకుంటూ, పెట్టుబడులకు ముందుకు వస్తున్న పారిశ్రామిక సంస్థలకు ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ.. సింగల్ విండో అనుమతులతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటుగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా భారీ పెట్టుబడులతో మెగా పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.
అలాగే పునరుత్పాదక రంగంలో ఐదేళ్లల్లో రూ.10 లక్షల కోట్ల విలువైన దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 7.5 లక్షల మందికి ఉపాధితోపాటు, 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించి రాష్ట్రాన్ని గ్లోబల్ క్లీన్ ఎనర్జీ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ICE) పాలసీ 2024 సత్ఫలితాలను ఇస్తోంది.
ఫలితంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడు నెలలలోనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్టీపిసి, బిపీసీఎల్, ఎన్ హెచ్ పిసి తో పాటుగా రిలయన్స్, టాటా, మిట్టల్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ పారిశ్రామిక సంస్థలతో రూ.6,33,726 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జనవరి 30వ తేదీన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపిబి) సమావేశంలో 19,580 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉన్న మరో 15 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు.
ఈ పరిశ్రమల స్థాపనతో 4.30 లక్షల మందికి పైగా ఉద్యోగాలు రానున్నాయి. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులకు కేంద్రం నిధులు ఇచ్చింది. అలాగే కాకినాడ విశాఖ పెట్రో కారిడార్ సమస్యను కూడా కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తే మరింతగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది.
రాష్ట్రంలోని వివిధ సమస్యలపై ప్రత్యేక దృష్ఠి పెట్టి పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్న చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి ఫలాలతో రాష్ట్ర ప్రజానీకానికి సంక్షేమ ఫలాలను అందిస్తూ ఏడాది పాలన (జూన్ 12,2025) లోపే సూపర్ సిక్స్ హామీలలో వీలైనన్ని ఎక్కువ అమలుచేసి తమది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిరూపించుకునే దిశగా వ్యూహరచన చేస్తున్నారు.
తదనుగుణంగా సూపర్ సిక్స్ లో మెగా డీఎస్సీ, దీపం పథకం కింద ఏటా ఇంటికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పధకాలను అమలు చేసిన ప్రభుత్వం జూన్ లోపు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సేవలను అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సమాచారం. అలాగే ఏప్రిల్ 15 కంటే ముందే మత్యకార భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
అయితే వైసీపీ చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంటూ చేపట్టిన ప్రచారం ప్రారంభించారు. దీనివలన జగన్ రెడ్డి చేసి పోయిన అప్పులు.. చేసిన విధ్వంసం కారణంగానే చంద్రబాబు పథకాలు ఇవ్వలేకపోతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలపడే అవకాశం ఉంది. నిజానికి సూపర్ సిక్స్ పధకాలు అమలు చేయడానికి ప్రభుత్వానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
2019 వైకాపా మొత్తం మానిఫెస్టోలో ఇచ్చిన 129 ఇచ్చిన హామీలలో కేవలం 49 హామీలు (38 శాతం) మాత్రమే అమలు చేసి 98 శాతం అమలు చేశామని బీరాలు పలుకుతున్నారు. సంపూర్ణ మధ్య నిషేధం, సిపిఎస్ రద్దు వంటి హామీలను అసలు పట్టించుకొనే లేదు. రూ.3 వేలకు పెంచుతామన్న సామాజిక పింఛనుల పెంపుకు నాలుగేళ్లు సమయం తీసుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వెంటనే పింఛనులు రూ.4 వేలకు పెంచారు, అన్న క్యాంటీన్లు పెట్టారు, సూపర్ సిక్స్ హామీలు ఒక్కొక్కటిగా అమలు చేయాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.
రాష్ట్రం అభివృద్ధి పధంలో పయనిస్తేనే ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించగలమనే దృఢ నిశ్చయంతో రాష్ట్ర పునర్వైభవం కోసం ఇటుక ఇటుక పేర్చి రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్న కూటమి ప్రభుత్వ కృషి సాకారం కావాలని కోరుకుందాం.
– లింగమనేని శివరామ ప్రసాద్
(రాజకీయ, సామాజిక విశ్లేషకులు)