Suryaa.co.in

Andhra Pradesh Political News

ఆంధ్రప్రదేశ్‌ 16వ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ఉత్కంఠా ఎవరికీ లేదు!

ఐదు సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్‌ 15వ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ తేదీని (2019 ఏప్రిల్‌ 11) ఇప్పుడు గుర్తుచేసుకుంటే–ఇంకా ఐదు నెలల్లో అక్కడ 16వ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రంలో కిందటి పార్లమెంటు, ఏపీ విధాన సభ ఎన్నికల ముందు ఉన్న ఉత్కంఠ లేదా ‘నువ్యా నేనా’ అనే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. ఐదేళ్ల క్రితం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మరోసారి గెలిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చివరిసారి రాజ్యమేలుతారనే భ్రమలు దాదాపు 40 శాతం ఓటర్లలో ఉన్నాయి.

ఈ విషయం పోలింగ్‌ జరిగిన నెలా 12 రోజులకు అంటే ఓట్ల లెక్కింపు జరిగిన 2019 మే 23న స్పష్టమైంది. 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 లోక్‌ సభ నియోజకవర్గాల్లో నాటి ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య జరిగిన ద్విముఖ పోటీ, పాలకపక్షంపై అప్పటికి 60 నెలలుగా జనంలో గూడుకట్టుకున్న వ్యతిరేకత కారణంగా ఫలితాలు పూర్తిగా ‘వన్‌ సైడ్‌’ అయ్యాయి. కలలో కూడా అంతటి ఘోర పరాజయం ఊహించని చంద్రబాబు గారి పార్టీకి ‘గుర్తింపు పొందిన ప్రతిపక్ష హోదా’ సంపాదించడానికి అవసరమైన సీట్ల (18 స్థానాలు) కన్నా అదనంగా ఐదు మాత్రమే వచ్చాయి.

అంటే ఈ పార్టీ మొత్తం 175 స్థానాల్లో కేవలం 13.1 శాతం సీట్లనే దక్కించుకుంది. 23 చోట్లే టీడీపీ గెలిచింది. ప్రజాదరణ, ఓటర్ల విశ్వాసం మెండుగా ఉన్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్సార్సీపీ 49.5 శాతం ఓట్లతో 86.28 శాతం సీట్లు (151) కైవసం చేసుకుంది. టీడీపీ స్థాపకుడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఓడిపోయిన మొదటి, చివరి సందర్భంలో (1989 డిసెంబర్‌) సైతం ఈ పార్టీ మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో 74 గెలుచుకోగలిగింది. అంటే. 25 శాతం స్థానాల్లో విజయం సాధించింది.

చివరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు గారి నాయకత్వాన (ఆయన ఉమ్మడి ఏపీలో చివరిసారి సీఎంగా ఉండగా జరిగిన ఎన్నికలవి) తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయిన 2004 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఈ పార్టీ దాదాపు 16 శాతం సీట్లను (294కు 47) సాధించగలిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లో రాజకీయ పరిస్థితులు, తెలుగుదేశం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిగణలోకి తీసుకుంటే–కిందటి నవ్యాంధ్ర శాసనసభ ఎన్నికల్లో సాధించిన 13.1% సీట్లు ఈ పార్టీకి అత్యంత కనిష్ఠమైనవని అనుకోవడానికి వీలు లేదనిపిస్తోంది. వచ్చే ఎలక్షన్లలో ఈ పార్టీ పతనం అంత కన్నా ఎక్కువగా ఉంటుందనే సూచనలు కనిపిస్తున్నాయి.

2024 ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ఉత్కంఠా ఎవరికీ లేదు!

1982 మార్చిలో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 2019 వరకూ తొమ్మిదిసార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం ఓడిపోయిన 1989, 2004, 2009, 2019 ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయాల్లో– గెలుపు ఏ పార్టీది? అనే సస్పెన్స్‌ వాతావరణం నెలకొని ఉండేది. కాని, గత నాలుగు సంవత్సరాల ఐదున్నర నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాల ప్రజలకు లభించిన సంక్షేమం, సాధికారత తెలుగునాట నవోదయానికి నాంది పలుకుతున్నాయి.

ఎలాంటి బాధ్యత లేని బక్కచిక్కిన ప్రతిపక్షంగా వ్యవహరించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారి నిర్వాకాలు, అవినీతి కుంభకోణాల ఫలితంగా 2024 ఏపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి? అనే చర్చ అక్కడక్కడా ఇప్పుడే మొదలైంది. టీడీపీ ఎదుర్కొంటున్న తీవ్ర రాజకీయ సంక్షోభం, ప్రజలకు, వారి ఆలోచనలకూ ఈ పార్టీ అధినేత దూరమైన తీరును నిశితంగా పరిశీలిస్తే–వచ్చే వేసవి ఎన్నికల్లో ఈ ‘ప్రధాన’ ప్రతిపక్షానికి 5 శాతం అసెంబ్లీ సీట్లయినా…అంటే కనీసం 8 స్థానాలైనా వస్తాయా? అనే అనుమానం రాజకీయ పరిశీలకులను పీడిస్తోంది.

ఈ విషయంపై మరింత స్పష్టత కోసం మనం మన పొరుగున ఉన్న తమిళనాడు రాజకీయ చరిత్రనే తీసుకుందాం. 1976 జనవరి 31న నాటి ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ కేంద్ర సర్కారు తమిళనాడు రెండో డీఎంకే ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి సర్కారును బర్తరఫ్‌ చేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన అనేక రాజకీయ పరిణామాల కారణంగా వరుసగా మూడు ఎన్నికల్లో (1977, 1980, 1985) డీఎంకే ఓడిపోయింది. చివరికి 1989 జనవరి ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించాక కరుణానిధి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన రాజకీయ సామర్ధ్యం, అంకితభావం, జనంలో ఆయనపై ఉన్న విశ్వసనీయత, డీఎంకే సైద్ధాంతిక బలం, పార్టీ నిర్మాణం వంటి సానుకూల అంశాల ఫలితంగా తాను అధికారం కోల్పోయిన 13 సంవత్సరాలకైనా ‘కళైంగర్‌’ కరుణానిధి పార్టీని విజయ పథంలో నడిపించి మూడోసారి ముఖ్యమంత్రి కాగలిగారు.

ఈ నేపథ్యంలో చూస్తే..తమిళనాడు సరిహద్దుల్లో పుట్టినాగాని చంద్రబాబు నాయుడు ఓ రాజకీయ నేతగా ఏ రకంగా చూసినా కరుణానిధికి దరిదాపుల్లోకి రాలేరు. అలాగే డీఎంకే నీడలో కూడా నిలబడే సత్తువ తెలుగుదేశం పార్టీకి లేదు. ఈ విషయాలు లెక్కలోకి తీసుకుంటే–2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు– నిస్సందేహంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీదేనని చెప్పడం ఎంత సులువో అర్ధమౌతుంది.

– వి.విజయసాయిరెడ్డి
(రాజ్యసభ సభ్యులు)

LEAVE A RESPONSE