– మారిటైమ్ పాలసీ -2024 లక్ష్యం
– సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేద్దాం
ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి: రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేలా APని మారిటైమ్ హబ్‌గా తీర్చిదిద్దాలని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
1,053 కి.మీ పొడవైన తీరప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచ స్థాయి సముద్ర తీర రాష్ట్రంగా మారిటైమ్ పాలసీని రూపొందించాలని అన్నారు. బుధవారం సచివాలయంలో దీనిపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఏపీని ‘‘వరల్డ్ క్లాస్ మారిటైమ్ స్టేట్‌గా, వినూత్న విధానాలతో తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, మౌలిక వసతుల కల్పన, సమర్ధవంతమైన పాలన ద్వారా సుస్థిర ఆర్ధిక వృద్ధి సాధించడం’’ రాష్ట్ర విజన్‌గా పేర్కొన్నారు.
మారిటైమ్ పాలసీలో నాలుగు ముఖ్యాంశాలు :
పోర్ట్ డెవలప్‌మెంట్, ప్రాట్ ప్రాక్సిమల్ ఏరియా డెవలప్‌మెంట్, షిప్ బిల్డింగ్ క్లస్టర్, అనుబంధ సముద్ర కార్యకలాపాలు.. ఇలా నాలుగు ముఖ్య ప్రతిపాదిత అంశాలు మారిటైమ్ పాలసీలో పొందుపరుస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి అంశం కింద ఫోకస్ ప్రాంతాలు గుర్తించామని చెప్పారు.
మారిటైమ్ హబ్ కోసం ముఖ్యమంత్రి ఆదేశాలు :
1.హబ్, స్పోక్ మోడల్‌ను స్వీకరించడం ద్వారా హై కెపాసిటీ పోర్టుల అభివృద్ధిపై దృష్టి పెట్టండం.
2. పోర్ట్ ప్రాక్సిమల్ ప్రాంతాలు పరిశ్రమలు, R&B, టూరిజం శాఖతో అనుసంధానించడం. 3.భవిష్యత్తు అభివృద్ధి కోసం రాష్ట్రంలోని మూడు పారిశ్రామిక కారిడార్లను లింక్ చేయడం. 4. ఏదైనా మౌలిక వసతుల కల్పన కోసం ప్రజలను భాగస్వాములను చేయడం.
5.ఫిషింగ్ హార్బర్‌లు, పోర్ట్‌ల అభివృద్ధి కోసం P4 మోడల్‌ను ప్రోత్సహించడం.
6. గ్లోబల్ స్థాయి సంస్థలు రాష్ట్రంలో నౌకానిర్మాణం, ఓడల మరమ్మతుల పరిశ్రమలు నెలకొల్పేలా ఆకర్షించడం.
7. ఆర్‌ఓ-ఆర్‌ఓ, ఆర్‌ఓ-పాక్స్ సేవలతో సహా అంతర్గత జలమార్గాల కోసం హైబ్రిడ్ మోడల్‌ను అమలు చేయడం.
8. సముద్ర రంగంలో పర్యాటకం, గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలను ఏకీకృతం చేయడం.
9. ఏపీలో మారిటైన్ యూనివర్సిటీ స్థాపించడానికి అందుకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి, పరిశోధన తదితర అంశాలలో తోడ్పాటు కోసం ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ (IMU), CEMS, IITలను భాగస్వాములుగా చేసుకోవడం.
10. ఈ రంగంలో సంస్కరణల ద్వారా ఆర్బిట్రేషన్, డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం కొరకు ఉత్తమ పద్ధతులను ప్రవేశపెట్టడం.
ఈ లక్ష్యాలను సాధించడానికి ఏపీ మారిటైమ్ బోర్డును బలోపేతం వంటివి చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. క్రూయిజ్ టెర్మినల్స్, ఫ్లోటెల్స్ వంటి వాటితో మారిటైమ్ టూరిజం అభివృద్ధి చేయాలన్నారు. అలాగే, క్లీన్ ఎనర్జీ వినియోగించి స్వయం సమృద్ధి సాధించేలా పోర్టులను తీర్చిదిద్దాలన్నారు.
ఎక్సిమ్ కార్గోలో రాష్ట్రం మొదటి స్థానం
రాష్ట్రం ప్రస్తుతం నాన్ మేజర్ పోర్టుల కేటగిరీలో ఎక్సిమ్ కార్గో హ్యాండిల్‌లో 16% వృద్ధితో దేశంలో రెండవ ర్యాంకు సాధించిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ. 15.89 లక్షల కోట్ల జీఎస్డీపీ సాధిస్తామని అంచనా వేశామన్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో గత ఆర్ధిక సంవత్సరానికి గాను 32% వృద్ధితో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామన్నారు. 2023-24 సంవత్సరం జాతీయ జీడీపీలో రాష్ట్ర వాటా 4.84 శాతంగా ఉందన్నారు.
అటు పోర్టులు – ఇటు ఫిషింగ్ హార్బర్లు
రాష్ట్రంలో ప్రస్తుతం మేజర్ పోర్టు విశాఖపట్నంతో సహా, నాన్ మేజర్ పోర్టులు 5, నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ పోర్టులు 4, నోటిఫై చేసిన పోర్టులు 7 వరకు ఉన్నాయి. ఫిషింగ్ హార్బర్లు ఫేజ్ -1 కింద రాష్ట్రంలో జువ్వలదిన్నె, ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నంలో నిర్మాణ దశలో ఉండగా, ఫేజ్-2 కింద బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (అనకాపల్లి), కొత్తపట్నం (ప్రకాశం), ఓడరేవు (బాపట్ల), బియ్యపుతిప్ప (పశ్చిమగోదావరి), మంచినీళ్లపేట (శ్రీకాకుళం) ఫిషింగ్ హార్బర్లు ప్రతిపాదన దశలో ఉన్నాయి. ఏపీ పోర్టు పాలసీ-2015లో పోర్టుల అభివృద్ధి, ఉత్తర-మధ్య భారతానికి సరుకు రవాణా, ప్రైవేట్ సెక్టార్‌కు ప్రోత్సాహం, పోటీ వాతావరణం, పారదర్శకతకు పెద్దపీట వేయడం జరిగింది. ఈసారి ఇంతకుమించేలా మారిటైమ్ పాలసీ-2024ని తీర్చిదిద్ది తుదిరూపం ఇచ్చే పనిలో అధికారులు ఉన్నారు.