మీడియా ‘హాలిడే’ ప్రకటించండి

ముఖ్యమంత్రుల నుండి స్థానిక నాయకుల వరకు…
ప్రతివారికి పదే పదే అలవాటయిపోయిన ఆరోపణ.
మీడియా నా మాటలను వక్రీకరించింది..,
మీడియా నా గురించి తప్పుడు వార్తలు ఇచ్చింది..,
మీడియా వార్తలను నమ్మద్దు..,
మీడియా మంచి విషయాలు చెప్పదు..,
మీడియా అన్నీ విమర్శలే చేస్తుంది..,

ఇలా పొద్దున లేచిన దగ్గర నుండి..,
మీడియా మీద దుమ్మెత్తి పోయడమే..,
ఒకో సారి వ్యక్తిగతంగా బండబూతులు తిట్టడం కూడానూ..

పరిశీలించి చూస్తే..
ఇది రాజకీయ పార్టీలు, నాయకులు తమ అనుకూల (స్వంత) పేపర్లు, టీవీ చానళ్ళు, పెట్టుకున్న దగ్గర నుండి,
ఈ విధమైన ఆరోపణలు, దూషణలు బాగా ఎక్కువయ్యాయి.

(మీడియా తప్పొప్పుల గురించి వేరుగా మాట్లాడుకోవల్సిన విషయం. అది ఇక్కడ కలిపితే విషయం పక్కదారి పడుతుంది)

ఈ మీడియా మీద దాడి వల్లనూ,
మీడియా అతి, అత్యుత్సాహం, సంచలనాల ప్రయత్నాలు,
కారణాల వలన కొంత మంది వార్తలు చూడము, వార్తా పత్రికలు చదవడం మానేసాము లాంటి విపరీత నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. ఈ దోరణలు మంచివికావు. ఇది ఆందోళన కలిగించే విషయం.
ప్రజలు ప్రభుత్వ విధానాల పైన, వాటి మంచి చెడ్డల పైన అవగాహన కలిగివుండడం ప్రజాస్వామ్య మనుగడకు అవసరం. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్యన వారధి లాగా వుండవలసిన మీడియా ప్రజలకు దూరం అవడం, ప్రభుత్వాల దూషణలకు తరచూ గురి కావడం మంచి పరిణామం కాదు.

మీడియా అవసరాన్ని, ఔన్యత్యాన్ని ప్రభుత్వాలు, ప్రజలు గుర్తించాలి.
మీడియా యొక్క మౌనం ఎంత నష్టం చేస్తుందో అందరికీ తెలియాలి.

వ్యవసాయానికి క్రాప్ హాలిడే, పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చినట్టు,
మీడియా ఒక నెల రోజులు “మీడియా హాలిడే” ప్రకటించాలి.
దీనికి అన్ని వార్తా పత్రికలు, న్యూస్ చానళ్ళు పరస్పరం సహకరించుకుని నిర్ణయం తీసుకోవాలి.
ఈ హాలిడే నెల రోజులు ఎటువంటి రాజకీయ వార్తలు ప్రచురించడం, ప్రసారము చేయడం మానేయాలి.
రాజకీయాలకు సంభందం లేని సాహిత్యం, వివిధ కళలు, సినిమాలు లాంటి ఇతర వార్తలు మాత్రమే ఇవ్వాలి.

ఇది జరిగితే ప్రజలకు, ప్రభుత్వాలకు మీడియా అవసరం, ఔన్నత్వం, అర్థం అవుతుంది.
జర్నలిస్టు సంఘాలు తమ ఉనికి కోసం ఇలాంటి ఒక ప్రయత్నం చేసి తీరాలి.

– పి. పి. శాస్త్రి, ఏలూరు.

Leave a Reply