– ‘ఆడబిడ్డ నిధి’ అమలు చేయలేమన్న సంకేతాలు
– మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు అర్థం అదే
– పథకాలు అమలు చేయకుండా రకరకాల సాకులు
– రాష్ట్ర ప్రజలను మెంటల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు
– ఏడాది పాలన తర్వాత రాష్ట్రాన్ని అమ్మాలని చెబుతున్నారు.
– ఇప్పటికే సగం రాష్ట్రాన్ని చంద్రబాబు, లోకేష్ బినామీలకు అమ్మేశారు
– వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి
తాడేపల్లి: టీడీపీ కూటమి ప్రభుత్వ మరో నయవంచన బట్టబయలైందని, ఎన్నికల ముందు ఆర్భాటంగా చెప్పిన సూపర్ సిక్స్ లోని ఆడబిడ్డ నిధి అమలు చేయలేమన్న సంకేతాలను ప్రభుత్వం ఇచ్చిందని వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ఆక్షేపించారు. ఈ పథకంపై మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలకు అర్థం అదే అని, పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన చెప్పారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలను నమ్మి ఓటేసిన మహిళలు ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చెప్పిన మాయమాటలు నమ్మి మోసపోయామని ఆవేదన చెందుతున్నారు. పథకాలు అమలు చేయకుండా మాయమాటలతో ఇప్పటికే ఏడాది గడిపేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా ఆ పథకాలను పూర్తిగా ఎత్తేసేందుకు కుట్ర చేస్తోంది.
అందులో భాగంగానే మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలని చెబుతూ.. ఈ పథకాన్ని అమలు చేయలేమని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. సూపర్ సిక్స్‌లో భాగంగా ఆడబిడ్డ నిధి పేరుతో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. 13 నెలలు గడిచినా ఈ హామీని అమలు చేయకుండా వదిలేశారు.
ఈ ఒక్క పథకం ద్వారానే కూటమి ప్రభుత్వం ఏకంగా 2 కోట్ల మంది మహిళలను దారుణంగా మోసం చేసింది. పైగా అన్ని హామీలను అమలు చేశామని, ఈ ఒక్క హామీ మాత్రమే మిగిలిపోయిందని పచ్చి అబద్ధం చెప్పడం సిగ్గుచేటు. ఎన్నికల ముందు సూపర్‌సిక్స్‌లో ఆర్భాటంగా ప్రచారం చేసిన రైతులకు పెట్టుబడి సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఏడాది గడిచినా ఇప్పటికీ అమలు చేయలేదు. మూడు గ్యాస్ సిలిండర్ల హామీని ఒక్క సిలిండర్‌కే పరిమితం చేశారు. ఇంకా మ్యానిఫెస్టోలో ప్రకటించిన 143 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు.
అధికారంలోకి వచ్చాం కాబట్టి ప్రజలతో తమకిక పని లేదన్నట్లు టీడీపీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. డొల్ల కంపెనీలు సృష్టించి వేల కోట్ల విలువైన భూములను ఎకరం 99 పైసలకే కేటాయిస్తూ రాష్ట్రాన్ని చంద్రబాబు తన వారికి కట్టబెట్టేస్తున్నారు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, దేవాలయ భూములు, వక్ఫ్ భూములను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తున్నారు.