– కన్సల్టెంట్లను ఆహ్వానించిన సిఆర్ డిఏ
రాష్ట్ర రాజధాని అమరావతిలో విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను ఆహ్వానించింది. ప్రపంచబ్యాంకు నిధులిస్తున్న నేపథ్యంలో అమరావతి రాజధానిలో విపత్తు నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉందని నిబంధనల్లో పేర్కొంది.
దీనిలో భాగంగా రాబోయే 30 సంవత్సరాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన నివేదికను తయారు చేయాల్సి ఉంటుంది. అమరావతి రాజధానిలో కొండవీటివాగు, కృష్ణానది, భారీ వర్షాలు, తుఫానుల నుండి తీసుకోవాల్సిన రక్షణ చర్యలను కన్సల్టెన్సీ సంస్థ రూపొందించాలి ఉంటుంది.
అలాగే భూకంపజోన్-3లో ఉండటంతో దానికి అనుగుణంగా భవనాల నిర్మాణంపైనా ప్రత్యేక నివేదికను రూపొందించాలి. అమరావతిలో నిర్మించే భవనాలు భూకంపాలను, ఇతర ప్రకృతి విపత్తులను తట్టుకునేలా ఉండాలని 2017 నవంబరు 17వ తేదీన ఎన్జటి ఇచ్చిన ఆదేశాల ప్రకారమూ విపత్తు నిర్వహణ ప్లాను తప్పనిసరిగా రూపొందించాల్సి ఉంది. ప్రణాళికలో భాగంగా ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులకు సంబంధించిన నివేదికను అధ్యయనం చేయాలని నిర్ణయించారు.
ఈ నివేదికలో వరదలు, అగ్ని ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించాల్సి ఉంటుంది. అలాగే ముంపు ప్రాంతాల్లో ఉన్న నిర్మాణాలు, సంస్థల జాబితానూ ఎప్పటికప్పుడు రూపొందించాల్సి ఉంటుంది. అమరావతిలో కొత్తగా కన్సల్టెన్సీని నియమించాలనే నిర్ణయం చర్చనీయాంశం అవుతోంది.
ఇప్పటి వరకూ ప్రకృతి విపత్తుల ప్లాను ఉందని, వరదల ముంపు నివారణ కోసం ఉండవల్లి వల్ల లిఫ్టు ఏర్పాటు చేశారని, మరలా కొత్తగా కన్సల్టెన్సీ చేయాల్సిందేమిటనే దానిపై రైతుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
– వల్లభనేని సురేష్
9010099208