– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి : బస్సు దుర్ఘటనలో మరణించిన వారిని గుర్తించేందుకు వైద్య సిబ్బంది డీఎన్ఏ నమూనాలను సేకరిస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో జరిగిన ప్రైవేటు బస్సు అగ్ని ప్రమాద ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కర్నూలు జీజీహెచ్ సూపరెంటెండెంట్కు ఆదేశాలు జారీ చేశారు. బస్సులోనే భౌతిక కాయాలు ఉన్నాయి. పరిస్థితులకు అనుగుణంగా ఘటన స్థలం వద్దే భౌతిక కాయాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఫోరెన్సిక్ వైద్యులను ఘటన స్థలానికి పంపించాం… భౌతిక కాయాల తరలింపునకు మహాప్రస్తానం వాహనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. స్వల్పగాయాలతో 12 మంది ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రుల్లో ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. బస్సులో(ఎత్తు) నుంచి దిగడంవల్ల ఒకరికి ఎక్కువ దెబ్బలు తగిలాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు.