శ్రీలంక జిడిపి కంటే ఏపీ జిడిపి మరింత అధ్వానం…

-38 శాతం కాదు మన జిడిపి 70 శాతానికి పైనే
-రాష్ట్ర జి.డి.పి డెత్ రేషో ఎప్పుడో దాటిపోయింది
-అడ్డగోలు రాజ్యాంగ ఉల్లంఘన ద్వారా అప్పులు చేస్తున్న జగన్ సర్కార్ 
-అప్పులతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సర్వనాశనం
-ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని అధ్వాన స్థితికి ఆర్థిక వ్యవస్థ
-ఎంపీ రఘురామ కృష్ణంరాజు

శ్రీలంక జీడీపీ కంటే ఆంధ్ర ప్రదేశ్ జి డి పి మరింత అధ్వానంగా ఉందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులను చూపించకుండా, రాష్ట్ర జీడీపీని చూపిస్తున్నారని పేర్కొన్న ఆయన,రాష్ట్ర జిడిపి 38 శాతం కాదని 70 శాతానికి పైగానే ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే మరో నాలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ తయారైతే, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలే ప్రమాదం ఉందని రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలుగా రాజ్యాంగం ఉల్లంఘనలకు పాల్పడుతూ, తప్పులను చేస్తుందన్నారు. రాష్ట్ర ఖజానాలో జమ కావలసిన 8 వేల కోట్ల రూపాయలను దారి మళ్లించి, బేవరేజెస్ కార్పొరేషన్ ఆదాయంగా చూపుతున్నారన్నారు. రాజ్యాంగంలో లేని స్పెషల్ మార్జిన్ అనే పదాన్ని కనిపెట్టి అప్పుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. బేవరేజెస్ కార్పొరేషన్ కు రానున్న పదేళ్ళపాటు వచ్చే ఆదాయాన్ని , బ్యాంకుకు తాకట్టు పెట్టి రుణ ప్రయత్నం చేయడం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు. రాజ్యాంగ ఉల్లంఘన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నప్పుడు ప్రయత్నాల గురించి తాను ఆర్బీఐ గవర్నర్కు లేఖ రాయనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన ఆదాయాన్ని దారి మళ్లించి, బ్యాంకు చైర్మన్ తో కుమ్మక్కై అప్పులు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకొని తీరుతానని అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణం ఎలా వస్తుందో చూస్తా నన్న ఆయన, ఒకవేళ ప్రభుత్వానికి రుణాన్ని మంజూరు చేస్తే బ్యాంకు, ప్రభుత్వ అధికారులు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళవలసి ఉంటుందని చెప్పారు. బయటనుంచి వచ్చిన చిన్న అధికారి చేత రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తప్పులు చేయిస్తున్నారని, తప్పు ఎవరు చేసినా చర్యలు కఠినంగానే ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అపులపై తాను ప్రిన్సిపాల్ ఆడిటర్ జనరల్, అకౌంట్ జనరల్ లకు లేఖలు రాసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న.

అప్పుల పై తాను ఇచ్చిన వివరాలను క్రాస్ చెక్ చేయాలని కోరానన్నారు. దానితో అప్పుల గుట్టుమట్లన్నీ బయటపడతాయని రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ రుణ యజ్ఞం ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితి కి ఖజానా చేరుకుంటుందని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. తన కాళ్లు చేతులు కట్టి వేసి హత్య చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, ప్రజలకు నిజానిజాలు తెలియాలనే తాను ధైర్యంగా ముందుకు వచ్చి, అప్పుల పేరిట ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజలకు వివరిస్తున్నానని అన్నారు. ఈ రోజు కాకపోయినా, రేపైనా నిజం తెలుస్తుందని, అప్పుడు బాధ పడేకంటే… రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ అప్రమత్తం కావాలని సూచించారు.

గోబెల్స్ ప్రచారం… అబద్ధాల ప్రకటనలు
వైఎస్సార్ రైతు భరోసా పేరిట సాక్షి దినపత్రికలో అబద్ధాల , బోగస్ ప్రకటన ఇచ్చి రైతులను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. వై యస్ ఆర్ రైతు భరోసా పథకం పేరును తాటికాయంత అక్షరాలతో రాసి, పక్కనే పిఎం కిసాన్ అనే పథకం పేరును చిన్నదిగా రాయడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రూపాయలు 7500 , పీఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం రైతులకు అందుతుందని, ఆర్థిక సహాయం లో పెద్ద తేడా లేకపోయినప్పటికీ, అక్షరాల్లో మాత్రం ఎంతో వ్యత్యాసం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

వైఎస్సార్ రైతు భరోసా కింద రైతుకు 65 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తే, అందులో కేంద్ర ప్రభుత్వం వాటా 30 వేల రూపాయలను రఘురామ కృష్ణంరాజు వివరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక లక్షా 10 వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం రైతన్నలకు చేసినట్లుగా …సాక్షి దినపత్రికలో ఇ చ్చిన ప్రకటనలో గొప్పలు చెబుతున్నారని, కానీ అందులో ధాన్యం కొనుగోళ్ల కు 50 వేల కోట్లు ఖర్చు చేశామన్నారని పేర్కొన్నారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిందని, అందులో లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సహాయం ఏమిటో అర్థం కావడం లేదని రఘురామకృష్ణంరాజు అన్నారు. 1700 కోట్ల రూపాయలతో ఫీడర్ల ఆధునీకరణ, 9 వేల కోట్ల పాత బకాయిలు చెల్లించినట్లు గా చెప్పు వచ్చారన్నారు. మరి ఈ ప్రభుత్వ బకాయిల మాటేమిటో చెప్పాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలకు 30 వేల కోట్ల రూపాయలు, హంద్రీనీవా ప్రాజెక్టు పనులు చేస్తున్న గుత్తేదారులకు 9 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ మరుగున పెట్టీ, బటన్ నొక్కు ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని అబద్ధపు ప్రకటనలు, గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రఘురామకృష్ణంరాజు దుయ్య బట్టారు. ఎన్నికలకు ముందు సిపిఎస్ రద్దు చేస్తామని అని ఉద్యోగులకు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా సి పి ఎస్ రద్దు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి, మద్యం ఆదాయాన్ని 6 వేల కోట్ల నుంచి 20 వేల కోట్లకు పెంచుకున్నారు. ఇక పెళ్లిళ్లకు 50 వేల రూపాయలుఏమి సరిపోతాయని, లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి అరు లక్షల మంది పెళ్లిళ్లు చేసుకుంటే, వారికి ఎగనామం పెట్టారని విరుచుకుపడ్డారు. జీతాలు సక్రమంగా అందక ఉద్యోగులు, మద్యం పేరిట తాము సంపాదించుకున్న ఆదాయాన్ని దోచుకుంటున్నారని మందుబాబులు, అమ్మ ఒడి సొమ్ము మొత్తం తమ భర్తలు తాగేస్తున్నారని మహిళలు, విద్యా దీవెన , విద్య వసతి పథకాల వాయిదా సొమ్ము అందని విద్యార్థులు… ఇలా అందరూ కలిసి రోడ్డెక్కితే, ఇక ఇంట్లో ఉండేది ఎవరన్నారు.. తాడేపల్లిగూడెం ప్యాలెస్ లో ఒక్క జగన్మోహన్ రెడ్డి మినహా, అందరూ రోడ్లపైనే ఉంటారన్నారు. ఉద్యోగులు చేసే ర్యాలీ ఏదైనా తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

డిజిటల్ కరెన్సీ ఎందుకు వాడరు?
మద్యం, ఇసుక విక్రయాలలో డిజిటల్ కరెన్సీ ని ఎందుకు ఉపయోగించారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. డిజిటల్ కరెన్సీ ని ఉపయోగించకపోవడం వెనక పెద్ద కుంభకోణమే ఉండదని ఆయన అన్నారు. మద్యం కొనుగోలుదారులు ఎవరైనా కార్డు ఇచ్చి, మద్యం కొనుగోలుకు ప్రయత్నిస్తే అంగీకరించడం లేదన్నారు. అలాగే ఇసుక రీచ్ ల వద్ద కూడా ఆన్లైన్ పేమెంట్ కాకుండా, నగదు చెల్లింపుల ద్వారానే ఇసుకను విక్రయిస్తున్నారన్నారు. ఒకవైపు మంత్రి పెద్దిరెడ్డి ఆన్లైన్ ద్వారా ఇసుక విక్రయాలు కొనసాగుతున్నాయని చెబుతుంటే, మైనింగ్ అధికారి చంద్రశేఖర్ మాత్రం త్వరలోనే ఆన్లైన్ విధానం చేస్తామని చెప్పు రావడం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇసుక అక్రమ రవాణా లో ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయలేదని సదరు అధికారి అంటుంటే, పెద్దిరెడ్డి మాత్రం కేసులు నమోదు చేశాం… మోహనాల ను సీజ్ చేశామని , చెబుతున్నారని.. అయితే ఇద్దరిలో ఎవరి మాట నిజమో చెప్పాలన్నారు. సీజ్ చేసిన వాహనాలు ఎక్కడ ఉన్నాయని అని ప్రశ్నించారు. ఇసుక కుంభకోణంలో శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జెపి ప్రమేయం ఉన్నట్టా ? లేనట్టా? అని రఘురామకృష్ణంరాజు నిలదీశారు. స్వలాభం కోసం వ్యవస్థలన్నింటిని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు.

దస్తగిరి కి ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత..?
వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వారికి బెయిల్ మంజూరు చేస్తే, ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి కి ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. దస్తగిరి ఆత్మహత్య కావింపబడే ప్రమాదం లేకపోలేదన్నారు. సీబీఐ అధికారి రామ్ సింగ్ పై కేసు నమోదు చేసి, అతన్ని ఢిల్లీకే పరిమితం చేశారన్నారు. ఇక ఈ కేసు విచారణ ఎప్పుడు పూర్తి చేస్తారో, చెప్పాలని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. రాంసింగ్ తన పై నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ ను స్వాష్ చేయాలని కోర్టుకు విన్నవించుకున్నారని, ఇంకా ఆ కేసు కోర్టు పరిధిలోనే ఉందన్నారు. ఒక కేసు విచారణ ఎప్పుడు పూర్తి చేస్తారని అడగడం ఎంతవరకు సమంజసమని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. వైయస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ఇంకా కొనసాగుతున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. వివేకా హత్య కేసులో కుట్ర కోణం ఉందని సిబిఐ తన చార్జిషీట్ లో పేర్కొనడం చూస్తే, ఈ కేసును సమగ్రంగా విచారించి దోషులకు శిక్షపడేలా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనని అన్నారు. తనకు అత్యంత ఆప్తుడైన చిన్నాన్న హత్య కేసులో నిందితుడిగా తమ పార్టీ కార్యదర్శి శంకర్రెడ్డి ఉన్నప్పటికీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేయకపోవడం విస్మయాన్ని కలిగిస్తోందనీ చెప్పారు. కొన్ని పార్టీల లో పనిచేసే నాయకులపై ఈ తరహా ఆరోపణలు వచ్చినప్పుడు సస్పెన్షన్ చేయడం ఆనవాయితీ అని, కానీ తమ పార్టీ అందుకు భిన్నమని అన్నారు.

Leave a Reply