Suryaa.co.in

Editorial

ఇంతకూ తాకట్టు పెట్టారా? లేదా?

– సచివాలయం తాకట్టుపై తకరారు
– విరుచుకుపడుతున్న విపక్షాలు
– ప్రధానికి లేఖ రాసిన ఎంపి రఘురామకృష్ణంరాజు
– ఇదేం దరిద్రమన్న బీజేపీ కార్యదర్శి సత్యకుమార్
– తాకట్టు సిద్ధాంతాన్ని మేనిఫెస్టోలో పెట్టండి
– తాకట్టు పెట్టుకోలేదన్న బ్యాంకు
– పెడితే తప్పేంటన్న మాజీ మంత్రి కొడాలి నాని
– దానితో మళ్లీ మొదలైన అనుమానాలు
– ఇప్పటిదాకా పెదవి విప్పని ప్రభుత్వ పెద్దలు
– అసలు ఏ బ్యాంకులోనూ తాకట్టు పెట్టలేదని చెప్పని వైనం
– తాకట్టుపై కొనసాగుతున్న అనుమానాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

రాష్ట్ర సచివాలయాన్ని 376 కోట్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో తాకట్టు పెట్టారన్న వార్తా కథనాలు.. దానిపై విపక్షాల విమర్శలతో రాష్ట్రం పరువు రోడ్డునపడింది. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ లేకపోవడంతో, ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. మరి మౌనం అర్ధాంగీకారం కదా? అందుకు!

సచివాలయ తాకట్టు వార్త అట్టుడికిస్తోంది. ఇప్పటికే మందుబాబులను సైతం తాకట్టుపెట్టి.. రుణం తెచ్చిన సర్కారు పాత అనుభవాలు, మరోసారి తెరపైకి వచ్చాయి. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు, మరెన్నో తాకట్టు కథలు మళ్లీ సహజంగానే చర్చనీయాంశమయ్యాయి. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో సచివాలయంలోని కొన్ని బ్లాకులను తాకట్టు పెట్టారన్న వార్తలు కూడా, పాత అనుభవాలను బట్టి నిజమేనన్న భావన కలిగించాయి. ఆర్ధికమంత్రి మౌనం కూడా దానికి కారణమయింది. ప్రభుత్వం అసలు ఏదైనా ఆస్తులను తాకట్టు పెట్టకపోతే ఆశ్చర్యం గానీ, తాకట్టు పెడితే ఆశ్చర్యం ఏముందని, వ్యంగ్యంగా మాట్లాడుకునే వరకూ రుణాంధ్రప్రదేశ్ పయనిస్తోంది.

‘జగన్‌రెడ్డి తాకట్టుపెట్టింది సచివాలయాన్ని కాదు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. అటు ఎంపి రఘురామకృష్ణంరాజు కూడా, తాకట్టు యవ్వారంపై ప్రధానికి లేఖ రాశారు. ‘‘సచివాలయం తాకట్టు పెట్టారన్న వార్తలు విన్నాను. ఇంతకంటే సిగ్గుచేటు మరొకటిలేదు. ఏపీ పౌరులుగా మనం సిగ్గుపడాలి. అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు సిగ్గుపడక తప్పదు. అప్పులు చేసి ప్రభుత్వం నడిపే ఇలాంటి దౌర్భాగ్య ప్రభుత్వాన్ని నా జీవితంలోనే కాదు. అసలు ఎవరి జీవితంలోనూ చూసి ఉండరు. జగన్‌రెడ్డి ఎన్ని చేసినా మళ్లీ ఆ పార్టీ గెలిచే ప్రసక్తే లేద’’ని రాజు వ్యాఖ్యానించారు.

దీనిపై సోషల్‌మీడియాలో కూడా ఇంకా విమర్శల వరద-వ్యంగ్య ప్రవాహం పారుతూనే ఉంది. ఈలోగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నతాధికారులు, తమ బ్యాంకులో సచివాలయం తాకట్టు పెట్టుకోలేదని ఒక ఈ మెయిల్ పంపారు. సీఆర్డీఏ అధికారులూ స్పందించారు.

అయితే అది ప్రజల దృష్టికి వెళ్లకముందే, మాజీ మంత్రి కొడాలి నాని.. ‘‘సచివాలయం తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటే తప్పేంటి? సచివాలయాన్ని తాకట్టు పెట్టకూడదని బీఆర్‌అంబేద్కర్ ఏమైనా రాజ్యాంగంలో రాశారా? అవసరాల బట్టి ప్రభుత్వం ఏమైనా చేస్తుంది. అయినా అది పది ఎకరాల సచివాలయం. ఎకరం మహా అయితే పదికోట్లు ఉంటుంది. దానికే ఏమిటీ రాద్ధాంతం’’ అని సెలవిచ్చారు. దానితో అంతకుముందు బ్యాంకు అధికారులు పంపిన వివరణపై కూడా, ప్రజల్లో సహజంగా అనుమానం మొదలయింది.

కొడాలి నాని మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. పైగా అధికారపార్టీలో కీలకనేత. మరి అంతలావు నాయకుడే, సచివాలయం తాకట్టు పెడితే తప్పేమిటని వ్యాఖ్యానించారంటే.. కచ్చితంగా‘ ప్రభుత్వం తాకట్టుపెట్టే ఉంటుంద’న్న అనుమానాలకు అవకాశమిచ్చినట్లయింది. దీనితో నిజమెంతో అబద్ధమెంతో తెలియని గందరగోళం.

కొడాలి నాని వ్యాఖ్యలపై, బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘కొడాలి నానికి అది కేవలం సచివాలయం మాదిరిగానే కనిపించవచ్చు. కానీ అది ఒక ప్రభుత్వ పాలనాకేంద్రం. అక్కడ సీఎం నుంచి సెక్షన్ ఆఫీసర్ల వరకూ ఉంటారు. అంటే వారందరినీ తాక ట్టు పెట్టినట్లేనా? సంపద పెంచడం ఎటూ రాదని ఈ ఐదేళ్లలో తేలిపోయింది. కనీసం ఉన్న ఆస్తులు కూడా కాపాడటం కూడా చేతకాని వారు పాలించడం ఎందుకు? కొడాలి నానికి భాషా దారిద్య్రమే ఉందనుకున్నాం. ఇప్పుడు భావదారిద్య్రం కూడా ఉన్నట్లు అర్ధమవుతుంది. సచివాలయం అనేది ప్రజల ఆత్మగౌరవం, ప్రతిష్ఠకు సంబంధించినది. అసలు తాకట్టు వ్యవహారమే ఒక సిగ్గుచేటు. తాకట్టు పెట్టారా? లేదా అన్న విషయంపై ఆర్థికమంత్రి ఎందుకు స్పందించదు? సచివాలయం తాకట్టు పెడితే తప్పేంటన్న కొడాలి నాని వ్యాఖ్యలను సీఎం జగన్ సమర్ధిస్తారా? తాకట్టు పెట్టడమే మీ పార్టీ సిద్ధాంతమైతే దానిని నిర్భయంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టండి. ఇలాంటి కీలకమైన అంశంపై సీఎం జగన్ స్పందించకుండా, మౌనంగా ఉండటం బాధ్యతారాహిత్యం’ అని సత్యకుమార్ ఆక్షేపించారు.

నిజానికి సచివాలయం తాకట్టు అంశంపై ఈ స్థాయిలో రచ్చ అవుతున్నా, ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వకపోవడం ఆశ్చర్యం. సీఆర్‌డీఏ కాకుండా ఆర్ధికమంత్రి స్పందించకపోవడంపై, సహజంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెచ్‌డిఎఫ్‌సీ అధికారులయితే తాకట్టు లేదని వివరణ ఇచ్చారు. హ్యాపీస్! సీఆర్డీఏ అధికారులు కూడా ఆ బ్యాంకులో తాకట్టు పెట్టలేదని వివరణ ఇచ్చారు. ఇంకా హ్యాపీస్!! కానీ అసలు ‘‘ఏ బ్యాంకులోనూ తాము తాకట్టు పెట్టలేదని’’ ప్రభుత్వం ఇప్పటిదాకా ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదన్నది ప్రజల ప్రశ్న.

ఇలాంటి అత్యంత సున్నిత, ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన వివాదంపై ఏ రాష్ట్రంలోనయినా ముఖ్యమంత్రి స్పందిస్తారు. అది నిజమో-అబద్ధమో వివరణ ఇస్తారు. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం పల్లెత్తు వివరణ కూడా ఇవ్వకపోవడమే ఆశ్చర్యం. ఆయన పగ్గాలందుకున్న ఈ ఐదేళ్లలో, ఒక్కసారి కూడా మీడియాతో ముచ్చటించింది లేదు. సరే అది ఆయన ఇష్టం. కానీ ఏకంగా సచివాలయాన్నే తాకట్టు పెట్టారన్న వార్తలు వెలువడిన తర్వాత కూడా పెదవి విప్పకపోవడం ఆయనకే చెల్లిందన్నది సీనియర్ జర్నలిస్టుల ఆవేదన.

LEAVE A RESPONSE