– 100 స్వచ్ఛ రథాలను అందుబాటులోకి తెస్తాం
– పరిశుభ్రత కోసం శ్రమించే పారిశుధ్య కార్మికులు నిజమైన దేశభక్తులు
– స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాకారం.
– గత పాలకులకు చెత్త పన్ను వేయడంపై ఉన్న శ్రద్ధ తొలగించడంపై చూపలేదు
– విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్ఛత అవార్డుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
– 21 కేటగిరీల్లో 69 రాష్ట్ర స్థాయి, 1257 జిల్లా స్థాయి అవార్డులు అందజేత
– జై స్వచ్ఛ సేవక్ అంటూ సభికులతో నినాదం చేయించిన సీఎం చంద్రబాబు
విజయవాడ: పరిశుభ్రత కోసం నిత్యం శ్రమించే పారిశుధ్య కార్మికులు నిజమైన దేశభక్తులని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. పారిశుధ్య కార్మికులను చూస్తుంటే ఆపరేషన్ సింధూర్ వీరుల్లా కనిపిస్తున్నారని అన్నారు. స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర కల సాకారమవుతుందని, కాబట్టి స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో ఉత్తమ పనితీరు కనబరిచిన సంస్థలు, వ్యక్తులకు మొత్తంగా 21 కేటగిరీల్లో 69 రాష్ట్ర స్థాయి, 1257 జిల్లా స్థాయి అవార్డులను ముఖ్యమంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”పరిశుభ్రత కోసం నిత్యం శ్రమించే పారిశుధ్య కార్మికులను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. స్వచ్ఛాంధ్ర పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాత్ముడు స్వచ్ఛతను దైవత్వంతో పోల్చారు. మన పరిసరాలు, మన ప్రాంతాలు, మన రాష్ట్రం ఇంత స్వచ్ఛంగా ఉన్నాయంటే అందుకు పారిశుధ్య కార్మికులే కారణం.
అసలు వారు లేకపోతే స్వచ్ఛ ఉద్యమమే లేదు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికులు దేవుడితో సమానం. పారిశుద్ధ్య కార్మికులను చూస్తుంటే ఆపరేషన్ సిందూర్ వీరుల్లా కనిపిస్తున్నారు. సూర్యుడు ప్రతీ రోజూ కాస్త అటూ ఇటూగా అయినా ఉదయిస్తాడేమో కానీ… తెల్లవారుఝామున 4 గంటల కల్లా పని మొదలుపెట్టే కార్మికుల రుణం తీర్చుకోలేం.” అని సీఎం అన్నారు.
యూజ్-రికవర్-రీ యూజ్ పాలసీ
“స్వచ్ఛాంధ్ర సాకారం కాకుండా… స్వర్ణాంధ్ర సాధ్యం కాదు. స్వచ్చాంధ్ర అంటే స్వచ్చమైన ఆలోచన, స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన రాజకీయాలు, స్వచ్ఛమైన పాలన, స్వచ్ఛమైన సమాజం.. అంతిమంగా స్వచ్ఛమైన రాష్ట్రం. అందుకే ముఖ్యమంత్రిగా ఎన్ని కార్యక్రమాలు ఉన్నా… ప్రతి నెలా ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ పేరుతో ప్రజల వద్దకు వెళుతున్నాను. స్వచ్చాంధ్ర అనేది కేవలం నినాదం కాదు… దీన్నొక ఉద్యమంగా, సాంప్రదాయంగా మార్చాం.
ప్రతి నెలా 3వ శనివారం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’తో మహా సంకల్పాన్నే తలపెట్టాం. 1995లో ముఖ్యమంత్రిగా పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించి ఉద్యమస్పూర్తితో ముందుకు తీసుకెళ్లాను. గ్రీన్ పాస్ పోర్టు ద్వారా విద్యార్థులలో చెట్లు పెంచే అలవాటును పెంచుతున్నాం. యూజ్ అండ్ త్రో పాలసీ కాకుండా యూజ్-రికవర్-రీ యూజ్ పాలసీ అమలు చేస్తున్నాం.” అని ముఖ్యమంత్రి తెలిపారు.
జనవరి 1 నాటికి జీరో వేస్ట్ రాష్ట్రంగా ఏపీ
‘గత పాలకులు చెత్తపై పన్ను వేస్తే మేము చెత్త నుంచి సంపద సృష్టించాం. అధికారంలోకి రాగానే మచిలీపట్నంలో పర్యటించినప్పుడు అక్కడ నాలుగు రోడ్ల జంక్షన్ లో ఒక చెత్త గుట్టను చూశాను. కూటమి అధికారంలో వచ్చే నాటికి 85 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా చెత్త రాష్ట్రంలో పేరుకుపోయింది. తిరుమలలో కూడా పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయింది.
కూటమి ప్రభుత్వం వచ్చాక చెత్త పన్ను రద్దు చేశాం… చెత్తనూ తొలిగించాం. 15 నెలల్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మనం సాధించింది సామాన్య విజయం కాదు. జనవరి ఒకటి నాటికి ఏపీని జీరో వేస్ట్ రాష్ట్రంగా తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. 8,814 గ్రామాలు ODF+ మోడల్ గ్రామాలుగా, 6 జిల్లాలను ODF+ మోడల్ జిల్లాలుగా తీర్చిదిద్దుతాం.” అని చంద్రబాబు చెప్పారు.
అవార్డులు స్పూర్తి నింపుతాయి
ఇకపై ప్రతీ ఏటా స్వచ్ఛాంధ్ర అవార్డులు ఇస్తాం. ఈ అవార్డులు స్వచ్ఛ సైనికులకు గుర్తింపుతో పాటు, ప్రేరణ ఇస్తాయి. అవార్డుల స్ఫూర్తితో స్వచ్ఛమైన, పచ్చనైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేద్దాం. మన స్వచ్ఛ సంకల్పానికి మెచ్చి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ఇచ్చింది. 2024-25 ఏడాదిలో రాష్ట్రానికి 5 అవార్డులు దక్కాయి.
విజయవాడ, తిరుపతి, గుంటూరు, గ్రేటర్ విశాఖపట్నం,రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్లు పరిశుభ్రతలో రాష్ట్రం పేరు నిలబెట్టాయి. జాతీయ స్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డును విశాఖ నగరం, రాష్ట్ర స్థాయిలో మినిస్టీరియల్ అవార్డును రాజమహేంద్రవరం దక్కించుకున్నాయి. స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీలుగా విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు ఎంపికయ్యాయి. రాష్ట్రంలో స్వచ్ఛత-పరిశుభ్రత కోసం యజ్ఞంలా శ్రమించాం.” అని సీఎం అన్నారు.
ఒక్కో నెలా ఒక్కో థీమ్
“హోమ్ కంపోస్టింగ్, సోర్స్ సెగ్రిగేషన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ఈ-వేస్ట్ మేనేజ్మెంట్, బీట్ ద హీట్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్… ఇలా ఒక్కో నెలా ఒక్కో థీమ్‌తో ఫలితాలు సాధించాం. డోర్ టు డోర్ కలెక్షన్, లెగసీ వేస్ట్ క్లియరెన్స్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి చర్యలు తీసుకున్నాం. ప్రజల దగ్గర పొడిచెత్తను సేకరించి వారికి నిత్యావసరాలు తిరిగిచ్చేలా ‘స్వచ్ఛ రథం’ తెచ్చాం. త్వరలో మరో 100 వంద మండలాల్లో 100 స్వచ్ఛ రథాలు తెస్తున్నాం. 1,09,169 సోక్ పిట్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. 106 గ్రామాల్లో మ్యాజిక్ డ్రైయిన్ల నిర్మాణం చేపట్టాం.” అని ముఖ్యమంత్రి వివరించారు.
ఆదాయ వనరుగా వ్యర్థ పదార్ధాలు
“స్వచ్ఛాంధ్ర కోసం వినూత్న ఆలోచనలు అమలు చేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణలో మొదటి సవాల్ ప్లాస్టిక్. అందుకే ఆంధ్రప్రదేశ్‌ను సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఫ్రీ చేయాలని నిర్ణయించి స్టేట్ సెక్రటేరియట్ నుంచే ఇది ప్రారంభించాం. నిత్యం సేకరించే వ్యర్ధాలతో పాటు, వ్యవసాయ వ్యర్ధాలు, పరిశ్రమల వ్యర్ధాలతో ప్రాంతాల వారీగా సర్క్యులర్ ఎకానమి పార్కులు ఏర్పాటు చేస్తున్నాం.
కొద్ది రోజుల క్రితం ‘ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ & వెస్ట్ రీసైక్లింగ్ పాలసీ 2025–30’ని ప్రకటించాం. వ్యర్థ పదార్ధాలను ఆదాయ వనరుగా చేసుకుంటున్నాం. రీసైక్లింగ్ పరిశ్రమలను ప్రోత్సహించి, ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం చేస్తున్నాం. 2047 నాటికి ప్రపంచంలో నెంబర్ వన్ గా మనదేశం నిలుస్తుంది. అదే సమయానికి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ తయారు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.” అని ముఖ్యమంత్రి అన్నారు.
కార్మికులకు అండగా నిలిచాం
“పరిశుభ్రత-పర్యావరణం కోసం తమ ఆరోగ్యాన్ని సైతం పణంగా పెడుతున్న పారిశుధ్య కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. పారిశుధ్య కార్మికులు ప్రమాదవశాత్తూ మరణించినా, పూర్తి వైకల్యం చెందినా ఒక్కో కుటుంబానికి రూ. 1 కోటి బీమా మొత్తం చెల్లించేలా యాక్సిస్ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నాం. పాక్షిక వైకల్యానికి, వారి పిల్లలకు ఎడ్యుకేషన్ గ్రాంట్, అలాగే కాంప్లిమెంటరీ గ్రూప్ టర్మ్ లైఫ్ కవర్, మొత్తం కుటుంబానికి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాం.” అని సీఎం తెలిపారు.
సంక్షేమంలో ఏపీ టాప్
“అర్హులందరికీ సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటున్నాం. అదే సమయంలో అభివృద్ధిలోనూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని ట్రాక్ చేసేలా సంజీవని ప్రాజెక్టు మొదలు పెట్టాం. యూనివర్శల్ హెల్త్ పాలసీ తెచ్చిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ రూ. 2.5 లక్షల విలువైన ఆరోగ్య బీమాను ఉచితంగా అందిస్తున్నాం. పేదలకు రూ. 2.5 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు అయ్యే వైద్య ఖర్చులను ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరిస్తోంది.
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం. నీటి భద్రత కల్పిస్తాం. మహాత్ముడి స్పూర్తితో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ కోసం అందరం కలిసి నడుద్దాం.” అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, కొలుసు పార్దసారధి, స్వచ్ఛాంధ్ర ఛైర్మన్ పట్టాభి, పీసీబీ ఛైర్మన్ కృష్ణయ్య, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.