Suryaa.co.in

Andhra Pradesh

‘డిజిటల్ ఆరోగ్యం’లో ఎపి భేష్

-నేషనల్ హెల్త్ అథారిటి ఇడి వి కిరణ్ గోపాల్ ప్రశంస
-ప్రయివేట్ ఆసుపత్రులు కూడా ముందుకు రావాలి

ప్రజల ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజ్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యుత్తమ స్థాయిలో కృషి చేసిందని నేషనల్ హెల్త్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఐటి) వి. కిరణ్ గోపాల్ ప్రశంసించారు. శుక్రవారం విజయవాడలో ని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ లో నిర్వహించిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఓరియంటేషన్ మరియు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఐఎంఎ , ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ‘అభా’ హెల్త్ కార్డుల జారీలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఈ ప్రక్రియలో ఎపి వైద్య ఆరోగ్య శాఖ చొరవ తీసుకుని మందుందన్నారు. అభా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రైవేట్ ఆసుపత్రులు భాగస్వామ్యం కావాలన్నారు. ప్రైవేట్ హెల్త్ ప్రొవైడర్ల పార్టిసిపేషన్ అత్యంత ముఖ్యమైందన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఎపిశాక్స్ పిడి జిఎస్ నవీన్ కుమార్ మాట్లాడుతూ అభా కార్డుల జారీ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ముందు నిలవడం మరింత బాధ్యత ను పెంచిందన్నారు. డిజిటల్ యుగం వైపు దేశం దూసుకుపోతున్న ప్రస్తుత తరుణంలో వైద్య ఆరోగ్య రంగం కూడా ఆదిశగా అడుగులు వేస్తోందన్నారు. ఆశించిన మేర డిజిటల్ సమాచారం అందుబాటులో వుంటేనే ఏ రంగంలోనైనా పరిశోధన చేసేందుకు వీలవుతుందన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా సమర్థవంతమైన వైద్య వ్యవస్థ ఏర్పాటవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఫ్యామిలీ ఫిజిషియన్’ విధానానికి శ్రీకారం చుట్టిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజల ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి డిజిటలైజ్ చేయటం వల్ల వైద్య కేంద్రాలను సందర్శించినపుడు సరైన వైద్య చికిత్స అందచేసేందుకు వీలుంటుందన్నారు. ఇందులో ఐఎంఎ భాగస్వామ్యం అయ్యేలా ప్రోత్సాహించేందుకు గాను ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా వున్నామన్నారు. ఇందుకోసం త్వరలో ఐఎంఎ ఆధ్వర్యంలో వర్క్ షాప్ ను నిర్వహిస్తామన్నారు.

డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ పేద ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డు ఉండడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు . అభా హెల్త్ కార్డుల నమోదు లో ఏపీ దేశంలోనే ఉన్నత స్థానంలో నిలిచేందుకు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి నవీన్ కుమార్ కృషి ఎంతో ఉందన్నారు. ఏపీలో దాదాపు 3.5 కోట్ల అభా రిజిస్ట్రేషన్ చేయడం అభినందనీయమన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ స్టేట్ నోడల్ అధికారి డా.బివి రావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్ని కూడా భాగస్వామ్యం చేసేందుకే ఈ సమావేశాన్ని నిర్వహించామన్నారు. డాక్టర్ కోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బుసిరెడ్డి నరేంద్ర రెడ్డి, ఐఎంఎ సెక్రటరీ ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE