రాజ్యాంగ ఉల్లంఘనలు వద్దనడమే నేను చేసిన పాపమా?!

Spread the love

-హవ్వ…ప్రత్యేక విమానాలలో రకరకాల పేర్లతో ప్రయాణాలా?
-పాస్టర్లకు అబ్బా… బాబు సొమ్మని జీతాలా?
-ప్రార్థన మందిరాల నిర్మాణం అవసరమే…
-ఎంపీ రఘురామకృష్ణంరాజు

రాజ్యాంగాన్ని చదువుకోవడమే నేను చేసిన పాపమా?, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా… రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడవద్దని ప్రభుత్వ పెద్దలకు సూచించడమే తాను చేసిన నేరమా?? అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడడం తప్పని చెప్పినందుకే, తనపై అక్రమ కేసులను బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి, తాను ఇంకా బతికే ఉన్నానని తెలిపారు. లేకపోతే పోలీసు కస్టడీలోని తనని హత్య చేసి ఉండేవారన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్లను గౌరవించక పోయిన పర్లేదు కానీ సిఐడి చేత కేసులు పెట్టించి… కొట్టించవద్దని రఘురామకృష్ణం రాజు కోరారు. శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో చర్చిల నిర్మాణానికి 175 కోట్ల రూపాయలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని తెలిపారు .

అసెంబ్లీ నియోజకవర్గాలకు కోటి రూపాయలతో పాటు, 26 జిల్లా కేంద్రాలలో చర్చిల నిర్మాణానికి అదనంగా మరో 26 కోట్ల రూపాయలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం విడ్డూరంగా ఉందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 27లో ప్రభుత్వాలు మతాల జోలికి వెళ్ళవద్దని, మనది లౌకిక దేశమని స్పష్టంగా పేర్కొనడం జరిగిందన్నారు. రాష్ట్రంలో చర్చిల నిర్మాణానికి, ముఖ్యమంత్రికి అసలు సంబంధం ఏమిటని రఘురామకృష్ణంరాజు సూటిగా ప్రశ్నించారు.

ముఖ్యమంత్రిని చర్చిలు నిర్మించమని ఎవరు అడిగారంటూ నిలదీశారు. చర్చిల నిర్మాణానికి కేటాయించదలచిన 201 కోట్ల రూపాయలతో ఆసుపత్రులను, స్కూళ్లను, లేకపోతే గతుకులమైన రోడ్లను పునర్నిర్మించాలని సూచించారు. తిరుపతి జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించే నిధులతో కలిసి రెండు కోట్ల రూపాయలతో తిరుపతిలో చర్చిని నిర్మిస్తారట అని ఎద్దేవా చేసిన ఆయన, చట్ట ప్రకారం ఇది సాధ్యమేనా?అని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులకు బుద్ధి ఉందా అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గడ్డి తింటున్నారా అంటూ మండిపడ్డారు.

రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ ఇష్టా రీతిలో జీవోలు తీయడానికి కుదరదని ముఖ్యమంత్రికి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు లేదా? అంటూ సూటిగా ప్రశ్నించారు. సలహాదారులుగా ఎంతోమంది ఉన్న వారికి చదువు, సంధ్య లేదన్నారు. తమ పార్టీలో పని చేసిన వారికి సలహాదారు పదవి కట్టబెట్టారన్నారు. తాజాగా పద్మజ అనే మరొక మహిళకు సలహాదారు పదవి ఇచ్చారని, ఆమె కూడా తమ ముఖ్యమంత్రి అతిగా ప్రేమించే సామాజిక వర్గానికి చెందిన వారేనని తెలిపారు.

పాస్టర్లకు అబ్బా… బాబు సొమ్మని జీతాలా?
తమ అబ్బా, బాబు సొమ్మన్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 30 వేల మంది పాస్టర్లకు ఐదు వేల చొప్పున జీతాలు చెల్లించడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. పూజారులకు జీతాలు ఇస్తున్నారంటే, ప్రభుత్వానికి దేవాలయాలనుంచి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. అదే చర్చిలు, మసీదులు ప్రభుత్వ ఆధీనంలో లేవని గుర్తు చేశారు. ప్రభుత్వ ఖజానా నుంచి చర్చిలు, మసీదుల నిర్మాణానికి, పాస్టర్లు, మౌలానాలకు జీతాలు చెల్లింపు తప్పని అన్నారు. తాను గతంలో ఇదే విషయాన్ని చెబితే, తనపై కక్ష కట్టి ఐపీసీ 124 A సెక్షన్ కింద బుద్ధిలేని పెద్ద మనుషులు కేసు నమోదు చేయించారన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా, రాజ్యాంగ ఉల్లంఘనలు ఉంటే కాపాడడానికి ప్రయత్నించా. ఆర్టికల్ 27 కు భిన్నంగా వ్యవహరిస్తుంటే తప్పు చేస్తున్నారని చెప్పా. రాజ్యాంగం ప్రకారం ఒక మతాన్ని ప్రోత్సహించవద్దని సూచించానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ముఖ్యమంత్రి తన సొంత మతాన్ని ప్రోత్సహించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టే ఆ విషయాన్ని తాను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పానన్నారు. తానేదో మతాల మధ్య చిచ్చు పెడుతున్నానని కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.

క్రిస్టియానిటీ అంటే తనకెంతో గౌరవం
క్రిస్టియన్ మతం అంటే తనకు ఎంతో గౌరవం ఉందని … ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంటే కూడా క్రిస్టియానిటీనీ తాను ఎక్కువ గా గౌరవిస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాజ్యాంగం లో పొందుపరచబడిన ప్రొవిజన్ గురించి తాను చెప్పానని, ఆ ప్రొవిజన్ ప్రకారం ప్రభుత్వాలు మతాల ను ప్రోత్సహించడానికి ప్రజాధనాన్ని ఖర్చు చేయకూడదని స్పష్టంగా పేర్కొనడం జరిగిందన్నారు. దేవాలయాల అభివృద్ధికి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం లేదని అంటారా? అన్న రఘురామకృష్ణం రాజు, గుడికి ఖర్చు పెట్టేది… దేవాలయాలనుంచి ప్రభుత్వానికి వస్తున్న ఆదాయమేనని గుర్తు చేశారు.
దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని, ప్రభుత్వమే దేవాదాయ శాఖను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. చర్చిల నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిది కాదన్నారు. చర్చిల ద్వారా లభించే ఆదాయాన్ని పాస్టర్లే తీసుకుంటారన్నారు. ప్రైవేటుగా చర్చిలను కూడా నిర్మించుకునే వెసులుబాటు పాస్టర్లకు ఉందన్నారు. చర్చిల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి దమ్మిడి ఆదాయం కూడా లేదని, అటువంటప్పుడు చర్చిల నిర్మాణం కోసం వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాజ్యాంగంలో స్పష్టమైన నిబంధనలు ఉన్న తర్వాత కూడా ప్రభుత్వ అధికారులు జీవోలు ఎలా ఇస్తారని, దాన్ని ఒంగోలు కలెక్టర్ ఎలా ఫార్వర్డ్ చేస్తారని ప్రశ్నించారు.

ఒంగోలు కలెక్టర్ మీరు ఐఏఎస్ ఎలా పాస్ అయ్యారు?, మీకు రాజ్యాంగం తెలియదా?, ప్రభుత్వ నిధులతో చర్చిలు నిర్మించమని ఆదేశాలు ఎలా జారీ చేస్తారంటూ రఘురామ కృష్ణంరాజు నిలదీశారు. తాను ఇదే విషయమై ప్రధానమంత్రి లేఖ రాస్తానని తెలిపారు. గతంలో బాపట్ల లోక్ సభ సభ్యుడు నందిగామ సురేష్ ఒక చర్చి నిర్మాణ నిమిత్తం 43 లక్షల రూపాయల నిధులు కేటాయించగా తాను ప్రధానమంత్రి కి ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయానికి ఇప్పటికీ జిల్లా కలెక్టర్ సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని విమర్శించారు. చర్చిల నిర్మాణానికి 201 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం రాజ్యాంగబద్ధమా? అని ప్రశ్నించనున్నట్లు తెలిపారు.

సంవత్సర వ్యవధి కోసం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అప్పులను ఆరు నెలల వ్యవధిలోనే హంఫట్ చేసి, మళ్లీ కొత్త అప్పుల కోసం రాష్ట్ర అప్పుల మంత్రి తిరుగుతున్నారని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ఇంకా తమను తాను సమర్ధించుకునేందుకు ఆర్థిక మంత్రి అప్పులు చేయకపోతే హోం మంత్రి చేస్తారా? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. ఆర్థిక మంత్రి ఉన్నది అప్పులు చేయడానికి మాత్రమే కాదని, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులను పెంపొందించుకుంటూ, జాగ్రత్తగా ఖర్చు చేయడానికని అన్నారు. అవసరమైతే అప్పుచేసి, వాటిని తీర్చేలా ఆర్థిక మంత్రి ప్రణాళికలు ఉండాలని సూచించారు. ఒకవైపు అప్పులను చేస్తూనే , మరొకవైపు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడి 201 కోట్ల రూపాయలతో చర్చిలు నిర్మించడం అవసరమా అంటూ ప్రశ్నించారు.

ప్రార్థన మందిరాల నిర్మాణం అవసరమే…
ప్రార్థన మందిరాలైన దేవాలయాలు, చర్చిలు, మసీదుల నిర్మాణం అవసరమేనని రఘురామకృష్ణం రాజు అన్నారు. కానీ ప్రార్థనా మందిరాల నిర్మాణం ప్రభుత్వ బాధ్యత కాదని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలను అందజేస్తే వచ్చే నిధుల ద్వారా దేవాలయాలు, చర్చిలు, మసీదులు నిర్మించాలని సూచించారు. ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి ఒక వర్గం ప్రార్ధన మందిరాన్ని నిర్మించడం సరైన విధానం కాదని అన్నారు. ఒక మతాన్ని విశ్వసించేవారు పన్నుల రూపేణ ప్రభుత్వానికి చెల్లించిన ఆదాయంతో, మరొక వర్గం ప్రార్థనా మందిరాన్ని ఎలా నిర్మిస్తారంటూ ప్రశ్నించారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుకుంటే 5 వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయలేరా అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా దేశ వ్యాప్తంగా బిక్షాటన చేసి భవ్యమైన రామ మందిరాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వివరణ అడగకముందే రాష్ట్రంలో చర్చిల నిర్మాణం కోసం కేటాయించదలచిన 201 కోట్ల రూపాయల నిధులతో పాఠశాలలు, ఆసుపత్రులను నిర్మించాలన్నారు. ఇంకా మన ప్రభుత్వానికి ఒక సంవత్సర కాల వ్యవధి ఉన్నందున ఈలోగా ఆస్పత్రుల నిర్మాణం పూర్తి అయితే వాటికి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరును పెట్టుకోవచ్చునని సూచించారు.

హవ్వ…ప్రత్యేక విమానాలలో రకరకాల పేర్లతో ప్రయాణాలా?
గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానాలలో రకరకాల పేర్లతో పెద్ద, పెద్ద సూట్ కేసులతో ఒక వ్యక్తి ప్రయాణించినట్లుగా ప్రముఖ దినపత్రికలో వార్తా కథనాలు వచ్చాయని రఘురామకృష్ణంరాజు తెలిపారు. విజయ సాయి రెడ్డి, విజయ్, సాయి, విజయ సాయి, వి ఎస్ రెడ్డి అనే పేర్లతో ప్రత్యేక విమానాలలో రాకపోకలు సాగించినట్టు తెలిసిందన్నారు. గన్నవరం విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చెందిన తర్వాత భద్రతా పర్యవేక్షణ సిఆర్పిఎఫ్ పోలీసులేదే నని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు గతంలోనే ప్రతిపాదించారని గుర్తు చేశారు. ప్రస్తుత గన్నవరం విమానాశ్రయ అధికారి ముఖ్యమంత్రి అతిగా ప్రేమించే సామాజిక వర్గానికి చెందిన వారన్నారు. దీనితో నేరుగా రన్ వే మీదికి వెళ్లిపోయి పెద్ద పెద్ద సూట్ కేసులతో ప్రత్యేక విమానాలలో కొందరు వ్యక్తులు రాకపోకలు సాగించినట్లు తెలుస్తోందన్నారు. తన అనర్హత పిటిషన్ పై, తమ అసాంఘిక కార్యక్రమాలకు ఎక్కడైనా ఇబ్బంది వచ్చినా, వస్తుందని తెలిసినా సూట్ కేసులతో కొడుతున్నారని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు.

హైదరాబాద్ విమానాశ్రయం తో పాటు, గన్నవరం విమానాశ్రయం నుంచి కొందరు వ్యక్తులు సాగించిన రాకపోకల వివరాలను ఈ డీ అధికారులు అడిగినట్లు తెలిసిందన్నారు. ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన ఎయిర్లైన్స్ సర్వీస్ విజయ సాయి కుమార్తె తోడికోడలు కంపెనీ దేనని అన్నారు. తన కుమార్తె తోడికోడలు కంపెనీ అయితే తనకేంటి సంబంధం అని విజయసాయి ఖండించవచ్చునని సూచించారు. బేగంపేట, గన్నవరం విమానాశ్రయాలనుంచి పెద్ద పెద్ద సూట్ కేసులతో ప్రయాణాలు సాగించిన వ్యక్తులు, తిరిగి వచ్చేటప్పుడు ఆ సూట్ కేసులను తీసుకు రావడం లేదని తెలిసిందన్నారు. బేగంపేట, గన్నవరం విమానాశ్రయాల రహస్యం ఏమిటో తెలుసుకోవాలని ప్రజలకు ఉందని అన్నారు. ప్రత్యేక విమానాలలో తరలించిన డబ్బు అంతా ప్రజల డబ్బేనని గుర్తు చేశారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మద్యం సేవించి ప్రభుత్వానికి సమకూర్చిన డబ్బు అని, ఆ డబ్బు ఎక్కడకు వెళ్లిందో తెలుసుకోవాలని ఆసక్తి ప్రజలకు ఉండడం సహాజమేనని అన్నారు. బేగంపేట, గన్నవరం విమానాశ్రయాలలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్న చేపలను కాకుండా ఈడి అధికారులు పెద్ద చేపలను పట్టుకోవాలని రఘురామకృష్ణం రాజు కోరారు. అలాగే సూట్ కేసులు మోసుకెళ్లిన వాళ్లను ట్రాక్ చేసి ఆ డబ్బు ఎక్కడకు వెళ్లిందో తెలుసుకోవాలన్నారు.

ప్రత్యేక విమానం ఖర్చు ఎవరిది?
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ధనుంజయ చంద్ర చూడ్ పదవీ బాధ్యతలు స్వీకరించగానే ప్రత్యేక విమానంలో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ప్రత్యేక అధికారి ధర్మారెడ్డిలు ఢిల్లీకి వెళ్లి ఆయన్ని కలిసి ప్రసాదం అందజేశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. వీరిద్దరూ ఢిల్లీకి వెళ్లడానికి ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక విమానం ఖర్చు ఎవరిదని ఆయన ప్రశ్నించారు. టీటీడీ నిధులతో ప్రత్యేక విమానంలో ప్రయాణం చేయడానికి వీలు లేదని, మరి ఇతరులు ఎవరైనా ప్రత్యేక విమానాన్ని సమకూర్చారా అంటూ ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు పదవీ బాధ్యతలు స్వీకరించినా, టీటీడీ తరపున పోలోమంటూ ఢిల్లీకి వెళ్లి ప్రసాదాన్ని అందజేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది దేవాలయాలు ఉన్నాయని, అన్ని దేవాలయ పాలకమండళ్ల ప్రతినిధులు ఇలాగే చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. తన తోడు అల్లుడి కొడుకు పై అనేక ఆర్థిక నేరాల అభియోగం మోపబడి ఉందని, టీటీడీ చైర్మన్ అయిన తనపై కూడా ఆర్థిక నేరాభియోగం మోపబడిందని సుబ్బారెడ్డి కి తెలియదా అంటూ నిలదీశారు . ఇటువంటి వ్యక్తులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అపాయింట్మెంట్ ఇవ్వవద్దని కోరారు.

ఎలుగెత్తి అమరావతే రాజధాని అని చాటారు
కర్నూలు జిల్లా ఆదోని, ఎమ్మిగనూరు లలో ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్ షోలకు అపూర్వ ప్రజా స్పందన లభించిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు . తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని ప్రారంభించగానే సబికులు గోడలు దూకి పారిపోతుండగా, గోడలు, మేడలు, మిద్దెలు ఎక్కి పడిపోతామనే భయం లేకుండా ప్రసంగాన్ని వింటున్న జనం మరొకవైపు అని అన్నారు. సినిమా హీరోని మించిన ఆదరణ చంద్రబాబు నాయుడుకు లభిస్తుందని తెలిపారు. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తూ… తానే మీ సినిమా హీరోని కాదని గతంలో ఎన్నడూ లేనంతగా మీ నుంచి ఆదరణ లభిస్తుందంటే … మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థమవుతుందని చక్కగా అంచనా వేశారన్నారు.

40 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న చంద్రబాబు నాయుడుని చూసేందుకు జనం తండోపతండాలుగా ఎగబడుతున్నారన్నారు. వస్తున్న వారంతా బాధిత, పీడిత ప్రజలేనని అన్నారు. పోలీసు కేసుల బాధలు, పాలకుల నుంచి ఎదురవుతున్న కష్టాలను భరించలేక, తట్టుకోలేక వస్తున్న వారే నని తెలిపారు. స్వేచ్ఛ స్వాతంత్రం కోసమే బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమి కొట్టామని, రాష్ట్రంలో ప్రస్తుత పాలన బ్రిటీషు వారి పాలన కంటే దరిద్రంగా ఉందని అన్నారు. మన పార్టీకి ఓటేసిన పాపానికి ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారని వారిలో ఆ బాధ కనిపిస్తోందన్నారు.

మీకు మూడు రాజధానులు కావాలా? ఒక రాజధానియే కావాలా?? అని చంద్రబాబు నాయుడు ప్రజలను ప్రశ్నిస్తే అమరావతియే రాజధానిని వేలెత్తి, ఎలుగెత్తి చాటారని తెలిపారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని చెబుతున్న, ఆదోని, ఎమ్మిగనూరులో నిర్వహించిన సభకు హాజరైన ప్రజానీకానికి చూస్తే, రానున్న ఎన్నికల్లో తమ పార్టీ భవిష్యత్తు ఏమిటో స్పష్టమవుతుందన్నారు. ఒక్క రూపాయి ఇవ్వకపోయినా స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చి రోడ్లపై కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి, చంద్రబాబు ప్రసంగానికి అనూహ్య రీతిలో స్పందించారన్నారు . రోడ్లపై కిక్కిరిసిన జన సందోహాన్ని చూస్తుంటే, పులివెందులలో కూడా చంద్రబాబు నాయుడు సభ పెడితే ఇంతకంటే ఎక్కువే జనం వస్తారేమోనని రఘురామకృష్ణం రాజు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ పార్టీ పెద్దలు… వై నాట్ 175 అంటున్నారని కానీ రాయలసీమలో చంద్రబాబు నాయుడు కు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే పులివెందుల కూడా పోయే ప్రమాదం లేకపోలేదనే అనుమానం తనకు ఉందని అన్నారు.

పొరుగు రాష్ట్రాలకు వివేకా హత్య కేసు విచారణ
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను పొరుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కేటాయించనుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. తెలంగాణకు అప్పగిస్తారా?, లేకపోతే ఇతర రాష్ట్రాలకు అప్పగిస్తారా అన్నది తర్వాత అంశమని ఆయన పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు వివేకా హత్య కేసు విచారణను అప్పగించగానే త్వరలోనే కొన్ని అరెస్టులు జరగడం ఖాయంగా కనిపిస్తోందని తెలిపారు. ఎన్ని సూట్ కేసులు మోసినా, అరెస్టులు ఆగవని అన్నారు. ఆ అరెస్టుల తర్వాత పులివెందుల కూడా తమ నుంచి చేజారే ప్రమాదం లేకపోలేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. కుప్పం తమదేనని తాము అనుకుంటుంటే … కుప్పం ఎలాగో తాము నెగ్గలే మని తేలిపోయిందని, పులివెందుల కూడా పోయే ప్రమాదం లేకపోలేదన్నారు.

జర్నలిస్టు మూర్తిని వేధించడం ఎందుకు?
టీవీ 5 జర్నలిస్టు మూర్తిని వేధించడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. ఛానల్ పెట్టుకున్నోళ్లు మాట్లాడవద్దా అని ప్రశ్నించిన ఆయన , సాక్షి ఛానల్ లో మాత్రం ఇష్టమొచ్చినట్లు మాట్లాడవచ్చునా అంటూ నిలదీశారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఐపీసీ 124A, 153A లు పెట్టి వేధిస్తే, ప్రజల నుంచి స్పందన అలాగే ఉంటుందని ఆదోని, ఎమ్మిగనూరు సభలకు హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి అన్నారు. చంద్రబాబు నాయుడు సభలకు హాజరైన జన సందోహాన్ని చూస్తుంటే ప్రజల్లో మార్పు వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

డబ్బులకు ఓట్లు పడవని, డబ్బులు మాత్రం ప్రజలు తీసుకుంటారని అన్నారు. జనాన్ని దోచిన, దాచిన సొమ్ము ఇచ్చినప్పటికీ, ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రారంభించగానే పారిపోతున్నారని గుర్తు చేశారు. తమ ముఖ్యమంత్రి సభలకు హాజరవుతున్న జనానికి కుర్చీలు వేసి కూర్చోబెడుతున్నారని, ఆదోని ఎమ్మిగనూరు సభలకు హాజరైన ప్రజలకు కుర్చీలు వేసి కూర్చోబెట్టాలంటే ఆ జిల్లాలో ఉన్న కుర్చీలన్నీ సరిపోవన్నారు. డబ్బులు ఇవ్వకపోయినా ప్రజల్లో స్పందన కనిపించిందని, డబ్బులు ఇచ్చినప్పటికీ ముఖ్యమంత్రి సభలకు హాజరవుతున్న సబికులు పారిపోతున్నారన్నారు.

ప్రస్తుతం తమ ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడాలని ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారన్న రఘురామకృష్ణంరాజు, ఆ సమస్యలను తీర్చే నాయకులకే ఓట్లు వేస్తారన్నారు. తనకు తెలిసిన ప్రజానాడిని తాను అంచనా వేస్తున్నానని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఈ పరిణామం బాధాకరమే అయినప్పటికీ, ప్రజాస్వామ్యవాదిగా హర్షిస్తున్నానని తెలిపారు . ఇది ప్రభుత్వం పై వెల్లువెత్తిన వ్యతిరేకత అని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply