Suryaa.co.in

Andhra Pradesh

జే ట్యాక్స్ వల్లే ఆక్వా రంగం ఇబ్బందులపాలౌతోంది

– మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

విజయవాడ : జే ట్యాక్స్ వల్లే ఆక్వా రంగం ఇబ్బందులపాలౌతోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారు. అనేక సంవత్సరాలుగా ఆక్వా రంగంపై ఆధారపడిన కోట్లాది మంది ప్రజలు నేడు రోడ్డున పడుతున్నారు.

ఆక్వారంగాన్ని నమ్ముకున్నవారు అధోగతిపాలవుతున్నారు. జె ట్యాక్స్ కోసం ఆక్వా రంగాన్ని తాకట్టు పెట్టడం అన్యాయం. ప్రభుత్వం సీడ్ యాక్టు తీసుకొచ్చింది. దానివల్ల నష్టమే తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. ఎక్కడా కూడా నాణ్యమైన రొయ్యపిల్లలు (సీడ్) దొరకడంలేదు. జె ట్యాక్స్ కోసం రొయ్య పిల్లల (సీడ్) వ్యాపారులపై బెదిరింపులకు దిగుతున్నారు. ప్రతి హ్యాచరీ జే ట్యాక్సు కట్టాల్సి వస్తోంది. నాణ్యమైన సీడ్ రాని కారణంగా నేడు రొయ్యలు ఏదో ఒక వ్యాధితో చనిపోతున్నాయి. ఉత్పత్తి ఉన్నా ధరలు లేవు.

మద్దతు ధర రూ.240 అని చెప్పి 210కి తగ్గించి గందరగోళం సృష్టించారు. 170 రూపాయలకు కొనడానికి కష్టంగా ఉంది. ఆక్వా ఎగుమతిదారులు సిండికేట్ గా ఏర్పడి ఆక్వా రైతులను బెదిరిస్తున్నారు. జే ట్యాక్స్ కోసం లేని పోని నిబంధనలు పెట్టారు. మార్కెట్ రేటును తగ్గించేశారు. అప్పులు చేసి తమ ఆస్తులు తాకట్టు పెట్టి పంట పండిస్తే అధికారుల వేధింపులను ఎదుర్కొనాల్సివస్తోంది. వైసీపీకి అధికారమిస్తే ఆక్వా రైతులతో ఆడుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. ఏం ఉద్ధారించాలని మత్స్యశాఖపై సబ్ కమిటీలు వేశారు?

కమిటీ సభ్యులైన బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ, సీదిరి అప్పలరాజులు ఏసీ రూముల్లో కూర్చొనివుంటే ఆక్వా రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయి? మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఎనాడైనా ఫీల్డ్ పైకి వెళ్లారా? రైతుల ఇబ్బందులు, కష్టాలు చూశారా? ఏసీ రూముల్లో కూర్చొని ధర నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదు. ఎగుమతిదారులు రైతుల మెడమీద కత్తి పెట్టి ఆక్వా రైతులతో యాడ్స్ ఇప్పిస్తున్నారు. యాడ్స్ ఇవ్వకపోతే మీ పంట బాగలేదు, నాణ్యంగా లేదు అని వెనక్కి పంపుతున్నారు. మీ జె ట్యాక్స్ కోసం గతంలో 14వందలు ఉన్న ఫీడ్ కాస్ట్ 26వందలైంది. ఫీడ్ కాస్ట్ పెరిగిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

రైతులు జే ట్యాక్స్ కట్టలేకున్నారు. ఆక్వా రంగంపై ఎప్పుడూ, ఎటువంటి నిబంధనలు ఏ ప్రభుత్వాలు విధించలేదు. ఏపీ ఆక్వా సీడ్ యాక్ట్ 36/2020 ని ప్రభుత్వం తీసుకొచ్చింది. కొత్త కొత్త యాక్టులు తెచ్చి ఆక్వా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. అప్పులపాలై ఊళ్లొదలి వెళ్లే పరిస్థితులు కల్పించారు. నాణ్యమైన సీడ్ రాదు, ఫీడ్ ధరలేమో పెరిగిపోతున్నాయి. కరెంటు బిల్లులు చూస్తేనే షాక్ కొట్టే పరిస్థితులు నేడు ఉన్నాయి. గతంలో చంద్రబాబునాయుడు యూనిట్ ధర రెండు రూపాయలకు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి రూపాయిన్నరకే ఇస్తామని హామీ ఇచ్చారు.

నేడు యూనిట్ కరెంటుకు 5రూపాయల 30 పైసలు కట్టాల్సి వస్తోంది. గతంలో పది వేల రూపాయలు వచ్చిన కరెంటు బిల్లు నేడు 40 వేల రూపాయలు అవుతోంది. రైతులు ఎక్కడ నుంచి కట్టగలరు? అక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అని విభజించి కరెంటు బిల్లులు దోచేస్తున్నారు. కరెంటు రేట్లు నిర్ణయించాల్సింది ముఖ్యమంత్రే. గతంలో చంద్రబాబునాయుడు హయాంలో ఆక్వా, నాన్ ఆక్వా అనే తేడాలు చూడకుండా అందరికీ రూ.2కే కరెంటు ఇచ్చారు. నేడు నాణ్యమైన కరెంటు లేదు. ఇతర ఛార్జీలు అంటూ రైతాంగాన్ని పిండేస్తున్నారు. ఆక్వా రంగాన్ని దెబ్బతీసేందుకు మంత్రులు కుట్రలు పన్నుతున్నారు.

రొయ్య రైతుల జొలికి వస్తే పుట్టగతులుండవని వేధింపుదారులు గ్రహించాలి. ఆక్వా రైతులను నేరస్థులను చూసినట్లు చూస్తున్నారు. ఆక్వా రైతులపై రెవెన్యూ అధికారుల వేధింపులు అధికమయ్యాయి. రాష్ట్రాన్ని నమ్మి ఒక్క పరిశ్రమ రాలేదు. మత్స్య శాఖలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చాలా వుంది. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి ఆక్వా రంగాన్ని, మత్స్య శాఖను ప్రోత్సహించడానికి ఎన్ ఎఫ్ డీనిధులు వస్తుంటాయి. 90 సబ్సిడీతో అనేక పథకాలున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశాలున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వంతు చూపదు. మత్స్య రంగానికి పది వేల రూపాయలు ఇస్తున్నానని చెబుతూ ఆక్వా రంగాన్ని సర్వ నాశనం చేశారు.

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వారికి కావాల్సిన పడవలు, ఇంజన్లు, బోట్లను సబ్సిడీతో ఇచ్చేది. జే బ్రాండ్స్ పెట్టి లిక్కర్ స్కామ్ చేసినట్లుగా ఆక్వా స్కామ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో రైతులు పండించే ఈ పంటను కూడా రైతు భరోసా కేంద్రాల నుంచి సీడ్ సరఫరా చేస్తాం మేం చెప్పిన కంపెనీల వద్ద మీరు ఫీడ్ తీసుకోవాలని చెప్పి నిబంధనలు పెట్టనున్నారు. రొయ్యల దాణాలో ప్రొటీన్ లేని కారణంగా రొయ్యలకు వెయిట్ రావడంలేదు. మత్స్యశాఖకు న్యాయం జరగాలని తెలుగుదేశం పార్టీ పోరాడుతోంది. 240 రూపాయలకు రైతుల నుంచి ఆక్వాను కొనేవరకు ప్రభుత్వంపై పోరాడుతామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

LEAVE A RESPONSE