ఐదు, పది చదివిన వారు కూడా పట్టభద్రులేనా?

– ఉన్నారా? ఉంటే కళ్లు మూసుకున్నారా?
– ఐదో తరగతి చదువుకున్న వాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటెలా వేస్తాడు?
– ప్రపంచం అంతా చూస్తున్నా మీకు తెలియదా?
– చర్యల కొరడా ఝళిపించలేదేం?
– రీపోల్‌కు ఎందుకు ఆదేశించలేదు?
– ఏపీ ఈసీపై మాజీ సీఎస్‌ ఎల్వీ లేఖాస్త్రం

ఏపీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలు అపహాస్యం పాలయ్యాయని మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం విరుచుపడ్డారు. ఐదు, పదవ తరగతి వారికి సైతం పట్టభద్రులుగా ఓటు హక్కు కల్పించిన వైనాన్ని, టీవీ చానెళ్ల ద్వారా ప్రపంచం మొత్తం చూసిందని గుర్తు చేశారు. అయినా రీ పోల్‌కు ఆదేశించకపోవడంపై ఎల్వీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రీపోల్‌కు పార్టీలు డిమాండ్‌ చేసినా, అక్రమాలు జరిగిన చోట రీపోలింగ్‌ పెట్టకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆయన ఈసీకి రాసిన లేఖలో ఎన్నికల ప్రక్రియపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తీరును విమర్శిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ఒక ప్రహసనంగా ముగిసిందని విమర్శించారు. బోగస్ ఓట్లను నమోదు చేస్తున్నట్టు ఎన్నో తిరుగులేని ఆధారాలు కనిపిస్తున్నా, చర్యలు తీసుకోకుండా మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.

కళ్ల ముందు అక్రమాలు కనిపిస్తున్నా మౌనంగా ఎలా ఉన్నారని అడిగారు. ఐదు, పదో తరగతి చదివిన వారిని కూడా పట్టభద్రులుగా బోగస్ ఓటర్లను సృష్టించారని అన్నారు. బోగస్ ఓట్లు, ఎన్నికల నిర్వహణ అవకతవకలపై తక్షణమే విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రీపోల్ కు ఆదేశించే అవకాశం కూడా ఉందని చెప్పారు. ఈ మేరకు ఎస్ఈసీ ముకేశ్ కుమార్ మీనాకు ఎల్వీ సుబ్రహ్మణ్యం లేఖ రాశారు.

Leave a Reply