మూడు రాజధానులపై ప్రజాభిప్రాయానికి సిద్ధమా?

తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు

విశాఖపట్నం, : రాష్ట్రంలో మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వానికి దమ్ముంటే ఇప్పటికిప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు సవాల్‌ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో భూ అక్రమాలు జరిగాయని టీడీపీ నేతలపై నిందలు వేస్తున్న సీఎం జగన్మోహనరెడ్డి, వీటిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.

గత మూడేళ్లలో విశాఖలో జరిగిన భూ దోపిడీపైనా విచారణ చేపట్టాలన్నారు. విశాఖలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై టీడీపీ హయాంలో ఒకటి, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మరొక ‘సిట్‌’ వేశారని, ఈ రెండు కమిటీలు ఇచ్చిన నివేదికలు ప్రభుత్వం చేతిలో ఉన్నాయని, వీటిని బహిర్గతంచేస్తే అక్రమార్కులు ఎవరో తేటతెల్లం అవుతుందని అయ్యన్న అన్నారు. రాజధాని కోసం 33 గ్రామాల రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారే తప్ప వైసీపీ నాయకుల్లా భూములను ఆక్రమించుకోలేదని ఆరోపించారు.

అమరావతి రైతులు చేపట్టిన ‘అమరావతి టు అరసవల్లి మహా పాదయాత్ర’ శాంతియుతంగా జరగాలని, ఇందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సహకరించాలని అయ్యన్న కోరారు. పాదయాత్రను అడ్డుకుని తీరుతామని వైసీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయడం సరికాదని, ఒకవేళ అడ్డుకునే ప్రయత్నంచేస్తే పాదయాత్రకు తాము రక్షణగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఉందని అయ్యన్న గుర్తుచేశారు.

Leave a Reply