రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
న్యూఢిల్లీ, జూలై 26: కామన్ యూనివర్శిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) ఎలాంటి లోపాలకు తావు లేకుండా అత్యంత పకడ్బందీగా జరుగుతుందని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సీయూఈటీని నిర్వహిస్తుందని తెలిపారు.
సీయూఈటీ తాత్కాలిక ఆన్సర్ కీలో పొందుపరచిన అనేక జవాబులు తప్పులు తడకగా ఉన్న విషయం వాస్తవమేనా అంటూవిజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఉమ్మడి యూనివర్సిటీ ప్రవేశ పరీక్షకు సంబంధించి వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తాత్కాలిక ఆన్సర్ కీలో 570 జవాబులను సబ్జెక్టు నిపుణులు పరిష్కరించి జవాబులను సవరించినట్లు ఆయన వెల్లడించారు.
కామన్ వర్శిటీ ఎంట్రెన్స్ టెస్ట్‌లో మొత్తం 61 సబ్జెక్టులకు సంబంధించి 2305 ప్రశ్నపత్రాల్లో 1,48,520 ప్రశ్నలు ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రశ్నలకు సంబంధించి విడుదల చేసిన తాత్కాలిక ఆన్సర్ కీలలో అభ్యర్దులు 3886 ఆన్సర్ కీలను చాలంజ్ చేశారు. తాత్కాలిక ఆన్సర్ కీలపై అభ్యర్థుల నుండి వచ్చిన చాలంజ్లను పరిగణలోకి తీసుకొని సంబంధిత సబ్జెక్టు నిపుణులచే వాటిని పరిష్కరించి ఫైనల్ ఆన్సర్ కీలను పటిష్టంగా తయారు చేయడం జరుగుతుందని మంత్రి చెప్పారు.
ప్రామాణిక పరీక్షా ప్రక్రియకు అనుగుణంగా ఆన్సర్ కీలను చాలంజ్ చేసిన అభ్యర్థుల రెస్పాన్స్లన్నీ తాత్కాలిక ఆన్సర్ కీలతో సహా అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ అవుతాయి. తప్పుడు జవాబులపై అభ్యర్ధులు చేసిన చాలంజ్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నియమించిన సబ్జెక్టు నిపుణులు పరిష్కరించిన అనంతరం రూపొందించిన ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా మాత్రమే ఫలితాల విడుదల జరుగుతుందని మంత్రి తెలిపారు.
సమాచార బులిటెన్‌లో ముందస్తుగా ప్రకటించిన విధంగాను అలాగే అధికారిక వెబ్సైట్లో ప్రకటించిన పబ్లిక్ నోటీస్ ప్రకారం అభ్యర్ధులు ప్రాసెసింగ్ చార్జీల కింద ఒక్కో ప్రశ్నకు 200 రూపాయలు నాన్-రిఫండబుల్ రుసుం చెల్లించి తాత్కాలిక ఆన్సర్ కీని చాలంజ్ చేసే అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు. చాలంజ్ చేసిన ఆన్సర్ కీలు సంబంధిత సబ్జెక్టు నిపుణులు పరిష్కరించే క్రమంలో అయ్యే ఖర్చును భరించేందుకే ప్రాసెసింగ్ ఫీజును అభ్యర్ధుల నుంచి వసూలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.