-కోర్టులో నిన్న కృష్ణారెడ్డి… నేడు భాస్కర్ రెడ్డి పిటిషన్ దాఖలు
-ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించేందుకే కోర్టులలో పిటిషన్ల దాఖలు
-ఒక హైకోర్టు కొట్టి వేసిన కేసును మరొక హైకోర్టులో దాఖలు చేయడం సిగ్గుచేటు
-కోడి కత్తి కేసులో విచారణకు హాజరుకావాలని ముఖ్యమంత్రి కి నోటీసులు
-పట్టభద్ర ల ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడింటికి మూడు గెలిచే ఛాన్స్
-న్యాయస్థానాల్లో న్యాయం జరిగింది… రాజధాని మాకు వద్దు బాబు అన్న విశాఖ వాసులు
-వై నాట్ 175 ఎటు పోయింది?
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సోమవారం మరొకసారి నోటీసులు జారీ చేసి, ఇప్పటికే ఆయన్ని అరెస్టు చేస్తామని చెప్పినా సిబిఐ, అరెస్టు చేయడం ఖాయమని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు అన్నారు.హైకోర్టు ఆర్డర్ తీర్పు కాపీ అందగానే, సుప్రీంకోర్టును వైయస్ అవినాష్ రెడ్డి ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా?, లేకపోతే వ్యక్తిగతంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. అలవాటులో పొరపాటుగా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రభుత్వ ప్రతినిధి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారేమోనని ఆయన అపహాస్యం చేశారు. శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా మాట్లాడుతూ… ఇలాంటి చెత్త కేసులను సుప్రీంకోర్టు హడావిడిగా స్వీకరించదని తెలిపారు.
సోమవారం నాడు సుప్రీంకోర్టు లో ఒకవేళ అత్యవసర పిటిషన్ దాఖలు చేస్తే, జగన్మోహన్ రెడ్డి కేసులను వాదించిన న్యాయవాదులే, పిటిషనర్ తరఫున వాదనలు వినిపించనున్నారు . సుప్రీం కోర్టు త్వరగా విచారణను పూర్తి చేయమని చెప్పిన కేసునే, విచారణ నిలుపుదల చేయమని కోర్టుకు వెళ్తారా? అంటూ ప్రశ్నించారు. తమ వశీకరణ విద్యలతో సమాజంలో పెద్ద, పెద్ద వ్యక్తులను లోబర్చుకునే తెలివితేటలు ఉన్న మా ప్రభుత్వ పెద్దలకు, ఒక అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారి ఢీకొట్టడం అభినందనీయం. గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వెంట్రుక కూడా ఎవరు పీకలేరని పేర్కొన్నారని, ఎంతమంది దుష్టులు ఏకమైనా రాంసింగ్ వెంట్రుక కూడా పీకలేరన్నది తన అభి మతమని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ కేసు వ్యవహారంలో మా పార్టీ నాయకులు ఎవరిని కలిసినా వీక్ కావడం మినహా ఫలితం ఉండదు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి దోషి అని, ఇంకెవరో దోషి అని తాను అనడం లేదు. నిజమైన దోషి ఎవరో వైఎస్ వివేక గాయాలకు కుట్లు వేయించి, రక్తపు మరకలు తుడిపించిన వారిద్వారా నిజదోషులు ఎవరో తెలిసే అవకాశం ఉందని రఘు రామకృష్ణంరాజు అన్నారు. వైఎస్ వివేక వ్యక్తిగత మాజీ సహాయకుడు కృష్ణారెడ్డి వంటి పాత్రలను ప్రవేశపెట్టడం ద్వారా కోర్టులను గందరగోళపరచాలనే ప్రయత్నం జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. వైయస్ వివేకకు ఆయన అల్లుడికి మనస్పర్ధలు ఉన్నాయని, ఆయనే ఎందుకు చంపి ఉండకూడదని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉంది. ఇటీవల కొన్ని ఫోటోలను కూడా విడుదల చేయడం విడ్డూరం. తనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు, వివేక కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హత్యకు ముందే వైఎస్ వివేకా కుటుంబ సమేతంగా ఆనందంగా విదేశీయాత్ర చేసి వచ్చారు. నాలుగేళ్ల అనంతరం కేసు చేయి దాటిపోయిందని చెప్పి ఇప్పుడు రకరకాలుగా తొకడ కేసులను వేయడం సిగ్గుచేటు. ఈ కేసులను చూసి సభ్య సమాజం అసహ్యించుకుంటుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్ర విఫలమే…!
ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన విఫలమే అవుతుంది. ఒక్క సమావేశం తో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించామని, ప్రత్యేక హోదా కల్పిస్తే 26 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ప్రధానికి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా తెలిసిందని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు . వైయస్ అవినాష్ రెడ్డి అత్యవసరంగా దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టులో తీర్పు వెలువడనుండగా, మరొకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ముఖ్యమంత్రి హడావిడిగా హస్తినకు బయలుదేరడం వెనుక ఆంతర్యం ఏమిటి? . ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జగన్మోహన్ రెడ్డి 60 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారని సాక్షి ఛానల్ లో కథనాన్ని ప్రసారం చేయగా, నీలి మీడియాలో 45 నిమిషాల పాటు సమావేశమయ్యారని కథనాలను ప్రసారం చేశారు. తాను కూడా పార్లమెంట్లోనే ఉన్నానని, కేవలం 20 నుంచి 25 నిమిషాల పాటు ప్రధానితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. పోలవరం బిల్లులు పెండింగులో ఉన్నాయని, ప్రత్యేక హోదా కేటాయింపు ఆలస్యం జరుగుతోందని, ఇంకా మరిన్ని చిలిపి చిలిపి డిమాండ్లను ప్రధానమంత్రి ముందు ముఖ్యమంత్రి పెట్టారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే పోలవరం బిల్లులు ఆలస్యం జరిగాయని ముఖ్యమంత్రి హస్తిన కు వచ్చారంటే ప్రజలేమి చెవిలో పువ్వులు పెట్టుకోలేదని అన్నారు. పోలవరం పెండింగ్ బిల్లుల గురించి ఒకవేళ ముఖ్యమంత్రి కలవాలనుకుంటే కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శేఖవత్, రైల్వే జోన్ కోసం అయితే రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ ను కలువాలి. కేసుల గురించి మాట్లాడాలనుకుంటే హోంమంత్రితో సమావేశం కావాలి అన్నారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గట్టిగానే ప్రయత్నం చేసినట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యమంత్రి నోరు విప్పరు. అయినా, ఆయన పోలవరం గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు.
సీఎం విచారణకు హాజరవుతారని అనుకోవడం లేదు
కోడి కత్తి కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏప్రిల్ 10వ తేదీన విచారణకు హాజరు కావలసిందిగా కోర్టు ఆదేశించిందని, అయినా ముఖ్యమంత్రి హాజరవుతారని తాను అనుకోవడం లేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. కోడి కత్తి కేసులో తాను దాడి చేయలేదని నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న శ్రీను చెప్పారు. అయితే ముఖ్యమంత్రి పై దాడి చేసింది ఎవరు?. ఎవరైనా దాడి జరిగిన తర్వాత తక్షణ చికిత్స నిమిత్తం ప్రాథమిక ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓర్పుగా విమానం లో కూర్చొని హైదరాబాద్ చేరుకొని, అక్కడ స్ట్రెచర్ పై పడుకుని కళ్ళు మూసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. బాబాయి హత్య కేసులో గుండెపోటు, నారాసుర రక్త చరిత్ర కాదని హత్య చేయించింది ఎవరో ఒక కొలిక్కి వచ్చినట్లయింది. కోడి కత్తి కేసులో శ్రీనును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్షమించి ఉద్యోగ అవకాశం కల్పించాలని సూచించారు. లేకపోతే ఆయనకు ప్రాణహాని ఉండే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజధానిని వద్దని తేల్చి చెప్పిన విశాఖ ప్రజలు
ప్రశాంత వాతావరణము కోరుకునే విశాఖ ప్రజలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా రాజధాని వద్దని తేల్చి చెప్పినట్లు అయిందని రఘు రామ కృష్ణంరాజు పేర్కొన్నారు. విశాఖ, తూర్పు ప్రాంత ప్రజలు ప్రశాంతమైన వారు. లుంగీ బ్యాచ్ అంటే వారికి పడదు. మొదటినుంచి తాను ఈ విషయాన్ని చెబుతూనే ఉన్నాను. పదవీ విరమణ చేసిన వారికి స్వర్గధామం గా ఉండే విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం. విశాఖపట్నంలో ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఏదైనా స్థలంపై కన్నుపడితే తమకు రాసిచ్చేయమని అంటున్నారట… ఒరేయ్ విశాఖ వాసులు సెన్సిటివ్ వారితో పెట్టుకోవద్దని తాను మొదటి నుంచి చెబుతూనే . అయినా తన మాట ఎవరు వినలేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిరంజీవి మంచి మెజారిటీతో అప్రతిహత విజయాన్ని నమోదు చేసుకోబోతున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఒంగోలుకు చెందిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తానేదో దేశ్ కి నేత అన్నట్లు వ్యవహరించారని, ఆయనేమైన వెంకటేశ్వర స్వామినా?, సుబ్బారెడ్డి వస్తే ఓట్లు వేయడానికి అని అపహాస్యం చేశారు.
విశాఖను కబ్జా చేయాలి అనుకుంటున్నావారికి ప్లీజ్ డోంట్ కమ్ అన్నట్లుగా పట్టభద్రుల తీర్పు ఉంది. గత రెండేళ్లుగా విశాఖకు వస్తానని ముఖ్యమంత్రి చెబుతున్నారు. రాజధాని లేదు… విశాఖ రాజధాని కాదు. విశాఖలో ఆఫీసు పెట్టుకుంటే ముఖ్యమంత్రి పెట్టుకోవచ్చు. లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు బిజెపిని కాదనుకొని, విద్యావంతుడైన మాధవ్ ను వద్దనుకొని టిడిపి అభ్యర్థికి అత్యధిక మెజార్టీని ఇవ్వడం వెనుక అధికార పార్టీని తుక్కుతుక్కుగా ఓడించాలనే లక్ష్యమే కనిపిస్తోంది. టిడిపి విజయం పై మంత్రులు గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులు ఎటువంటి స్టేట్మెంట్లను ఇస్తారో సాక్షి దినపత్రికలో చూడాలని ఉంది. పోకిరి సినిమాలో పండుగాడు చెప్పినట్లుగా జీతాలు ఎప్పుడు ఇచ్చామన్నది కాదు… ఇచ్చామా లేదా అన్నదే ముఖ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. దొంగ ఓట్లు వేసుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించిన పట్టభద్రులకు అభినందనలు. రేపు తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లు వేసుకుందని మంత్రులు అంటారేమోనన్నా అనుమానాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైవేటు కాలేజీలో అధ్యాపకులను చేర్చి, ఆర్జేడీల ద్వారా బెదిరింపులకు పాల్పడడం వల్లే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
వై నాట్ 175 ఎటు పోయింది?
తూర్పు రాయలసీమ పరిధిలోని ఒంగోలు, నెల్లూరు జిల్లాల టిడిపి అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం దిశగా ముందుకు సాగుతున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎదురు ఈదడం పరిశీలిస్తే, వై నాట్ 175 ఎటు పోయిందని ప్రశ్నించారు. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓటమి పాలయ్యే అవకాశాలు లేకపోలేదు. ఒక పార్టీ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ప్రజలు విజ్ఞతతో వ్యవహరించడం శుభ పరిణామం. ఇకనుంచి రాష్ట్రంలో అరాచకాలు విజృంభిస్తాయి. పోలీసులలో చైతన్యం, మార్పు వస్తుంది. స్వీయ రక్షణ తోపాటు, ప్రజల్లో మార్పు కోసం పట్టభద్రులు కృషి చేయాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. వై నాట్ 175 అన్నది కేవలం పిచ్చి ప్రేలాపనేనని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.