-రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ
-ప్రజా పాలన అంటే ఇదేనా?
-మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజం
హైదరాబాద్ : తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అక్రమ అరెస్ట్‌ను బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజా పాలన అంటే ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కడమేనా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు.
తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, తెలంగాణవాది కొణతం దిలీప్‌ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడం రేవంత్ రెడ్డి దమన నీతికి నిలువెత్తు నిదర్శనం అని ఆయన మండిపడ్డారు.
కొంతకాలంగా ప్రభుత్వ అసమర్థ చేతగాని తనాన్ని దిలీప్ ప్రశ్నించటాన్ని రేవంత్ సర్కార్ తట్టుకోలేకపోతోందన్నారు. కొన్ని రోజుల క్రితం కూడా తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే హైకోర్టు చీవాట్లు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని ఆయన ఎద్దేవా చేశారు.
ఎలాగైనా దిలీప్ గొంతునొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారన్నారు.కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో కూడా చెప్పకుండా అరెస్ట్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.