సుప్రీంకోర్టునే తప్పుదారి పట్టిస్తారా?

-ప్రభుత్వాన్ని అడిగితే, పార్టీ తరఫున అఫిడవిట్ ఏమిటి?
-చేసిన అప్పులు ఎక్కువ… చూపించేది తక్కువ
-పార్టీని రక్షించుకోవడానికి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అప్పుల వివరాలతో సుప్రీం కు లేఖ రాస్తా
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

రాష్ట్ర జి ఎస్ డి పి లో 41 శాతం అప్పులు మాత్రమే చేశామని చెప్పి సుప్రీంకోర్టును తమ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు విమర్శించారు . తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన విజయసాయి రెడ్డికి విరుగుడుగా, పార్టీ మేలు కోసం తాను మరొక అఫిడవిట్ దాఖలు చేస్తానని తెలిపారు.

పార్టీని రక్షించుకోవడానికి, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తన వద్ద ఉన్న పూర్తి ఆధారాలతో కూడిన అప్పుల సమాచారాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ ద్వారా నివేదిస్తానని అన్నారు. అప్పుల విషయములో సుప్రీంకోర్టుకు అబద్దాలను చెప్పడం దారుణమని ఆయన మండిపడ్డారు. శనివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఎఫ్ ఆర్ బి ఎం నిబంధనలను పక్కాగా పాటించి, రాష్ట్ర జీఎస్ డిపి లో 41 శాతం అప్పులను మాత్రమే చేశామని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్ లో తమ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. విద్య, వైద్యానికి ఎక్కువ నిధులను ఖర్చు చేస్తున్నామని తన ఆఫిడవిట్లో విజయసాయిరెడ్డి పేర్కొనడం విడ్డూరంగా ఉన్నదన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఒక్క ఆసుపత్రికి కూడా నిర్మించింది లేదని, 6000 ప్రభుత్వ పాఠశాలలను ఎత్తివేసి, విద్యా వైద్యానికి నిధులను ఖర్చు చేస్తున్నామని చెప్పడం సిగ్గుచేటు అన్నారు.

ఏమైనా అంటే, అమ్మ ఒడి … చెల్లి జడ ఇస్తున్నామని చెప్పడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వా లను అఫీడవిట్ దాఖలు చేయమని సుప్రీంకోర్టు కోరితే, పార్టీ తరఫున విజయసాయిరెడ్డి అఫిడవిట్ దాఖలు చేయడం ఏమిటో తనకైతే అర్థం కాలేదని రఘు రామకృష్ణంరాజు విస్మయం వ్యక్తం చేశారు. పార్టీ ద్వారా అఫిడవిట్ దాఖలు చేస్తే, పార్టీకి నగుబాటని ఆయన అన్నారు.
ఇవిగో అప్పులు…

రాష్ట్ర జి ఎస్ డి పీ లో 41% మాత్రమే అప్పులను చేశామని, మా రాష్ట్రం టాప్… మా సీఎం తోపు అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. జీవి రెడ్డి చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 8.15 లక్షల కోట్ల రూపాయలని, ఇక గత కొన్ని నెలల క్రితం తమకున్న సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 7, 88,837 కోట్ల రూపాయలని ఆయన తెలిపారు. ఈ లెక్కన రాష్ట్ర జీఎస్ డిపీ లో 77% అప్పులను రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు. రాజ్యాంగంలోని 293 వ నిబంధనను ఉల్లంఘించి, కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులను కూడా ఎఫ్ ఆర్ బి ఎం పరిధిలోకే తీసుకుంటామని కేంద్రమంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులోనూ, ప్రత్యేకించి తనకు లేఖ ద్వారా తెలియజేశారని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్దాలను చెబుతున్నదని, ఏ కార్పొరేషన్ పేరిట ఎంత అప్పు చేసింది తాను ఓ లేఖ ద్వారా కేంద్రమంత్రి కి తెలియజేశానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా చేసిన అప్పుల వివరాలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

ప్రైవేటు మెంబర్ బిల్లు చర్చకు వచ్చే ఛాన్స్ లేదు
పార్లమెంట్ వచ్చే సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉన్నదని ఒక ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన కథనంపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ… అటువంటి అవకాశమే లేదని కొట్టిపారేశారు. పార్లమెంట్ సభ్యులకు ప్రతి శుక్రవారం ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టి అవకాశాన్ని కల్పిస్తారన్న ఆయన, ఇప్పటివరకు కేవలం రెండు ప్రైవేటు బిల్లులు మాత్రమే పార్లమెంట్ ఆమోదం పొందాయన్నారు. ఆంగ్ల దినపత్రికలో ప్రత్యేకమైన కథనం అంటూ సాక్షి దినపత్రిక ప్రచురించే అవకాశం ఉన్నదని, ఈ ప్రైవేటు మెంబర్ బిల్లు గురించి, అమరావతి రైతులేవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. జ్యుడీషియల్ క్యాపిటల్ కర్నూలు అంటూ చెత్త వ్యాఖ్యలు చేసిన వారి చేతులమీదుగానే 8 అంతస్తులతో కూడిన జ్యుడిషియల్ భవనానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శంకుస్థాపన చేయడం శుభసూచకమని తెలిపారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక బద్దంగా అమరావతిలో ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ సిటీలోనే జుడిషియల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. బిజెపి కూడా రాజధానిగా అమరావతి కే మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతుండడం అభినందనీయమన్నారు.

న్యాయ వ్యవస్థపై వ్యాఖ్యలా?… ఇదెక్కడి విడ్డూరం
న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తూ, న్యాయమూర్తులకు హెచ్చరికలు చేయడం ద్వారా సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుడు వెంకట్రామిరెడ్డి లక్ష్మణ రేఖ దాటారని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.
న్యాయ వ్యవస్థ పై గతంలో వ్యాఖ్యలు చేసిన కొంతమంది వ్యక్తులపై సుమోటోగా కేసులను నమోదు చేసి అరెస్టు చేయడం జరిగినది, మూడు నెలలైనా వారికి బెయిల్ ఇవ్వలేదని గుర్తు చేశారు. అయితే న్యాయవ్యవస్థ పై వ్యాఖ్యలు చేసిన వారికి మూడు నెలలైనా బెయిల్ ఇవ్వకపోగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినవారికి వెంటనే బెయిల్ ఇవ్వడం ఏమిటని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగికి, జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏమిటన్న ఆయన, ముఖ్యమంత్రి పాలనలో లోపాలు ఉంటే ఎత్తిచూపే అవకాశాన్ని రాజ్యాంగమే కల్పించిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిపై ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే వారికి 30 రోజులపాటు బెయిల్ రాకుండా చూడాలన్న వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు, తననుద్దేశించి చేసినట్లుగానే కనిపించాయన్నారు. న్యాయ వ్యవస్థ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వెంకట్రామిరెడ్డి పై రిజిస్టార్ జనరల్ సుమోటోగా కేసు నమోదు చేయాలని, ఈ తరహా వ్యాఖ్యలు చేసే వారిని కట్టడి చేయడానికి ఒక హెచ్చరిక లాగా ఉంటుందని చెప్పారు.

మద్యం నగదు విక్రయాలపై సిబిఐ విచారణ కోరుతూ గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు లేఖ రాయాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. ఢిల్లీలో మద్యం అమ్మకాలలో అవకతవకలపై లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐ విచారణ కోరినట్లుగానే, రాష్ట్రంలో 30 నుంచి 35 వేల కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరుగుతున్న మద్యం విక్రయాలపై సిబిఐ విచారణ కోరాలన్నారు.

ఆ మాటల్ని సాక్షి ఎందుకు ఎడిట్ చేసిందో…?
పతనమైన మానవుని ఉన్నత పదవిలో పెడితే ఇలాగే ఉంటుందన్న తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రముఖ దినపత్రికలు తమ వార్త కథనంలో ప్రచూరించగా, సాక్షి దినపత్రిక మాత్రం ఎడిట్ చేయడం పరిశీలిస్తే… ఆ వ్యాఖ్యలు మా నాయకున్ని ఉద్దేశించి అన్నారేమో నన్న అనుమానం కలిగిందని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. భూమన కరుణాకర్ రెడ్డి మంచి భావాలు ఉన్న వ్యక్తి అని, పిన్న వయసులోని ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లారన్నారు.

వైఎస్ రాజకీయ జీవితానికి బలమైన పునాదులు వేసిన నాయకుడు రాజీవ్ గాంధీ
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితానికి భారత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ బలమైన పునాదులను వేశారని రఘురామకృష్ణం రాజు అన్నారు. వైయస్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షునిగా నియమించి ఆయన్ని రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారని పేర్కొన్నారు. అయినా కొంతమంది నాయకులు చేసిన మేలును మరిచిపోయినప్పటికీ, వైఎస్ అభిమానులు మాత్రం రాజీవ్ గాంధీని ఎప్పటికీ స్మరించుకుంటూ నే ఉంటారని రఘురామకృష్ణం రాజు అన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాజీవ్ చిత్రపటానికి పూలను వేసి ఆయన ఘనంగా నివాళులు అర్పించారు.

Leave a Reply