Home » ఏబీవీ తో పెట్టుకున్నవారికి పెట్టుకున్నంత!

ఏబీవీ తో పెట్టుకున్నవారికి పెట్టుకున్నంత!

– ఏబీవీ తో పెట్టుకున్నవారికి పెట్టుకున్నంత!

(భోగాది వేంకట రాయుడు)

బహుశా అది 2001వ సంవత్సరం కావచ్చు. ఏ బీ వెంకటేశ్వర రావు అనే ఓ ఐపీఎస్ అధికారి అప్పటి తూర్పు గోదావరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా ఉన్నారు.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుసుగా.రాజమండ్రి శాసన సభ్యులు గా చక్రం తిప్పుతున్నారు.. పై పెచ్చు, ఆయన అధికార పార్టీకి చెందిన నాయకుడు కూడా. చంద్రబాబు నాయుడేమో యధావిధిగా ముఖ్యమంత్రి (ఇంకో పదవి ఆయనకు సూటవ్వదు, మరి…)గా మాంచి ఊపు మీద ఉన్నారు.

ఒక రోజు బుచ్చయ్య చౌదరి కాకినాడ లోని ఎస్ పీ కార్యాలయానికి వచ్చారు. కుశలాలు, కాఫీ లు అయిన తరువాత, బుచ్చయ్య అసలు విషయం లోకి వచ్చారు.రాజమండ్రి నగరం లో ఓ ఇద్దరు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ( ఎస్ ఐ లు ) తలనొప్పిగా తయారయ్యారని, వారిని మార్చి; ఫలానా వారిని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు గా పోస్టింగ్ ఇవ్వాలని ‘రిక్వెస్ట్’ చేశారు.

ఏబీ వెంకటేశ్వర రావు ఓ చిరునవ్వు నవ్వారు.

” తప్పకుండా సర్. కాకపోతే ఓ చిన్న రిక్వెస్ట్. ఎవరిని ఎక్కడ వేయాలో మీరు నాకు ఓ జాబితా ఇవ్వండి . వేస్తాను. అలాగే,రాజమండ్రి ఎంఎల్ఏ గా మీరు ఏమి చేయాలో నేనో జాబితా ఇస్తాను. మీరు అవి చేయండి.అప్పుడు మనిద్దరికీ ఇబ్బంది ఉండదు…. ” అన్నారు.

అంతే, బుచ్చయ్య చౌదరి – కుర్చీలోంచి లేచారు. ఏ బీ వీ కూడా లేచారు. బుచ్చయ్య… రెండు చేతులూ ఎత్తి నమస్కారం పెట్టారు. ఎస్ పీ కూడా ప్రతినమస్కారం పెడుతూ….తన ఛాంబర్ తలుపు వరకూ వచ్చి, బుచ్చయ్య కు వీడ్కోలు వీడ్కోలు చెప్పారు. ఏ బీ వెంకటేశ్వర రావు ను ఒక విలేకరి ” ఎన్ టీ రామారావు కు తక్కువ… గుమ్మడి కి ఎక్కువ… ” అని ఆయన మొహం మీదే, జవహర్ రెడ్డి సమక్షం లోనే వ్యాఖ్యానించాడు. (ఏ బీ వీ తూర్పు గోదావరికి ఎస్ పీ గా ఉన్న సమయం లో జవహర్ రెడ్డి కలెక్టర్.)

ఏ బీ వీ, బుచ్చయ్య ఇద్దరూ ఒకే కులం. మళ్ళీ మాట్లాడితే ముగ్గురూ(చంద్రబాబు )ఒకటే కులం. పైపెచ్చు బుచ్చయ్య…అధికార పార్టీ లో బాగా నోరున్న నేత. అయినా, ఏబీ వీ తో దేనికి అదే.

అదీ ఏ బీ వి వ్యవహార శైలి. నోటితో మృదువుగా ఉంటారు. భావ వ్యక్తీకరణ లో సౌకుమార్యం ఉంటుంది. విధి నిర్వహణ మాత్రం ధృఢం గా ఉంటుంది. ఇప్పటికీ అదే పోకడ. అందుకేనేమో, ఈ తలనొప్పి మనకుందుకులే అనుకుని ; గత ఐదేళ్లుగా విధులకు దూరంగా ఉంచారేమో కూడా తెలియదు.

2001 కి 2019 కి పెద్ద తేడా ఏముంది! మహాఅయితే ఓ ఇరవై ఏళ్ళు.ఇప్పటి ఐపీఎస్ అధికారుల వ్యవహార శైలి….. ఏబీవీ మైండ్ సెట్ కు పూర్తి భిన్నం గా కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నది. ఇప్పటి ఐపీఎస్ లలో చాలామంది మైండ్ సెట్ ను అప్పటి ఐపీఎస్ అధికారుల వ్యవహార శైలి తో పోల్చి చూసుకుంటుంటే… భయం వేయక మానదు.

కొందరు పోలీసు అధికారులపై మీడియా లో తరచుగా… అతి తరచుగా వస్తున్న కొన్ని కథనాలైతే….చదవడాని కే జుగుప్సా కరంగా ఉంటున్నాయి.

డబ్బు, కులం, ప్రజల జీవితాలతో ఆడుకునే రాజకీయ పార్టీ ల పట్ల వల్లమాలిన అభిమాన, దురభిమానాలు…. మొదలైన సంఘ వ్యతిరేక లక్షణాలతో నిలువెల్లా నిండిపోయిన పలువురి పోలీసుల చేతుల్లో…. సమాజ గమనం ఏ దిశగా…. ఎక్కడికి నడుస్తోంది అంటూ పలువురు బుద్ధి జీవులు, విజ్ణులు, ఆలో

నా పరులు ఆందోళన చెందుతున్న వేళ లో….ఏ బీ వెంకటేశ్వర రావు పేరు గత పది, పదిహేను రోజులుగా హఠాత్తుగా తెరమీదికి వచ్చింది. ఆయన ఇప్పుడు డీజీపీ క్యాడర్ పోలీస్ ఆఫీసర్. సోషల్ మీడియా లో ఆయన పేరు హోరు గాలిగా సుడులు తిరుగుతున్నది.

ఏపీ తాత్కాలిక డీజీపి రాజేంద్రనాధ్ రెడ్డి ని విధుల నుంచి తొలగిస్తారని …. ఆ స్థానం లో ఏ బీ వెంకటేశ్వర రావు ను డీజీపీ గా నియమిస్తారని, ఢిల్లీ లో డిసైడ్ అయిపోయిందని…., అది అని, ఇది అని సోషల్ మీడియాలో భారీ ప్రచారం.

ఈ సమాచారం తో ఏ యూ ట్యూబ్ చానెల్ లో ఏమి వచ్చినా, నిముషాల్లో వైరల్ అయిపోతున్నది.

“ఏబీ వెంకటేశ్వర్రావే కొత్త డీజీపీ ” అంటూ ఏదో ఒక వీడియో… యూ ట్యూబ్ లో రిలీజ్ కావడం ఆలస్యం….; ముప్ఫయ్ వేలు, నలభై వేలు, యాభై వేలల్లో వ్యూస్ వెల్లువలా ఆ సోషల్ మీడియా ఛానల్ ను ముంచెత్తేస్తున్నాయి.

వీటి పుణ్యమా అని గత ఐదేళ్లుగా అడపా దడపా తప్ప, పెద్దగా వినిపించని ఏ బీ వెంకటేశ్వర రావు పేరు రెండు తెలుగు రాష్ట్రాల లోనూ ఇప్పుడు మోగి పోతున్నది.

నిజానికి, రెండేళ్లపాటు డీజీపీ చేసి రిటైర్ అయినవారికి కూడా దక్కనంత గా కీర్తి ప్రతిష్టలు ఆయనకు – డీజీపీ కాకుండానే…. డీజీపీ అయినదాని కంటే ఎక్కువ గా దక్కాయి అనిపిస్తున్నది. ఇందుకు, జగన్ ప్రభుత్వానిదే ఘనత. ఆయనను సస్పెండ్ చేసి, వేటాడకుండా ఓ పక్కన పడేసి ఉండి ఉంటే ; ఆయనను గురించి పెద్దగా తలుచుకుని ఉండేవారు కాదు.

ఇంత జరిగాక; ఇక,ఇప్పుడు డీజీపీ అయితే ఎంత….., కాకపోతే ఎంత అనిపిస్తున్నది.

కని పెంచిన తల్లి దండ్రులు, బంధుమిత్రులు, పరిచయస్తులు…. అందరూ గర్వ పడతారు, వెంకటేశ్వర రావు సంపాదించుకున్న ఘన ప్రతిష్ట చూసి.

ఇంతకీ, విషయం ఏమిటంటే ; ఆయన ఇండియన్ పోలీస్ సర్వీస్ లోనే ఉన్నారు గానీ, ప్రభుత్వ విధుల్లో లేరు. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వం లోని ఏపీ ప్రభుత్వం ఆయనను 2019 నుంచీ సస్పెన్షన్ లోనే ఉంచింది. ఆయనను సస్పెన్షన్ లోనే ఉంచడానికి…. ప్రభుత్వం కోట్లకు కోట్లు ఖర్చుకూడా చేసి ఉంటుంది.

ఆయన సర్వీసేమో వచ్చేనెల 31 తో ముగుస్తుంది. అంటే ఓ యాభై రోజులే ఆయన పోలీస్ సర్వీస్ లో ఉంటారు.

ఎన్నికలేమో మరో ముప్ఫయ్ రోజులలో ఉన్నాయి.

ఆయన…. ఎప్పుడు, ఎలా డీజీపీ అవుతారో తెలియక పోయినా ; అవ్వాలని కోరుకునేవారి సంఖ్య, యూ ట్యూబ్ చానళ్ళ లో వీక్షకులు పెట్టే కామెంట్స్ చూస్తుంటే, ఆశ్చర్యం కలగక మానదు, ఆయన డీజీపీ అవ్వాలని వారు ఎంత బలం గా కోరుకుంటున్నారో అని.

అయితే, గత అయిదేళ్లగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై చేస్తున్న పోరాటం చూస్తుంటే ; రేపు మే 31 న డీజీపీ క్యాడర్ లో ఆయన పదవీ విరమణ చేసినప్పటికీ, ఆయన పోరాటం ఆగకపోవచ్చు. ఆ పోరాటం మరో రూపం తీసుకోవచ్చు.

అయిదేళ్లుగా ప్లీడర్లు, కోర్టులు, సర్వీస్ రూల్సు, ఐపిసీ తో కుస్తీ పడుతున్నందున ; ఆయనకూ పట్లు బాగానే వంటబట్టి ఉంటాయి.

ఐ పీ ఎస్ అనే స్వర్ణ పంజరం లో నుంచి స్వేచ్చా ప్రపంచం లోకి అడుగుపెట్టిన తరువాత, మరో ఏ బీ వెంకటేశ్వర రావు ను ఆయన అభిమానులు, దురభిమానులూ, చూస్తారు.

ఆలస్యం -మే 31 దే కానీ, ఆయనది కాదు.

Leave a Reply