వైసీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారు

Spread the love

-ఆడబిడ్డలపై జరుగుతున్న అఘాయిత్యాలనూ రాజకీయ లబ్ధికి వాడుకుంటారా?
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

వైసీపీ ప్రభుత్వ దిగజారుడు రాజకీయాలకు అంతే లేకుండాపోతోంది. విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న 9వ తరగతి బాలిక ఘటన ద్వారానూ రాజకీయ లబ్ధిపొందేందుకు అధికార పార్టీ నేతలు ప్రాకులాడటం నీచమైన చర్య. విషయం తెలిసిన వెంటనే నిందితుడు వినోద్ జైన్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశాము. బాధిత కుటుంబాన్ని తెలుగు మహిళా విభాగం ప్రతినిధులు పరామర్శించారు.

ఆడబిడ్డలకు అండగా నిలబడటం చేతకాని మీరు మాపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. గడిచిన రెండున్నరేళ్లలో మహిళలు, చిన్నారులు, వృద్ధులపై అఘాయిత్యాలు, లైంగిక దాడులు జరిగితే ఒక్కరిపైన కూడా చర్యలు తీసుకోలేదు. బాధితులకు అండగా నిలబడలేదు. బాలిక జీవితాన్ని చిదిమేసిన కేసులో అరెస్టయిన వైసీపీ నేత కన్నా భూశంకర్ రావును దిశా కింద ఎందుకు ఉరితీయలేదు? విశాఖ జిల్లాలో ఓ బాలికను కామాంధుడు అత్యాచారం చేస్తే దిక్కులేదు.

పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితుడిని శిక్షించకపోవడంతో మనస్థాపం చెందిన బాలిక తండ్రి ఆత్మహత్యాయత్నం చేయడం దేనికి సంకేతం? దిశా చట్టం కింద మీరు నిందితులకు ఉరివేయరని తెలుసుకున్న బాధితులే ఉరివేసుకుంటున్న పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి చేతకానితనం కారణం కాదా? ఇప్పటికైనా మహిళా భద్రతపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలి. ఊరికొకరున్న భూశంకర్ రావు లాంటి వాళ్లను శిక్షించాలి. మహిళలు, అభంశుభం తెలియని చిన్నారుల జీవితాలను నాశనం చేస్తున్న మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి.

Leave a Reply