కోదాడలో పేలిన జిలేటిన్ స్టిక్స్…ఉలిక్కిపడ్డ ప్రజలు

కోదాడ: కోదాడ పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం బాంబులు పేలిన శబ్ధాలు కలకలం సృష్టించాయి. వీకెండ్ కావడంతో ఇళ్లలోనే సేదతీరుతున్న ప్రజలు ఆ శబ్ధాలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వాళ్లకు ఇంటి ముందు పెద్ద పెద్ద రాళ్లు పడి ఉండటంతోపాటు మెట్లు, కిటికీలు ధ్వంసమై కనిపించాయి. దీంతో ఆందోళన చెందిన ప్రజలు వీధిలోకి వెళ్లి చూడగా డ్రైనేజీ నిర్మాణ పనులకు జిలెటిన్ స్టిక్స్ పేల్చుతూ కాంట్రాక్టర్ కనిపించాడు.

కోదాడ పట్టణానికి చెందిన 15 వార్డులో మున్సిపాలిటీ చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులను ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. కాగా సదరు కాంట్రాక్టర్ కాలువ తవ్వే క్రమంలో రాళ్లు అడ్డుతగలడంతో కనీస జాగ్రత్తలు పాటించకుండా జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేలుళ్లకు పాల్పడ్డాడు. దీంతో భారీ శబ్ధాలతో పేలినరాళ్లు పరిసర ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారి ఇళ్లపై పడ్డాయి. ముందస్తు సమాచారం లేకుండా ఏ విధంగా బరాలు ( జిలెటిన్ స్టిక్స్) ఎలా వాడుతారని సదరు కాలనీవాసులు కాంట్రాక్ట్‌ను నిలదీశారు.

అయితే వారి పట్ల సదరు కాంట్రాక్టర్ దురుసుగా ప్రవర్తించాడు. ”మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేద… ఇంట్లో తలుపులు పెట్టుకొని ఉండండి” అంటూ ఉచిత సలహా ఇవ్వడం గమనార్హం. అయితే మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతోనే కాంట్రాక్టర్ ఇలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడని, ప్రజల ప్రాణాలు అంటే అధికారులకు అంత అలుసా అంటూ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే కాంట్రాక్టర్ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు. అధికారులు, పోలీసుల పర్మిషన్ లేకుండనే ఇండ్ల మధ్యలో జిలెటిన్ స్టిక్స్ పెట్టి ప్రజల ప్రాణాలు తీయాలని చూస్తున్నారు. ఆదివారం పెట్టిన జిలెటిన్ స్టిక్స్‌తో ఇళ్లలో సుమారు పది కేజీల రాళ్లు ఎగిరి పడ్డాయి. పెద్ద పెద్ద శబ్దాలతో మహిళలు, చిన్న పిల్లలు భయభ్రాంతులకు గురయ్యారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి.

Leave a Reply