– బాబుకి చిత్తశుద్ధి ఉంటే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి
– నంద్యాల జిల్లా వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రాంరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా డిమాండ్.
నంద్యాల: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అరాచకం రాజ్యమేలుతుందని… నంద్యాల జిల్లా వైయస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపైనా ఆంబోతుల్లా రెచ్చిపోతూ, విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.
నంద్యాలలోని శ్రీశైలం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… మద్యం మత్తులో శ్రీశైలంలో అటవీశాఖ సిబ్బందిపై క్రూరంగా దాడి చేసి, కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వ్యవహారశైలిని తీవ్రంగా ఆక్షేపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేయడంతో పాటు పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. .
నంద్యాల ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అర్ధరాత్రి సమయంలో విధినిర్వహణలో ఉన్న అటవీశాఖ అధికారులపై దౌర్జన్యానికి పాల్పడ్డం దారుణం. రాష్ట్రమంతా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి దౌర్జన్యాలు గురించి కోడై కూస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్జీ వర్గాలకు చెందిన అటవీశాఖ అధికారులపై తప్పతాగి చిన్నారుట్ల వద్ద విచ్చలవిడిగా దాడిచేశారు.
అటవీ శాఖకు చెందిన డిప్యూటీ రేంజర్ ఈ ప్రాంతంలో పులి సంచరిస్తోందని.. ప్రజలను అలెర్ట్ చేయడానికి సైరన్ మోగిస్తుంటే వారిపై భౌతిక దాడికి దిగారు. కులం పేరుతో దుర్భాషలాడుతూ పదిగంటల నుంచి అర్ధరాత్రి వరకు హైడ్రామా నడిపించారు. అనంతరం మంత్రి గొట్టిపాటి రవి గెస్ట్ హౌస్ కు తీసుకుని వెళ్లి.. అక్కడ ఎస్టీ కులానికి చెందిన రాముల నాయక్, చెంచు కులానికి చెందిన గురవయ్యను దారుణంగా హింసించారు.
అనంతరం సభ్యసమాజం తలదించుకునేలా వారిని శ్రీశైలం రహదారుల మీద తిప్పారు. ప్రభుత్వ అధికారుల మీద ఈ రకమైన దాడికి దిగిన సంఘటన గతంలో ఎప్పుడూ చూడలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో సైతం ఈ దురాగతంపై వార్తలు వచ్చాయి.ఒక ప్రజా నాయకుడిగా ప్రజలకు ఏ రకమైన మెసేజ్ పంపించినట్లు ? అయినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదు. ముఖ్యమంత్రి సహా అందరూ నటిస్తున్నారు.
బాధితుల తరపున ఎస్టీ కుల సంఘాల ప్రతినిధులు ధర్నా చేస్తే.. కంటి తుడుపు చర్యగా కేసు నమోదు చేశారు. సనాతన ధర్మం అంటూ పదే, పదే చెప్పే పవన్ కళ్యాణ్ కూడా దీనిపై ఏం స్పందించలేదు. ఎమ్మెల్యేలు రాష్ట్రమంతటా ఆంబోతుల్లో విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే మీరు కళ్లు మూసుకున్నారా చంద్రబాబు గారూ ? మీ పార్టీలో అడ్డూ అదుపు లేకుండా ప్రవర్తిస్తూ తప్పులు చేస్తున్న మీ ఎమ్మెల్యేల మీద రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయండి లోకేష్ గారూ?
మీ నిజాయితీ నిరూపించుకోవాలంటే ప్రజలు, దళితుల తరపున మేం కోరేది ఒక్కటే, బుడ్డా రాజశేఖర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాలి. అప్పుడే ప్రజలకు మీపై నమ్మకం కలుగుతుంది చంద్రబాబు గారూ ?. మీ శాఖలో పనిచేస్తున్న అధికారులపై దాడి చేస్తే… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు స్పందించడం లేదు. మీ శాఖలో అధికారులకే న్యాయం చేయలేని మీరు రాష్ట్రానికేం న్యాయం చేస్తారు.
ఇటీవల కొలిమిగుండ్ల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సోదరుడు… భూపాల్ రెడ్డి సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడికి దిగారు. అక్కడే ఉన్న పోలీసు అధికారులు చోద్యం చూస్తూ.. దాడి చేసిన వ్యక్తినే బ్రతిమాలుతున్న దుస్థితి. దాడి చేసి ఇన్ని రోజులైనా ఇంతవరకు కానిస్టేబుల్ పై దాడి చేసిన భూపాల్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఇటీవల రాయచోటిలో వైయస్సార్సీపీకి చెందిన సుదర్శనరెడ్డి అనే న్యాయవాది ఎంపీపీగా ఉన్న తన తల్లి గదిలో కూర్చుని ఉండగా.. అక్కడ నుంచి వెళ్లిపొమ్మని ఎంపీడీఓ ఫిర్యాదు చేస్తే.. పోలీసులు సుదర్శనరెడ్డిని కొట్టుకుంటూ తీసుకెళ్లారు. అంత చిన్న విషయానికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటాహుటిన హెలికాప్టర్ లో వచ్చి ఎంపీడీఓను పరామర్శించారు.
మరి ఇవాళ ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మీ శాఖ ఉద్యోగులపై కూటమి పార్టీ ఎమ్మెల్యే దాడి చేస్తే ఎందుకు మాట్లాడ్డం లేదు? అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే ఏ అరాచకం చేయినా ఫర్వాలేదా ? అధికార పార్టీ నేతల దాడులతో పోలీసులు తమను తాము కాపాడుకోలేకపోతున్నారు. ఇక ప్రజలనేం కాపాడుతారు ? నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో పాటు భవిష్యత్తులో అధికారుల మీద దాడి చేయకుండా కఠినమైన చట్టం తీసుకురావాలి.