– నిందితుడు టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో చర్యలు నిల్
– అధికార పార్టీ ఒత్తిడితో కేసును నీరుగారుస్తున్నారు
– రాజమండ్రిలోనూ హాస్టల్ విద్యార్థినిపై అత్యాచారం
– ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకునే బాలికలకు ఈ ప్రభుత్వంలో రక్షణ లేదా?
– తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి
తాడేపల్లి: కాకినాడ జిల్లా తునిలో గురుకుల పాఠశాలలో చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనలో నిందితుడు టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో అతడిని కాపాడేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మెల్సీ, వైయస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆగ్రహ వ్యక్తం చేశారు.
తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో అధికారపార్టీకి చెందిన నేతలు పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం వల్ల నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కాలకేయులుగా మారి మహిళలు, బాలికల ఉసురు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
తాము ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడిన, అధికార పార్టీ తమను కాపాడుతుందని, కూటమి ప్రభుత్వం తమకే అండగా నిలుస్తుందనే ధీమా నిందితుల్లో పెరిగిపోయిందని అన్నారు. తుని ఘటనలో బాలికపై నిందితుడు అత్యాచారయత్నం చేస్తే, దానిని చూసి సదరు నిందితుడిని పట్టుకున్న వ్యక్తిపైన పోలీసులు ఎదురుకేసు పెట్టారని అన్నారు. పట్టుకున్న వ్యక్తిపైనే ఫోక్సో కేసు పెడతామని బెదిరించారని, ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేయాలని వైయస్ఆర్సీపీ నేతలు ఆందోళనలకు దిగితే తప్ప, పోలీసులు కనీస చర్యలు తీసుకోలేదు.
పట్టుకున్న తర్వాత కూడా కేసును నిర్వీర్యం చేసేందుకే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటన జరగడానికి 24 గంటలకు ముందు రాజమండ్రి సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుతున్న మరో మైనల్ బాకలిను కూడా యువకుడు బయటకు తీసుకువెళ్ళి అత్యాచారం చేశాడని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రోజుకు డెబ్బై నుంచి ఎనబై ఘటనలు అంటే గంటకు మూడు, నాలుగు ఘటనలు మహిళలు, బాలికలపైన జరుగుతున్నాయని అన్నారు.
ఒక మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలోనే మహిళలకు కనీస రక్షణ లేని దారుణమైన పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. నిత్యం మహిళా రక్షణ అంటూ మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే, తునిలో ఇటువంటి ఘటన జరిగిందంటే, నిందితులకు ఈ ప్రభుత్వంపైన ఉన్న ధీమా ఏమిటో అర్థమవుతోందని అన్నారు.