-దాదాపు 4.30 గంటల పాటు సీబీఐ అధికారుల విచారణ
-నేను దుబాయ్‌కి వెళ్లానని వక్రీకరించే వార్తలు రాస్తున్నారు
-మరోసారి రావాల్సి ఉంటుందని అధికారులు ఏమీ చెప్పలేదు
-కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు లో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం తన న్యాయవాదులతో కలిసి రెండో సారి అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. దాదాపు 4.30 గంటల పాటు సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. ఆయన వెంట వచ్చిన తన న్యాయవాదులను అధికారులు లోపలికి అనుమతించలేదు.
ఇవాళ్టి విచారణ అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ”వివేకా కేసు దర్యాప్తులో భాగంగా ఇవాళ రెండో సారి సీబీఐ అధికారులు విచారణకు పిలిచారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు నాకు తెలిసినంత మేరకు సమాధానాలు చెప్పాను. అయితే, ఈ అంశంపై గతంలోనే నేను మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేశాను. ఇప్పుడు మరోసారి కోరుతున్నాను. నేను వైఎస్ విజయమ్మ దగ్గరకు వెళ్లి వస్తే.. ఆమెను నేను బెదిరించి వచ్చినట్లు టీవీల్లో చర్చా కార్యక్రమాలు పెట్టి, అసత్య ప్రచారం చేశారు. ఇది సరైన పద్ధతి కాదు. నేను దుబాయ్‌కి వెళ్లానని వక్రీకరించే వార్తలు రాస్తున్నారు. ఒక అంశంపై విచారణ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని కోరుతున్నా.
మీడియాతో మాట్లాడాను. రెండు రోజుల తర్వాత మరోసారి మీడియాతో మాట్లాడాను. అప్పుడు ఏ విషయాలు వెల్లడించానో.. ఇవాళ అధికారులకూ అదే చెప్పాను. ఎవరు అడిగినా అదే చెప్తాను. సీఆర్‌పీసీ 160 కింద నోటీసు ఇచ్చి విచారిస్తున్నారు. సీబీఐ విచారణ సరైన విధానంలో జరగాలని కోరుతున్నా. హత్య జరిగిన రోజు నేను వెళ్లే సరికి ఘటనా స్థలంలో లేఖ ఉంది.. అది ఎందుకు దాచారు? ఇవాళ లాయర్లను అనుమతించి ఆడియో.. వీడియో రికార్డు చేయాలని కోరాను.
ఇవాళ జరిగిన విచారణ రికార్డు చేసినట్లు లేదు. గత నెల 28న మొదటిసారి నన్ను అధికారులు విచారించారు. అప్పుడు మరోసారి రావాల్సి ఉంటుందని చెప్పారు. ఇవాళ విచారణ అనంతరం మరోసారి రావాల్సి ఉంటుందని అధికారులు ఏమీ చెప్పలేదు” అని అవినాష్ రెడ్డి వెల్లడించారు.