జగన్‌ ఒక విఫల సీఎం

– రాష్ట్రంలో జగన్ పాలన అంతానికి చిలకలూరిపేట సభే నాంది
– చిలకలూరిపేట సభ ఏర్పాట్లపై చంద్రబాబు, లోకేశ్ సమీక్ష, పాల్గొన్న ప్రత్తిపాటి

చిలకలూరిపేటలో నిర్వహించే ఉమ్మడి సభతో సీఎం జగన్‌ పాలన అంతమవడానికి నాంది అవుతోందని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఏపీ ఎన్నికల యుద్ధ క్షేత్రంలో ఓ మైలురాయిగా ఈ సభ నిలిచిపోనుందని తెలిపారు. బుధవారం ఉదయం 9.32 గంటలకు సభ ఏర్పాట్లకు భూమిపూజ చేయనున్నట్లు ఆయన చెప్పారు.

ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ పాల్గొనే ఉమ్మడి మేనిఫెస్టో సభ నిర్వహణపై నిర్వహించిన ఏర్పాట్ల కమిటీ సమావేశంలో ప్రత్తిపాటి పాల్గొన్నారు. ఉండవల్లిలో కమిటీల సభ్యులతో చంద్రబాబు, లోకేశ్ వేర్వేరుగా సమీక్షించారు. అనంతరం పుల్లారావు మీడియాతో మాట్లాడారు. చిలకలూరిపేటలో సభ నిర్వహణకు 125 ఎకరాలను గుర్తించామని ..అన్ని ప్రాంతాలకు చెందిన మూడు పార్టీల ముఖ్య నేతలతో 13 కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

సభ విజయవంతానికి ఏర్పాటైన 13 కమిటీలకు లోకేశ్‌ దిశానిర్దేశం చేశారని…ఆహార, తాగునీటితో పాటు వసతి సదుపాయాల బాధ్యతలు తనకు అప్పగించారని చెప్పారు. జగన్‌ పులినో..సింహాన్నో చూసి భయపడతారు అనుకుంటే ఈ బిల్డప్ జగన్‌ డ్రోన్‌ను చూసి కూడా భయపడ్డాడని ఎద్దేవా చేశారు. గ్రీన్ మ్యాట్ వేసి ప్రజలు సభకు రాకున్నా… దొంగ ఛానెల్ సాక్షి విజువల్స్‌తో మాయచేస్తున్నారని పుల్లారావు విమర్శించారు. సిద్ధం పేరిట బాహుబలి ట్రైలర్ చూపించాలని జగన్‌ ప్రయత్నించి జనానికి పులికేసి అయ్యాడని అవహేళన చేశారు.

చరిత్ర ఉన్నంత వరకూ జగన్‌ ఒక విఫల సీఎంగా మిగిలిపోతాడన్నారు. క్రిమినల్ రికార్డ్ ఉన్నంత వరకూ జగన్ పేరు… చంచల్‌గూడ జైలు గోడలపై ఉంటుందన్నారు. జగన్‌ మాట ఇస్తే తప్పడని బీరాలు పలికే వైఎస్సార్‌సీపీ నేతలు… ఒకసారి ఎన్నికల ముందు ఏం చెప్పాడో గుర్తుతెచ్చుకోగలరా అని పుల్లారావు ప్రశ్నించారు. ఈ మధ్య జగన్‌కు ప్రచార పిచ్చి బాగా పట్టుకుందని… ఎక్కడ చూసినా పోస్టర్లు పెట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. మరుగుదొడ్ల తలుపులపైనా పోస్టర్లు పెట్టుకున్నాడని ప్రత్తిపాటి మండిపడ్డారు.

Leave a Reply